పోలవరంపై కేంద్రం మందలించినా మారని వైఖరి


* సమస్యలు కొనితెచ్చుకుంటున్న ప్రభుత్వం
* మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి 
గుంటూరు: జగన్మోహన్‌రెడ్డి ఢిల్లీ పర్యటన ప్రాజెక్టుల నిర్మాణాలను నిలిపివేసేందుకే అన్నట్లుగా ఉందని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం గుంటూరులోని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... పరిపాలన అంటే సమస్యలను ఏ విధంగా పరిష్కరించాలో కనుగొనాలి కానీ జగన్మోహన్‌రెడ్డి కొత్త సమస్యలను కొనితెచ్చుకుంటున్నారు. తెలుగుదేశం హయాంలో ప్రారంభమైన అన్ని పనులను ఆపేసి జనజీవనాన్ని అస్తవ్యస్థం చేస్తున్నారు. అధికారం శాశ్వతం కాదు. ఒకసారి ప్రజలు అధికారం ఇచ్చిన తరువాత వాళ్ల రుణం తీర్చుకోవాలి. కానీ జగన్మోహన్‌రెడ్డి ప్రజలందరు ఇబ్బంది పడేలా పాలన సాగిస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్రం నిధులు సమకూరుస్తుంది. పోలవరం ప్రాజెక్టు అథారిటి ప్రాజెక్టు (పిపిఏ) ఇప్పుడున్న కాంట్రాక్టర్లను కొనసాగించాలని చెప్పిన తరువాత కూడా జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం మొండి వైఖరి అవలంబిస్తోంది. పోలవరం విషయంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో రెండు మార్గాలు మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒకటి జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం మొండి వైఖరి విడనాడి పోలవరం త్వరితగతిన పూర్తి చేయడానికి ప్రణాళిక రూపొందించుకోవడం. రెండు పోలవరం నిర్మాణాన్ని కేంద్ర జల వనరుల శాఖే బాధ్యతలు తీసుకొని నిర్మాణం చేపట్టడం. గతంలో జగన్మోహన్‌రెడ్డి నిండు శాసనసభ సాక్షిగా పోలవరం కేంద్రం చేపట్టవలసిన ప్రాజ్టెని అనేక మార్లు మాట్లాడటం జరిగింది. ఈ రోజు దేశంలో నడుస్తున్న 15 నీటి పారుదల ప్రాజెక్టులలో అత్యంత వేగంగా నడుస్తున్న ప్రాజెక్టులలో పోలవరం ఒకటి. ఆ నాటి కేంద్ర మంత్రి గట్కారీ ఆదేశాలను అనుసరించి, పోలవరం ప్రాజెక్టు అథారిటీ నిబంధనలను ఉల్లంఘించకుండా పనులు అత్యంత వేగంగా చేయడం జరిగింది. మా పర్యవేక్షణ చూసి మంత్రి అనేక మారులు కొనియాడారు. కానీ ఇప్పుడు జగన్‌ ప్రభుత్వం చేస్తున్న రీ-టెండరింగ్‌ సరికాదని కేంద్ర జలవనరుల శాఖామంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌, పోలవరం ప్రాజెక్టు అథారిటీ చెబుతున్నప్పటికీ ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తోంది. బొత్స సత్యనారాయణ ఈ మధ్య అనేక అంశాలపై ఆయన మాట్లాడిన వ్యాఖ్యలను పునఃసమీక్షించుకోవాలి. ఆయన అనేక అంశాలపై మాట్లాడుతూ ఒక గందరగోళాన్ని సృష్టిస్తున్నారు. అమరావతి మార్చాలన్న అంశం ఇప్పుడు తీసుకురావడం సరైనది కాదు. ముఖ్యమంత్రి ప్రజాలనుద్దేశించి ప్రజా సమస్యలపై మాట్లాడటం లేదు. ప్రజల సంశయాలను నివృతి చేయాలనే ఆలోచన ఆయనకు లేదని సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి విలేకరుల సమావేశంలో తెలిపారు.