కొండంత అండ..‘ఎంజీఆర్ హెల్ప్ లైన్’

 


అమరావతి.

• ప్రజలకు సేవ చేయాలనే తపన నుంచి పుట్టిన వినూత్న ఆలోచన
• 'ఎంజీఆర్ హెల్ప్ లైన్'తో కొత్త ఒరవడికి శ్రీకారం 
• ఒక్క ఫోన్ తో అప్పటికప్పుడే ఏ సమస్యకైనా పరిష్కారం
• వినూత్న రీతిలో నియోజకవర్గ ప్రజల సమస్యలు పరిష్కరిస్తున్న మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి 
• ఎక్కడికి తిరగకుండా సులువుగా పనులు అయిపోతున్నాయంటూ ఆత్మకూరు ప్రజల  సంతోషం


అమరావతి, ఆగస్ట్, 30 : “నా నియోజకవర్గ ప్రజలు నన్ను ఎమ్మెల్యేగా భారీ మెజారిటీతో గెలిపించడం, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నన్ను నమ్మి బాధ్యతను అప్పగించడం వల్లే మంత్రినయ్యా” ఈ రెండు అంశాలే పరిశ్రమలు, వాణిజ్య, ఐ.టీ, జౌళి శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అనుక్షణం గుర్తుంచుకునే విషయం. తనను అంతగా ప్రేమించి, నమ్మకముంచి అఖండ విజయంతో గెలిపించిన తన నియోజకవర్గ ప్రజలకు ఇంట్లో మనిషినై సేవ చేయాలన్నదే ఆయనకున్న తపన, తాపత్రయం. ఆత్మకూరు నియోజకవర్గంలోని ప్రజలందరికీ నిత్యం అందుబాటులో ఉండాలనే ఆయన ఎన్నో ఆలోచనల అనంతరం పుట్టిందే.. 'ఎంజీఆర్ హెల్ప్ లైన్'.  ఎలాంటి ఇబ్బంది ఉన్నా, ఎంతటి సమస్య అయినా ఒక్క ఫోన్ కాల్ తో పరిష్కరించే వీలుగా 'ఎంజీఆర్ హెల్ప్ లైన్'కు శ్రీకారం చుట్టారు. నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరు నియోజక వర్గ ప్రజల అత్యవసర సేవలందించే మంచి ఉద్దేశంతో హెల్ప్ లైన్ మొదలు పెడుతున్నట్లు 06-08-2019వ తేదీన ఆర్భాటం లేకుండా ప్రకటించారు. పనులు చేయాలన్న చిత్తశుద్ధి తప్ప అనవసర ప్రచారం జోలికి పోని  విశిష్ట వ్యక్తిత్వంతో హెల్ప్ లైన్ ఏర్పాటు చేసి ప్రజలకు అండదండగా మారారు. 


*హెల్ప్ లైన్ సంప్రదించవలసిందిలా... పనితీరు ఇలా...*


ఆత్మకూరు నియోజకవర్గ ప్రజలకోసమే ఏర్పాటైన ఎంజీఆర్ హెల్ప్ లైన్ 08621-221999 నంబర్ కు కేవలం ఒక్క ఫోన్ చేస్తే చాలు ఎలాంటి సమస్య అయినా వెంటనే పరిష్కరించబడుతోంది. ఆపరేటర్, ఓఎస్డీ, ఇతర శాఖల అధికారుల సమన్వయంతో ఎప్పటికప్పుడు అన్ని సమస్యలపై స్పందించి పరిష్కరించే వీలుగా మంత్రి హెల్ప్ లైన్ ను తీర్చిదిద్దారు.  ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు హెల్ప్ లైన్ నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటుంది. ఎవరైనా ఫిర్యాదు చేస్తే కేవలం 5-10 నిమిషాల్లోనే స్పందించి.. ఫిర్యాదు తీవ్రతను బట్టి వెంటనే పూర్తయ్యే సమస్య అయితే అదే రోజు అప్పటికప్పుడు పూర్తి చేస్తారు. ఆపరేటర్ కాల్స్ ద్వారా ఎప్పటికప్పుడు మంత్రి ఓస్డీకి ప్రజల ఫిర్యాదులను చేరవేస్తారు. మంత్రి ఎప్పటికప్పుడు హెల్ప్ లైన్ పనితీరును పర్యవేక్షిస్తుంటారు. సమస్య పెద్దదయితే తానే స్వయంగా సంబంధిత అధికారులకు  ఆదేశాలు ఇస్తుంటారు.


