మైసూరు నుంచి తరలించాలని కేంద్రం నిర్ణయం
ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడి చొరవే కారణం
నెల్లూరు : ప్రతిష్ఠాత్మక ప్రాచీన తెలుగు అధ్యయన కేంద్రం నెల్లూరుకు తరలిరానుంది. కేంద్ర ప్రభుత్వం తెలుగు కేంద్రం ఏర్పాటుకు గతంలో అనుమతిచ్చినా, తెలుగు రాష్ట్రాల నడుమ ఏకాభిప్రాయం కుదరకపోవటంతో, కర్ణాటకలోని మైసూరులో దాన్ని ప్రారంభించారు. తాజాగా దాన్ని ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరుకు తరలించాలని కేంద్ర మానవ వనరులశాఖ నిర్ణయించింది. ప్రస్తుతానికి కేంద్రాన్ని ఆంధ్రప్రదేశ్‌కు మార్చారని, ఇతర పాలనాపరమైన అంశాలు త్వరలో చేపట్టనున్నట్టు సంబంధిత అధికారి ఒకరు తెలిపారు. ప్రస్తుతం మైసూరులోని భారతీయ భాషా కేంద్రీయ సంస్థ(సీఐఐఎల్)లో పనిచేస్తున్న ఈ కేంద్రానికి పూర్తి స్థాయి ప్రాజెక్టు సంచాలకుడిగా ఆచార్య డి.మునిరత్నంనాయుడు వ్యవహరిస్తున్నారు. అందులో మరో తొమ్మిది మంది పనిచేస్తున్నారు.
కేంద్రం తరలింపు వెనుక : నెల రోజుల క్రితం మైసూరులో సీఐఐఎల్ స్వర్ణోత్సవాలను ప్రారంభించిన ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు అదే ప్రాంగణంలో నడుపుతున్న ప్రాచీన తెలుగు కేంద్రాన్ని సందర్శించారు. అనంతరం ఈనెల 17వ తేదీన కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్‌ను పిలిచి నెల్లూరులో ఎప్పటి నుంచో పెండింగ్‌లో ఉన్న రీజినల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్(ఆర్ఐఈ) ఏర్పాటుపై చర్చించారు. ఈ సందర్భంగా తెలుగు కేంద్రం తరలింపుపైనా చర్చించినట్లు సమాచారం.
నెల్లూరుకు ప్రాచీన తెలుగు అధ్యయన కేంద్రం