వార్త లాప్ కు విశేష స్పందన

*గుంటూరు “వార్తాలాప్” కు విశేష స్పందన* - జిల్లా కలెక్టర్ శ్రీ శామ్యూల్ ఆనంద్ కుమార్ చేతుల మీదుగా ప్రారంభమైన వన్ డే వర్క్ షాప్
*• ప్రభుత్వ పథకాల ప్రజలు ఎలా ఉపయోగించుకోవాలో తెలియజేయాల్సిన బాధ్యతను మీడియా తీసుకోవాలన్న గుంటూరు జిల్లా కలెక్టర్ శ్రీ శామ్యూల్ ఆనంద్ కుమార్*
*• దేశాభివృద్ధిలో గ్రామీణ విలేకరుల పాత్ర కీలకమన్న కేంద్ర సమాచార శాఖ అదనపు డీజీ శ్రీ మురళిమోహన్*
*• కేంద్ర ప్రభుత్వ పథకాల వివరాలు తెలుగులో అందుబాటులో ఉండాలన్న రైతునేస్తం ఎడిటర్ శ్రీ యడ్లపల్లి* వెంకటేశ్వరరావు
*• ప్రతి జర్నలిస్టు ప్రభుత్వ పథకాల గురించి పూర్తిగా తెలుసుకోవాలన్న ది హిందూ ఆంగ్ల దినపత్రిక ఎడిటర్ శ్రీ శామ్యూల్*


పత్రికా సమాచార కార్యాలయం (పి.ఐ.బి), విజయవాడ వారు గుంటూరు అరండల్ పేటలోని హోటల్ వి.రాయల్ పార్క్ లో  నిర్వహించిన వార్తా లాప్ వన్ డే వర్క్ షాప్ కార్యక్రమానికి మీడియా మిత్రుల నుంచి విశేష స్పందన లభించింది. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ శ్రీ శామ్యూల్ ఆనంద్ కుమార్, కేంద్ర సమాచార ప్రసార శాఖ అదనపు డీజీ శ్రీ మురళీమోహన్, పద్మశ్రీ అవార్డు గ్రహీత, రైతునేస్తం ఎడిటర్ శ్రీ యడ్లపల్లి వెంకటేశ్వర రావు, హిందూ దినపత్రిక గుంటూరు బ్యూరో చీఫ్ శ్రీ శామ్యూల్ హాజరయ్యారు. గుంటూరుతో పాటు చుట్టు పక్కల గ్రామాలకు చెందిన 130 మంది జర్నలిస్టులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
*ప్రభుత్వ పథకాల వివరాలను ప్రజల్లోకి తీసుకువెళ్ళేందుకు మీడియా ప్రాధాన్యత ఇవ్వాలి – కలెక్టర్*
గతంలో ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొన్న తనకు ప్రత్యేకంగా మీడియా కోసం ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో ఆనందగా ఉందని గుంటూరు జిల్లా కలెక్టర్ శ్రీ శామ్యూల్ ఆనంద్ కుమార్, కొన్ని కార్యక్రమాల విషయంలో ఎదురౌతున్న ఇబ్బందులను ప్రజల దృష్టికి తీసుకువెళ్ళడం ఎంత ముఖ్యమో, అదే విధంగా ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్న పథకాల వివరాలను కూడా తెలియజేయడం అంతే ముఖ్యమని తెలిపారు. ప్రస్తుత సమాజంలో మీడియా పోషించే పాత్ర అత్యంత కీలకమని తెలిపిన ఆయన, సానుకూల వార్తలైనా, ప్రతికూల వార్తలైనా సమాజం మీద అత్యంత ప్రభావం చూపుతాయని, ఈ నేపథ్యంలో ప్రజల అభివద్ధికి అవసరమైన అంశాల ప్రాధాన్యత మరింత పెంచే ప్రయత్నం చేయాలని సూచించారు.