*హెల్ప్ లైన్ ఫిర్యాదులు అందిన చోటికి స్వయంగా వెళ్లి పరిష్కరించిన మంత్రి* 


సొంత నియోజకవర్గం ఆత్మకూరులో మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి రెండు రోజులపాటు ఊరూర కలియతిరిగారు. హెల్ప్ లైన్ కు అందిన ఫిర్యాదులను తీసుకుని స్వయంగా సమస్య ఉన్న చోటికి వెళ్లి ప్రజలను ఆశ్చర్యపరిచారు.  వాడవాడలా పర్యటించి గడపగడపకు వెళ్లి ప్రజలను పలకరించారు. రెండు రోజుల్లో ఆత్మకూరు, అనుమ సముద్రంపేట మండలాల్లోని ప్రజలను కలుసుకుని సమస్యలను స్వయంగా పరిష్కరించారు. నియోజకవర్గంలోని ఏ. యస్. పేట మండలం పొనుగోడు, రాజవోలు, దూబగుంట ఎస్.సి , ఎస్టీ కాలనీలలోని అంగన్ వాడీ భవనాలను పరిశీలించారు. అర్హత ఉన్నా వృద్ధాప్య పింఛన్ అందడం లేదని వాపోయిన వారికి వచ్చే నెల నుంచే పెన్షన్లు అందేలా చర్యలు చేపట్టాలని వారి వివరాలను వెంటనే నమోదు చేసే ప్రక్రియను స్థానిక వాలంటీర్ ద్వారా మంత్రి పూర్తిచేయించారు.  ఏ.ఎస్ పేట మండలంలోని పొనుగోడు గ్రామంలో వీధి దీపాలు లేవని, ఉన్న చోట కూడా కొన్ని వెలగడం లేదని గ్రామ ప్రజలు తమ సమస్యను మంత్రి దృష్టికి తీసుకువెళ్లడంతో ఆ సమస్య పరిష్కారానికి ఆదేశాలిచ్చారు. నెల్లూరు జిల్లాకు వచ్చినప్పుడల్లా అధికారులతో హెల్ప్ లైన్ పై సమీక్ష నిర్వహించి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా పరిష్కారాలు చేయాలని మార్గనిర్దేశనం చేస్తున్నారు.


*ఎలాంటి సమస్య అయినా క్షణాల్లో స్పందన..నిమిషాల్లో పరిష్కారం..*


అత్యవసర సేవలందించే లక్ష్యంగా నెలకొల్పిన ఎంజీఆర్ హెల్ప్ లైన్ కు ఎలాంటి సమస్య అయినా కాల్ చేయవచ్చని మంత్రి ప్రారంభ సమయంలో స్పష్టంగా చెప్పారు. విద్యుత్తు అంతరాయం, తాగునీటి సమస్యలు, ప్రభుత్వ కార్యాలయాల్లో పరిష్కరించవలసినవి, సంక్షేమ పథకాలు పొందడం, వ్యక్తిగత, సామాజిక సమస్యలు ఏవైనా పరిష్కరిస్తామని మంత్రి తెలపడంతో రకరకాల సమస్యలతో నిత్యం సగటున రోజుకు 15-20 సమస్యలు హెల్ప్ లైన్ దృష్టికి వస్తున్నాయి. వాటిలో వెంటనే పరిష్కరించే పనులను మంత్రి ఆదేశాలతో ఓఎస్డీ యుద్ధప్రాతిపదికన పరిష్కరిస్తున్నారు. మున్సిపల్ పరిధిలో మంత్రి ఆదేశాల మేరకు హెల్ప్ లైన్ సమస్యలపై అధికారులు సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తున్నారు.


