తెలుగు భాషకు వెలుగు జాడలేవి? 


* ఇస్కఫ్ నేత కె.సుబ్బరాజు 
విజయవాడ: ప్రపంచ వ్యాపితంగా కీర్తినార్జించిన తెలుగు భాషకు వెలుగు జాడలు కానరావటం లేదని, తెలుగు నేలల్లో కూడా, తెలుగు భాషా దినోత్సవాన్ని ప్రభుత్వ నేతృత్వంలో వైభవంగా నిర్వహించాలన్న ప్రభుత్వ నిర్ణయం అలంకారప్రాయంగా ముగియడం విచారకరమని భారత సాంస్కృతిక సహకార స్నేహ సంఘం (ఇస్కఫ్) జాతీయ అధ్యక్షులు, మాజీ ఎం.ఎల్.ఎ. కె.సుబ్బరాజు శుక్రవారం ఒక ప్రకటనలో ఆక్షేపించారు. తెలుగు భాషను అన్ని రంగాలలో అత్యున్నత స్థాయిలో వికసింపచేయాలన్న ప్రభుత్వ ప్రగల్భాలు కానీ, 1959-96లో స్వర్గీయ ముఖ్యమంత్రి ఎన్.టి.ఆర్. సమక్షంలో నాటి శాసనసభ ఉమ్మడి శాసనసభ సభ్యునిగా తాను చట్ట సభలో ప్రవేశపెట్టిన అనధికార తీర్మానంపై రెండు శుక్రవారాలలో జరిగిన చర్చలలో తనతో పాటు అధికార, ప్రతిపక్ష పార్టీలు జరిపిన చర్చలో ప్రభుత్వం అంగీకరించి అమలు జరిపిన అతికొద్ది చర్యలు తప్ప సదరు ప్రధాన హామీలు గాలిలో కలిసిపోయాయని తెలుగు భాషా సమితి సభ్యులు కె.సుబ్బరాజు తీవ్రంగా విమర్శించారు. తెలుగు భాషా పరిరక్షణ, ప్రభుత్వ విభాగాలన్నింటితో పాటు పరిపాలన, న్యాయస్థానాల్లో కూడా తెలుగు వినియోగం విధిగా జరగాలన్న నిర్ణయం నీటిమూటగా మిగిలిందన్నారు. తెలుగు విశ్రాంత అధ్యాపకులు, ఇస్కఫ్ నాయకులు డాక్టర్ తాటి శ్రీకృష్ణ మాట్లాడుతూ పలు ప్రాంతాలలో పలు రకాల యాసలు, ప్రాసలతో వున్న తెలుగు భాషను వాడుక భాషగా పామరులకు సైతం చేరువ చేసిన ఘనత గిడుగు రామమూర్తి పంతులుగారిదేనంటూ ఆయన కృషిని భావితరాలకు పంచాల్సిన ప్రభుత్వం గిడుగు జన్మదినాన్ని మొక్కుబడిగా దిగజార్చటం గర్హనీయమన్నారు. చర్చాగోష్ఠిలో ఇస్కఫ్ ఫ్రెండ్స్ సర్కిల్ సభ్యులు పి.వరప్రసాద్, కొరివి సాంబశివరావు, జి.ఎల్.ఆనంద్, మాదాసు శ్రీనివాస్, కైలాసం లక్ష్మీనారాయణ, ఎం.విజయకుమర్, మురళి, ఆచార్య రాధాకృష్ణ, రవి, శర్మ తదితరులు పాల్గొన్నారు.