- రాజధాని కౌలు చెల్లింపును పట్టించుకోని జగన్ సర్కార్
- టిడిపి, బిజెపి ఆందోళనతో దిగిరాక తప్పని వైనం
- గతంలో సీఎంకే లేఖ రాసిన బిజెపి చీఫ్ కన్నా
- విమర్శనాస్ర్తాలు సంధించిన టిడిపి
- రైతులకు రెండు పార్టీల దన్ను
- 187కోట్ల చెల్లింపు ఉత్తర్వులిచ్చిన సర్కార్
- వ్యూహం లేక దెబ్బతిన్నామంటున్న వైసీపీ నేతలు
- ఇది విపక్షాల తొలి విజయం
సీఎం జగన్ ఎవరి మాట వినరు. ఎవరి ఒత్తిళ్లకు లొంగే నేత కాదు. తాను అనుకున్నదే చేస్తారు. ఇదీ ఇప్పటివరకూ జనంలో ఉన్న ఒక అభిప్రాయం. కానీ.. రాజకీయాల్లో పంతాలు, పట్టింపులు ప్రజాగ్రహం ముందు ఎక్కువ కాలం కొనసాగవు. వాటని సరిదిద్దుకోవడం అనివార్యం. అది ఏ పాలకులకులకైనా తప్పదు. అమరావతి భవితవ్యం అగ మ్యగోచరంగా మారిన నేపథ్యంలో రాజధానికి భూములిచ్చిన రైతులకు వార్షిక కౌలు చెల్లింపు సందేహంగా మారిన వైనాన్ని ప్రతిపక్ష టిడిపి, బిజెపి తమకు అనుకూలంగా మార్చుకోవడంలో విజయం సాధించాయి. సర్కారు కూడా రైతుల ఆందోళనకు దిగి వచ్చి, కౌలు చెల్లింపు ప్రక్రియకు గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడం అభినందనీయం. నవ్యాంధ్ర రాజధాని కోసం స్వచ్ఛందంగా 34 వేల ఎకరాల భూములిచ్చిన రైతులు దేశంలోనే చరిత్ర సృష్టించారు. నాటి సీఎం చంద్రబాబు దేశంలోనే తొలిసారిగా ల్యాండ్‌పూలింగ్ విధానాన్ని అమలుచేసిన తీరును మహారాష్ట్ర, కర్నాటక వంటి రాష్ర్టాలు అబ్బురపడి అధ్యయనం కూడా చేశాయి. అయితే, ఎక్కడైతే రైతులు రాజధాని కోసం భూములిచ్చారో, ఆ నియోజవర్గాల్లో టిడిపి ఓడిపోయింది. అది వేరే విషయం. భూములిచ్చిన రైతులకు ప్రతిగా ఏటా కౌలు చెల్లించేందుకు బాబు సర్కారు నిర్ణయించింది. అయితే, ఎన్నికల్లో టిడిపి ఓడిన తర్వాత రాజధాని, అమరావతి భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పటివరకూ అమరావతి, రాజధాని నిర్మాణంపై సర్కారు వైఖరేమిటన్నదీ అధికారికంగా స్పష్టం కాలేదు. దానికితోడు మంత్రి బొత్స పొంతన లేని వ్యాఖ్యతో రైతు గందరగోళంలో పడ్డాడు.
