వైసిపి నేతల వేధింపులు తట్టుకోలేక పోతున్నాం


మీరే ఆదుకోవాలంటూ చంద్రబాబు వద్ద ఆవేదన
ఉండవల్లి నివాసానికి తరలివచ్చిన మైదుకూరు,కమలాపురం వాసులు
కడప జిల్లాలో వైసిపి నేతల వేధింపులు తట్టుకోలేక పోతున్నాం. భూముల్లోకి రానివ్వడం లేదు. ఉద్యోగాలను తొలగిస్తున్నారు. బెదిరిస్తున్నారు, వేధింపులకు గురిచేస్తున్నారు. తప్పుడు కేసులు బనాయిస్తున్నారు.. ఈ హింస తట్టుకోలేక పోతున్నామని ఆయా గ్రామాల ప్రజలు వాపోయారు. 
శాసన సభ ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడి నివాసానికి మంగళవారం ఆయా గ్రామాలనుంచి అనేకమంది తరలివచ్చారు.
25ఏళ్లుగా తమ స్వాధీనంలో ఉన్న భూమిలో ప్రభుత్వ భూమి అనే బోర్డులు మైదుకూరు వైసిపి ఎమ్మెల్యే రఘురామిరెడ్డి పెట్టించారని వి రాజుపాలెంకు చెందిన శ్రీనివాసులు వాపోయారు. 19ఏళ్లుగా సాగు చేసుకుంటున్నామని, ఈ ఏడాది వరి వేశామని, ఇప్పుడు అందులోకి అడుగుపెడితే అరెస్ట్ చేస్తామని పోలీసులతో బెదిరిస్తున్నారని వెంకట సుబ్బమ్మ, లక్ష్మీదేవి ఫిర్యాదు చేశారు. 
అనంతపురంలో సాగు చేసుకుంటున్న 6ఎకరాల భూమిని లాగేసుకున్నారని, పొలంలోకి అడుగుపెట్టకుండా అడ్డుకుంటున్నారని శంకర యాదవ్ వాపోయారు.
గతంలో ఏనాడూ టిడిపికి ఓటేయని గ్రామంలో ఏజెంట్ గా కూర్చున్నందుకే 258ఓట్లు టిడిపికి పడ్డాయనే అక్కసుతో తమపై కక్ష సాధిస్తున్నారని మల్లికార్జున రెడ్డి ఆవేదన చెందారు. 
ఉద్యోగం నుంచి తొలగిస్తామని, రాజీనామా చేయాలని, తమ వాళ్లనే పెట్టుకుంటామని బెదిరిస్తున్నారని ఆశా వర్కర్ జయమ్మ, యానిమేటర్ నిర్మల ఫిర్యాదు చేశారు.
సాగుచేసిన వరి నీళ్లులేక దెబ్బతిందని, ఉన్న ఉద్యోగాన్ని తీసేశారని శ్రీకాకుళం వీరగట్టం మండలం విక్రాంపురంకు చెందిన అప్పలనాయుడు వాపోయారు.
ప్రభుత్వ ట్యాంకు నుంచి కూడా నీళ్లు పట్టుకోనివ్వడం లేదని, రోడ్డుకు అడ్డంగా కట్టెలు పెట్టి అదేమని ప్రశ్నిస్తే తప్పుడు కేసులు బనాయిస్తున్నారని ప్రకాశం జిల్లా దర్శి మండలం ఓబులపల్లె గ్రామస్థులు ఫిర్యాదు చేశారు.