*దేశాభివృద్ధిలో గ్రామీణ జర్నలిస్టుల పాత్ర కీలకం – శ్రీ మురళీ మోహన్*
కేంద్ర ప్రభుత్వ పథకాలు గడపగడపకూ అందుబాటులోకి తీసుకువెళ్ళడంలో గ్రామీణ జర్నలిస్టుల పాత్ర ఎంతో ఉందన్న కేంద్ర సమాచార శాఖ అదనపు డీజీ శ్రీ మురళీ మోహన్, ఆ దిశగా జర్నలిస్టులకు ప్రత్యేక వర్క్ షాప్ నిర్వహించడం ఆనందంగా ఉందని తెలిపారు. కేవలం కేంద్ర ప్రభుత్వ పథకాలు మాత్రమే కాకుండా, వార్తలు రాయడంలో మెలకువలు, అసంబద్ధ సమాచారాన్ని కట్టడి చేసే మార్గాలు, సమాజం పట్ల మీడియా బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన తీరు తదితర అంశాల గురించి ఆయన వివరించారు. ఈ సందర్భంగా జర్నలిస్టులు తమ సమస్యలు కొన్నింటిని ఆయన దృష్టికి తేగా, వాటి పట్ల సానుకూలంగా స్పందించారు. తన పరిధిలో పూర్తి స్థాయిలో విలేకర్ల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. 
*ప్రభుత్వ పథకాల వివరాలు తెలుగులో అందుబాటులోకి రావాలి – శ్రీ వై. వెంకటేశ్వర రావు*
కేంద్ర ప్రభుత్వ పథకాల విషయంలో గ్రామీణ విలేకర్లకు ఉండే అవగాహన చాలా తక్కువని, వారికి పథకాల వివరాలన్నీ తెలుగు భాషలో అందుబాటులోకి తెచ్చే ప్రయత్నం చేయాల్సిన బాధ్యతను కేంద్ర పత్రికా సమాచార విభాగం తీసుకోవాలని రైతునేస్తం ఎడిటర్, పద్మశ్రీ అవార్డు గ్రహీత శ్రీ యడ్లపల్లి వెంకటేశ్వరరావు కోరారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలను ప్రజలు గ్రహించే విధానంలో సమస్యలు వస్తాయని వాటిని నివృత్తి చేయాల్సిన బాధ్యత మీడియా మీదే ఉంటుందని, అందుకే మీడియా రాసే ప్రతి విషయాన్ని పూర్తిగా అందరికీ అర్థమయ్యేలా రాయాలని, ముఖ్యంగా ఈ విషయంలో గ్రామీణ మీడియా జాగ్రత్తలు తీసుకోవలసిన అవసరం ఉందని తెలిపారు.
*జర్నలిస్టులందరూ ప్రభుత్వ పథకాల గురించి పూర్తిగా తెలుసుకోవాలి – శ్రీ శామ్యూల్*
సమాజంలో జరిగే అన్యాయాల్ని, సమస్యల్ని ప్రజల దృష్టికి తీసుకువెళ్ళడం మాత్రమే జర్నలిస్టుల పని కాదని, ప్రజలకు అవసరమైన ప్రభుత్వ పథకాల వివరాలను వారికి తెలియజేసే బాధ్యత కూడా జర్నలిస్టులదే అన్న ది హిందూ ఆంగ్ల దినపత్రిక బ్యూరో చీఫ్ శ్రీ శామ్యూల్, ప్రతి జర్నలిస్టు ప్రభుత్వ పథకాల గురించి తెలుసుకోవాలని తెలిపారు. 
ఈ కార్యక్రమంలో విజయవాడ పత్రికా సమాచార కార్యాలయం ఏర్పాటు చేసిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఆసక్తికరంగా సాగింది. సమాచార కార్యాలయ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్ శ్రీ శ్రీరామ్ జర్నలిస్టులు సమాచారాన్ని ఏ విధంగా తెలుసుకోవాలనే అంశాన్ని కూలంకషంగా వివరించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర సమాచార శాఖ విజయవాడ పత్రికా సమాచార కార్యాలయ మాస్ అండ్ కమ్యూనికేషన్ ఆఫీసర్ శ్రీ హెన్రీ రాజ్, ఇతర సిబ్బంది,  గుంటూరు క్షేత్ర ప్రచార అధికారి శ్రీ నాగసాయి సూరి, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.