విజయవాడలో కొత్త ట్రాపిక్ సిగ్నల్ వ్యవస్థ

 



విజయవాడ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో కొత్త ట్రాఫిక్ సిగ్నలింగ్ వ్యవస్థ రాబోతోంది. ప్రయోగాత్మకంగా 17 కూడళ్లలో ఏటీసీఎస్‌ (అడాప్టివ్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌ సిస్టమ్‌) ను ఏర్పాటు చేయనున్నారు. నగరంలో దాదాపు 180 కూడళ్లు ఉన్నాయి. సమీకృత ఇంటెలిజెంట్‌ సిగ్నలింగ్‌ వ్యవస్థ ద్వారా అన్ని సిగ్నళ్లను ఒకదానితో ఒకటి అనుసంధానిస్తారు. ఇవి కేంద్రీకృత నియంత్రిత విధానం ద్వారా పని చేస్తాయి. వీటికి ప్రత్యేక కెమెరాలను ఏర్పాటు చేస్తారు. ఇవి వాహనాలను లెక్కించి, వాటిని వర్గీకరించి సమాచారాన్ని కమాండ్‌ కంట్రోల్‌ కేంద్రానికి పంపిస్తాయి. వాహనాల రద్దీని బట్టి సిగ్నల్‌ పడుతుంది. ఎక్కువ వాహనాలు ఉండే మార్గంలో ట్రాఫిక్‌ను క్లియర్‌ చేయడానికి అధిక సమయం ఆకుపచ్చ లైట్‌ వస్తుంది. సిగ్నలింగ్‌ వ్యవస్థ అంతా సౌరశక్తితో పని చేస్తుంది. ఎవరైనా నిబంధనలను ఉల్లంఘిస్తే నేరుగా చలానా జారీ అవుతుంది. వీటికి సెన్సార్లు ఉంటాయి. అలాగే ముఖ్యమైన కూడళ్లలో పబ్లిక్‌ అడ్రస్‌ సిస్టం ఉంటుంది. ఎల్‌ఈడీ బోర్డులను ఏర్పాటు చేస్తారు. వీటిపై ట్రాఫిక్‌ నిబంధనలు, ముఖ్యమైన సూచనలు, వాతావరణం, తదితర వివరాలు వస్తుంటాయి.