మరో చింతమనేనిలా మారాడు’ - కూన వ్యాఖ్యలను ఖండించిన ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం


విజయవాడ: ప్రభుత్వ ఉద్యోగులపై టీడీపీ నేత కూన రవికుమార్‌ చేసిన వ్యాఖ్యలను ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కేఆర్‌ సూర్యనారాయణ తీవ్రంగా ఖండించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కూన రవికుమార్‌ మరో చింతమనేని ప్రభాకర్‌లా మారాడని.. ఉద్యోగులను భయబ్రాంతులను గురిచేసిన రవికుమార్‌ను వెంటనే అరెస్ట్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. రవికుమార్‌ వెంటనే ఉద్యోగులకు క్షమాపణ చెప్పాలని, లేదంటే ఆయన ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు. కూన రవికుమార్‌ను టీడీపీ నుంచి బహిష్కరించాలని డిమాండ్‌ చేశారు. ఎమ్మార్వో వనజాక్షిపై దాడి చేసినప్పుడే చింతమనేనిపై చంద్రబాబు చర్యలు తీసుకుని ఉంటే ఉద్యోగులపై టీడీపీ నేతల దాడులు జరిగేవి కావన్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ఉద్యోగులంతా పార్టీలకు అతీతంగా పనిచేస్తున్నామన్నారు. పార్టీలకు అతీతంగా విధులు నిర్వహిస్తే ఉద్యోగులపై దాడులు చేస్తారా అంటూ టీడీపీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
నాన్‌ బెయిలబుల్‌ కేసు పెట్టాలి: రాష్ట్ర్ర గెజిటెడ్‌ ఉద్యోగుల సంఘం 
ప్రభుత్వ అధికారులపై బెదిరింపులకు పాల్పడిన టీడీపీ నేత కూన రవికుమార్‌పై రాష్ట్ర్ర గెజిటెడ్‌ ఉద్యోగుల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. రవికుమార్‌పై  ప్రభుత్వం కఠినచర్యలు తీసుకోవాలని రాష్ట్ర్ర గెజిటెడ్‌ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కృష్ణయ్య కోరారు. నాన్‌ బెయిలబుల్‌ కేసులు పెట్టాలని డిమాండ్‌ చేశారు.