పల్నాడులో వైకాపా దాడులను నిలువరిద్దాం టి.డి.పి.అధినేత చంద్రబాబు

అంతిమతీర్పు.23.8.2019


పల్నాడులో వైకాపా దాడులను నిలువరిద్దాం; సంఘటితంగా పోరాడేలా కార్యాచరణ అమలు చేద్దాంః తెదేపా అధినేత చంద్రబాబు  ఏపీలో వైకాపా ప్రభుత్వం అరాచకాలు, దౌర్జన్యాలను నివరించడానికి కార్యాచరణ అమలు చేద్దామని తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు కార్యకర్తలకు భరోసా ఇచ్చారు. గుంటూరులోని తెదేపా రాష్ట్ర కార్యాలయానికి తరలివచ్చిన నాయకులు, కార్యకర్తలను ఉద్దేశించి చంద్రబాబు మాట్లాడారు. రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో తెదేపా కార్యకర్తలపై ముఖ్యంగా పల్నాడు ప్రాంతంలో వైకాపా దాడులు మితిమీరిపోయాయని కార్యకర్తలు చంద్రబాబు దృష్టికి తీసుకువచ్చారు.వైకాపా నాయకులు పోలీసుల అండతో గ్రామాల్లో ఉండకుండా తమను పంపించేశారని ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్ నాయకత్వంలో వైకాపా నేతలు ఇష్టారాజ్యంగా చేస్తున్న దౌర్జన్యాలను ఎదుర్కొనేందుకు అన్నిస్థాయిల్లో తెదేపా నాయకత్వాన్ని పటిష్టపరుస్తున్నామని పేర్కొన్నారు. అహంభవంతో వ్యవహరిస్తున్న జగన్ ను మెడలు వంచి కార్యకర్తలకు అండగా నిలబడి, న్యాయం చేస్తానని స్పష్టం చేశారు. అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లో అప్రతిష్టపాలైన వ్యక్తి జగన్ అని విమర్శించారు. తెదేపా కార్యకర్తలపై దాడులు, బాధితులపైనే అక్రమంగా కేసులు, వేధింపులు, డ్వాక్రా మహిళలను, యానిమేటర్లను  ఆశా వర్కర్లు, అంగన్వాడీ కార్తకర్తలను, కాంట్రాక్టు ఉద్యోగులను,ప్రతిపక్ష పార్టీ సానుభూతిపరులకు సంక్షేమ పథకాలు రద్దు చేయడంతో మూడునెలల్లో జగన్ కు విపరీతమైన వ్యతిరేకత వచ్చిందన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు శాంతిభద్రతలు కాపాడామని గుర్తు చేశారు. వైకాపా పాలనలో రౌడీయిజం, అరాచకాలు పెరగడంతో తెదేపా కార్యకర్తలు కష్టాలు పాలవడం బాధాకరమన్నారు.37 ఏళ్ళక్రితం ఆవిర్భవించిన తెదేపా ఎన్నో సంక్షోభాలను, సంక్లిష్టలను ఎదుర్కొని నిలబడిందని గుర్తు చేశారు. రాజకీయ సంక్షోభాలలోనే నాయకత్వ పటిమ బహిర్గతం అవుతుందని చెప్పారు. పిరికివాళ్ళని తెలిస్తే ఎదుటిపక్షం అవమానకరంగా వ్యవహరిస్తుందని పేర్కొన్నారు. తెదేపాకు ఉన్న పటిష్టమైన క్యాడర్ సంక్షోభాలలోనే ధైర్యంగా నిలబడి పోరాడాలని సూచించారు. జగన్ దుష్టపాలనను నిలవరించడంలో కార్యకర్తలకు అండగా ఉండటానికి తానే రంగంలో దిగుతానని భరోసా కల్పించారు. తాను వస్తా వైకాపా నాయకులకు వార్నింగ్ ఇస్తానని పేర్కొన్నారు ప్రజల్లో జగన్ ను నీచుడు, నేరస్తుడి కింద నిరూపిస్తానని స్పష్టం చేశారు. తాను ఒకటి అనుకున్న తర్వాత కష్టమైనా, నష్టమైనా ఎదిరించి కార్యకర్తలకు న్యాయం జరిగే వరకూ పోరాడుతానని స్పష్టం చేశారు. రాష్ట్రంలో వైకాపా దాడులకు భయపడి ఇళ్ళను, ఊళ్ళను వదిలిపెట్టిన కార్యకర్తలు, నాయకులు తిరిగి స్వగ్రామాలకు చేరుకోవాలని చెప్పారు. ప్రజాస్వామ్యంలో ప్రతిఒక్కరికీ నివసించే హక్కు, మాట్లాడే స్వేచ్ఛ ఉందని పేర్కొన్నారు. రాష్ట్రంలో తెదేపా అన్నిస్థాయిల్లో నాయకులు, కార్యకర్తలూ సంఘటితంగా మెలగడం మూలంగానే వైకాపా అరాచకాలకు అంతం పలకడం సాధ్యమన్నారు. ఎటువంటి భయసందేహాలకు చోటులేకుండా తమ ఇళ్ళకు చేరుకునేందుకు కార్యకర్తలకు శాసనసభ్యులు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గ బాధ్యులు, మండల, జిల్లా, రాష్ట్రస్థాయి నాయకత్వం వెన్నంటి నిలుస్తుందని భరోసా ఇచ్చారు.తెదేపా రాష్ట్ర కార్యాలయంలో లీగల్ సెల్ ఏర్పాటు చేశామన్నారు. వైకాపా దాడులకు గురైన తెదేపా కార్యకర్తలకు న్యాయసహాయం చేయడంలో భాగంగా కోర్టుల్లో పిటీషన్ వేద్దామని సూచించారు. టీడీపీ నాయకత్వం ఐకమత్యంతో దాడులు జరిగే ప్రాంతాలకు వెళితే వైకాపా రౌడీమూకలు తోకముడుస్తాయన్నారు.కార్యకర్తలకు ధైర్యం ఇవ్వడానికి తెదేపా నాయకత్వంతోపాటు తాను సైతం రంగంలోకి దిగుతానని పేర్కొన్నారు.సమస్యల.పరిష్కారానికి అంచెలంచెలుగా పోరాట కార్యచరణను అమలు చేస్తామని హామీ ఇచ్చారు. నెలరోజుల్లో సమస్య కొలిక్కి రాకపోతే తానే ఆయా ఊళ్ళకు వచ్చి కార్యకర్తలకు తోడూనీడగా నిలబడతానన్నారు. అధికార పార్టీకి కొమ్ముకాస్తూ ప్రతిపక్ష పార్టీ కార్యకర్తలను వేధింపులకు లోను చేయడం మానుకోవాలని పోలీసులకు హితవు పలికారు. శాసనసభ్యులు లేని నియోజకవర్గాల్లో  ముగ్గురు సభ్యుల కమిటీని నియమిద్దామన్నారు.కార్యకర్తలపై దాడులను సమర్థవంతంగా ఎదుర్కొని నిలబడే వ్యక్తులకు నాయకత్వం అప్పగిద్దామని పేర్కొన్నారు. ఈ సమావేశంలోతెదేపా నాయకులు జీవీ ఆంజనేయులు, నక్కా ఆనందబాబు, అరవింద్ బాబు, పలువురు  పాల్గొన్నారు.