దానితో ఆగ్రహించిన రైతు రోడ్డెక్కగా, వారికి టిడిపి, బిజెపి బాసటగా నిలిచాయి. టిడిపి అధినేత చంద్రబాబునాయుడు, బిజెపి చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ వద్దకు రాజధాని రైతులు వచ్చి, తమ బాధలు వెళ్లబోసుకున్నారు. దానితో బిజెపి ఒక అడుగు ముందుకేసి.. కన్నా లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో కేంద్ర మాజీ మంత్రి సుజనాచౌదరి తదితర బిజెపి నేతలు అక్కడికి వెళ్లి వారి గళంతో జతకలిపారు. రాజధానిని తరలిస్తే సహించేది లేదని, రైతులకు కౌలు డబ్బు ఇవ్వాలని డిమాండ్ చేశారు. బొత్సతో సీఎం మాట్లాడిస్తున్నారా? అని ప్రశ్నించారు. దానికంటే చాలారోజుల ముందే బిజెపి చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ.. రైతులకు కౌలు చెల్లించాలని సీఎం జగన్‌కు లేఖ రాశారు. బొత్స వ్యాఖ్యలతో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా మారిపోయి.. ఒక్క అంశంపైనే టిడిపి-బిజెపి వేర్వేరుగా అయినా సమరశంఖం పూరించడం, రైతులు ఆ రెండు పార్టీలను ఆశ్రయించం, అందులో వైసీపీ మద్దతుదారులయిన రైతులు కూడా ఉండటంతో సర్కారు ఆత్మరక్షణ లో పడింది. దానితో.. 187.40 కోట్లు విడుదల చేయాల్సి వచ్చింది. ఇది భూములిచ్చిన రైతుల్లో ఆందోళన తగ్గించగా.. అదే సమయంలో జగన్ తొలిసారి ఒక మెట్టు దిగేందుకు కారణమయింది. దీనిపై బిజెపి నేతల్లో సమరోత్సాహం కనిపిస్తోంది. కౌలు చెల్లింపు కోసం తాము లేఖ రాయడంతోపాటు.. రైతు సభ నిర్వహించటం ద్వారా సర్కారుపై ఒత్తిడి పెంచినందుకే, జగన్ సర్కారు దిగివచ్చిందని బిజెపి నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. కన్నా లక్ష్మీనారాయణ అధ్యక్షుడిగా వచ్చిన తర్వాత ప్రజా సమస్యలకు సంబంధించి సాధించిన తొలి విజయంగా బిజెపి నేతలు చెబుతున్నారు. ఇది తమ పార్టీలో నైతిక స్ధైర్యం పెంచిందని, ప్రభుత్వం ప్రజావ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటే భవిష్యత్తులో తమ వైఖరి ఇలాగే ఉంటుందని బిజెపి నేతలు స్పష్టం చేస్తున్నారు. అటు టిడిపిలో కూడా ఈ అంశం హుషారునిచ్చినట్లు కనిపిస్తోంది. తమను నమ్మి భూములిచ్చిన రైతుల కోసం, తాము చేసిన పోరాటం వృధా కాలేదని టిడిపి నేతలు చెబుతున్నారు. తాము రాజధాని అంశాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లడం వల్లే జగన్ సర్కారు దిగివచ్చిందంటున్నారు. అటు వైసీపీలో కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సున్నితమైన ఈ అంశాన్ని ఇంతకాలం సాగదీయకుండా ఉండాల్సిందన్న వాదన వినిపిస్తోంది. ఈ విషయంలో తమ పార్టీ-ప్రభుత్వం వ్యూహాత్మకంగా వ్యహరించలేదంటున్నారు. విపక్షాలు డిమాండ్ చేయకముందే కౌలు చెల్లిస్తే ఆ క్రెడిట్ తమకే దక్కి ఉండేదంటున్నారు. కానీ.. ఇప్పుడు టిడిపి-బిజెపి నేతలు కౌలుపై రాద్ధాంతం చే సినందుకే, తాము కౌలు డబ్బు ఇచ్చామన్న సంకేతాలు ప్రజల్లోకి వెళ్లాయని విశ్లేషిస్తున్నారు. దానివల్ల ఇచ్చిన ఫలితం కూడా దక్కకుండా పోయిందన్న వ్యాఖ్యలు వైసీపీ వర్గాల్లో వినిపిస్తున్నాయి. ఏదేమైనా.. రాజకీయాలు, ఎత్తు పై ఎత్తులు ఎలా ఉన్నా, భూములిచ్చిన రైతులకు కౌలు చెల్లించడం అభినందనీయమేనని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. కాకపోతే ఈ మొత్తం వ్యవహారంలో బిజెపికి ఒక తొలి విజయం లభించగా, టిడిపి పోరాటం పదునెక్కినట్లయింది.
సర్కారుపై విపక్షాల సవారీ