ప్యాకేజీ అందితే ఒకలా, లేకపోతే మరోలా


గుంటూరు: జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌ రాజధాని పర్యటనపై మంగళగిరి ఎమ్మల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ధ్వజమెత్తారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు నుంచి ప్యాకేజి ముట్టినపుడు ఒకరకంగా, అందనపుడు ఇంకో రకంగా మాట్లాడటం పవన్‌కు అలవాటు అయిందన్నారు. బేతపూడి గ్రామంలో పర్యటించినపుడు అక్రమాలు జరుగుతున్నాయని చెప్పిన పవన్‌.. దమ్ముంటే చంద్రబాబు హయాంలో జరిగిన మోసాలను బయట పెట్టాలని సవాలు విసిరారు. భూ సేకరణ చేస్తే ఆమరణ నిరాహార దీక్ష చేస్తానన్న పవన్‌, నాలుగుసార్లు భూసేకరణ జరిపినపుడు ఏమయ్యారని ఆర్కే సూటిగా ప్రశ్నించారు. పవన్‌కు నిజంగా రాజధాని మీద ప్రేమ ఉంటే ఇక్కడ నుంచి ఎందుకు పోటీ చేయలేదని, కనీసం జనసేన అభ్యర్థినైనా పోటీలో దింపలేదని విమర్శించారు. కమ్యూనిస్టులతో పొత్తు కారణంగా సీటు ఇచ్చారనుకున్నా.. వారి కోసం ఎందుకు ప్రచారం చేయలేదని ఆర్కే ప్రశ్నలు సంధించారు. లోకేష్‌ను గెలిపించడానికి పవన్‌ తెర వెనుక చేసిన ప్రయత్నాలన్నీ రాజధాని రైతులకు తెలుసని వ్యాఖ్యానించారు. ఇన్నిరోజుల పత్తాలేని పవన్‌ ఇప్పుడు రైతులపై ప్రేమ ఉన్నట్టు పర్యటిస్తే జనం నమ్మరని అన్నారు.