టీడీపీ నేతల అత్యవసర సమావేశం


శ్రీకాకుళం: టీడీపీ నేతలపై పెడుతున్న కేసులపై ఆ పార్టీ ఆందోళనకు సిద్ధమైంది. ఆముదాలవలసలో టీడీపీ నేతలు అత్యవసర సమావేశం నిర్వహించారు. టీడీపీ నేత కూన రవిపై కేసులు, అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించినట్లు సమాచారం. రవిపై పెట్టిన కేసును నేతలు తప్పుబట్టారు. ప్రభుత్వ తీరుకు నిరసగా ఆందోళనలు చేపట్టాలని టీడీపీ నిర్ణయం తీసుకుంది. టీడీపీ నేతలపై అక్రమ కేసులు కేసులు పెడుతున్నారని టీడీపీ నేత కళా వెంకట్రావు మండిపడ్డారు. టీడీపీ నేత కూన రవికుమార్‌పై కేసు పెట్టడాన్ని ఖండిస్తున్నామని, అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. టీడీపీ నేతలను వేధిస్తే చూస్తూ ఊరుకోమని కళా వెంకట్రావు హెచ్చరించారు. సరుబుజ్జిలి మండల పరిషత్‌ కార్యాలయంపై, తనతో పాటు సిబ్బందిపైన మాజీ విప్‌ రవికుమార్‌తో పాటు మరో 11 మంది దాడికి పాల్పడ్డారని సోమవారం అర్ధరాత్రి ఎంపీడీవో దామోదరరావు సరుబుజ్జిలి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత విషయం రాజకీయరంగు పులుముకుంది. 'అధికారులను చెట్టుకు కట్టి కాల్చేస్తా.. నిబంధనలు పాటించకుంటే తీవ్రపరిణామాలు ఎదుర్కోవాల్సిందే'నని అధికారులతో మాజీ విప్‌ అన్నట్టు ప్రచారం జరిగింది. ఎంపీడీవో ఫిర్యాదు మేరకు కూన రవికుమార్‌, నందివాడ గోవిందరావు, కూన అమ్మినాయుడు, కూన సంజీవిరావు, పల్లి సురేష్‌, గొండెం రవి, తాడేల రవణ, ఎండ రామారావు, గుర్రాల చినబాబు, ఊటపల్లి రామకృష్ణ, అంబాళ్ల రాంబాబు, దాన్న గురువులపై సెక్షన్లు 353, 427, 506, 143, రెడ్‌విత్‌ 149 కింద సరుబుజ్జిలి ఎస్‌ఐ కె.మహాలక్ష్మి కేసు నమోదు చేశారు.