కేసీఆర్ వస్తున్నారంటే పది గంటలకే తిని కూర్చునేవాడ్ని : గవర్నర్ నరసింహన్

 


హైదరాబాద్ : సుదీర్ఘ కాలం పాటు గవర్నర్‌గా సేవలందించిన నరసింహన్‌కు సీఎం కేసీఆర్ ప్రగతిభవన్‌లో వీడ్కోలు సమావేశాన్ని ఏర్పాటు చేశారు. సంప్రదాయం ప్రకారం కేసీఆర్ దంపతులు తిలకాన్ని దిద్ది, పూలమాల, శాలువాలతో సత్కరించి, వీణను బహూకరించారు. అయితే ఈ సమయంలో కేసీఆర్ తీవ్ర ఉద్విగ్నానికి లోనయ్యారు. ఈ సందర్భంగా గవర్నర్ నరసింహన్ మాట్లాడుతూ కేసీఆర్‌తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. మొదట్లో కేసీఆర్ ఆయన్ను కలవడానికి 12 గంటలకు వచ్చారని, ఆ సమావేశం దాదాపు మూడు గంటల పాటు సుదీర్ఘంగా కొనసాగిందని తెలిపారు. అయితే తనకు ఒంటి గంటకు లంచ్ చేయడం అలవాటని, కేసీఆర్ మాత్రం దాదాపు మూడు గంటల పాటు సమావేశాన్ని కొనసాగించేవారని అన్నారు.
 
ఇంత సుదీర్ఘమైన సమావేశాన్ని నిర్వహించే అలవాటు కేసీఆర్‌కుందని మొదట్లో తనకు తెలియదని తెలిపారు. తర్వాత తర్వాత తాను ఉదయం పది గంటలకే భోజనాన్ని ముగించుకొని కేసీఆర్‌తో భేటీ నిర్వహించేవారమని నరసింహన్ గుర్తు చేసుకున్నారు. పది గంటలకు తమ సమావేశం ప్రారంభమైనా, విషయంలోకి తొందరగా వెళ్లేవారిమి కాదని, కొద్దిసేపు వామప్ కొనసాగి, నిజాం కాలం నుంచి చరిత్రను కొనసాగిస్తూ.... ప్రస్తుత విషయంలోకి వచ్చేవారమని, మధ్యలో ఇద్దరి మధ్యా తీవ్ర చర్చలు జరిగేవని అన్నారు. చివరికి చర్చలు వాడివేడీగా సాగేవని అయితే తాను నరసింహుడినని, ఆయన చంద్రశేఖరుడని చివరికి శాంతి.... శాంతి... శాంతి.... అంటూ చర్చలు ముగించుకునేవారమని అది కేసీఆర్ గ్రేట్‌నెస్‌ అని నరసింహన్ కొనియాడారు.