ఉదా: 1 అనుమ సముద్రం పేట మండంలోని వినాయక సెంటర్ లో నెల రోజులుగా  తాగునీటి సరఫరా అందడం లేదని హెల్ప్ లైన్ కు ఫిర్యాదు అందింది. వెంటనే స్పందించిన మంత్రి  ఓఎస్డీని స్వయంగా పంపించి, అధికారులను ఆదేశించి ట్యాంకర్ల ద్వారా ఫిర్యాదు అందిన రోజే త్రాగునీరు సరఫరా చేశారు. 


ఉదా: 2  ఆత్మకూరు మండలం జేఆర్ పేట, జ్యోతీ నగర్ ప్రాంతాల్లో పారిశుద్ధ్యం సమస్య ఫిర్యాదుగా అందడంతో మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ఆదేశాలతో వెంటనే స్పందించిన కమిషనర్ అప్పటికప్పుడు సిబ్బందితో మురుగు తొలగించేలా చేసి దోమలు రాకుండా బ్లీచింగ్ చల్లించారు.


ఉదా: 3 అనంతసాగరం మండలంలో సింధూ అనే మహిళ కుమార్తెకు వ్యాక్సిన్ వికటించిన వైనంపై ఫిర్యాదు అందింది. దీంతో హెల్ప్ లైన్ నిర్వాహకులు ఈ సమస్యను జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి దృష్టికి తీసుకువెళ్లి  ఇమ్యునైజేషన్ అధికారి,మెడికల్ ఆఫీసర్ లు ఆ ప్రాంతానికి వెళ్లి చిన్నారికి పరీక్షలు చేసి చికిత్స అందించారు.   


వీధి దీపాలు వెలగడం లేదనే సమస్య, కాలువల్లో పూడిక తీత తీయకపోవడం, విత్తనాల కోసం రైతులు ఎదురు చూడడం, విద్యుత్తు అంతరాయం, వీధి దీపాలు లేకపోవడం,ఎత్తిపోతల పథకం మోటార్లు  మరమ్మతులకు గురవడం వంటి ఎన్నో రకాల సమస్యలను వెంటనే పరిష్కరించి, ప్రజల గుండెల్లో మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి గూడు కట్టుకుంటున్నారనడంలో అతిశయోక్తి లేదు. 


*నెల రోజుల్లోనే ఎంజీఆర్  హెల్ప్ లైన్ కు విశేష స్పందన*


రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ఏర్పాటు చేసిన ఎంజీఆర్ హెల్ప్ లైన్ కు నియోజకవర్గ ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. ప్రజల సమస్యలపై వస్తున్న ఫోన్ కాల్స్ కు సత్వరమే స్పందించి వాటి పరిష్కారానికి ఓఎస్డీని ఆదేశిస్తుండడంతో సమస్యలు వెంటనే పరిష్కారమవుతున్నాయి. నియోజకవర్గంలోని ఆత్మకూరు, మర్రిపాడు, సంగం, అనుమసముద్రం పేట, అనంతసాగరం, చేజెర్ల మండలాల నుంచి ఇప్పటి వరకు హెల్ప్ లైన్ కు 360 ఫోన్ కాల్స్ వచ్చాయి. అందులో 60 శాతం సమస్యలకు ప్రజలు ఫిర్యాదు చేసిన 2-3 రోజుల్లోనే పరిష్కారం పూర్తవడం గమనార్హం. పరిష్కారం దిశగా ముందుకెళుతున్న ఫిర్యాదుల్లో రెవెన్యూ, ఆర్థిక, ముఖ్యమంత్రి సహాయనిధి, పింఛన్ల వంటి సమస్యలను కూడా ఎలా పరిష్కరించాలో ప్రజలకు వివరించి వారికి మార్గనిర్దేశనం చేస్తోందీ హెల్ప్ లైన్.