సెప్టెంబర్ 1 నుండి పోషకాహార ‘ఆంధ్ర’


 అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ను పోషకాహార లోపరహితంగా మార్చేందుకు మహిళా, శిశు సంక్షేమశాఖ నడుంకట్టింది. కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా అమలు చేస్తున్న పోషణ్‌ అభియాన్‌ కార్యక్రమంలో భాగంగా సెప్టెంబరు నెలలో రాష్ట్రంలో పోషకాహార మాసోత్సవాలు నిర్వహిస్తోంది. రాష్ట్రంలోని మహిళల్లో రక్తహీనత, పోషకాహార లోపాన్ని నివారించేందుకు నెల రోజులపాటు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టనుంది. గర్భం దాల్చినప్పటి నుంచి బిడ్డకు జన్మనిచ్చిన తర్వాతా కలిపి మొత్తం వేయి రోజులపాటు ఆరోగ్య సంరక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించనుంది. రాష్ట్రంలో ఈ కార్యక్రమంలో వచ్చే నెల 3న సీఎం జగన్‌ పాల్గొంటారు.
ఉచితంగా వైద్య పరీక్షలు : రాష్ట్రంలో నెల రోజులపాటు వైద్య, ఆరోగ్యశాఖ ప్రతి గ్రామంలో శిబిరాన్ని నిర్వహించి మహిళలు, పిల్లలకు ఉచితంగా రక్త పరీక్షలు చేస్తారు. ఆరోగ్య కేంద్రాల స్థాయిలో దంత, నేత్ర పరీక్షలు నిర్వహిస్తారు.
నాటక ప్రదర్శనలు..ఆహార పోటీలు : గిరిజనులకు పోషకాహార లోపంపై అవగాహన కల్పించేందుకు నాటక ప్రదర్శనలిస్తారు. మంచి ఆహారాన్ని తీసుకోవడంపై అవగాహన కల్పించేందుకు రాష్ట్ర స్థాయిలో ఆహార పోటీలు, ప్రదర్శనలు నిర్వహిస్తారు. జిల్లా స్థాయిలో 3 మండలాలకు, రెవెన్యూ డివిజన్‌ స్థాయిలో 3 గ్రామాలకు అవార్డులు ఇస్తారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో 'వెల్‌ బేబీ షో'లను నిర్వహించి బహుమతులు అందిస్తారు.