పేరెంట్స్ కమిటీ ఎన్నికల్లో రికార్డ్ నెలకొల్పాం.

*పేరెంట్స్ కమిటీ ఎన్నికల్లో రికార్డ్ నెలకొల్పాం.


*ఒక్కరోజే ప్రశాంతంగా 96శాతం కమిటీ లు పూర్తి.


*విద్యా హక్కు చట్టం పకడ్బందీ గా అమలుకు చర్యలు.


*రాష్ట్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్ సురేష్.


 రాష్ట్రం లోని పాఠశాలల్లో పేరెంట్స్ కమిటీ ఎన్నికలు 96శాతం పూర్తి చేసి రికార్డ్ నెలకొల్పామని,  ఎక్కడా ఎటువంటి సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా గతం లో ఎన్నడూ జరగని విధంగా ఎన్నికలు జరిపామని రాష్ట్ర  విద్యాశాఖ మంత్రి డాక్టర్  ఆదిమూలపు సురేష్ అన్నారు. రాష్ట్రం లోని 44, 505 ప్రభుత్వ పాఠశాలలు, 2, 096 ఎయిడెడ్ పాఠశాలకు మొత్తం 46, 601 పాఠశాలల్లో ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా విద్యాశాఖ ఎన్నికలు నిర్వహించిందన్నారు. అందులో 29, 424 పాఠశాల కమిటీలు (63శాతం) ఏకగ్రీవం కాగా, 15, 497 పాఠశాలల్లో (33శాతం) నిబంధనల ప్రకారం చేతులెత్తటం ద్వారా ఎన్నికలు జరిగాయన్నారు. మొత్తం 96 శాతం ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించడం ద్వారా గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా ఈ ప్రభుత్వ హయాంలో జరిపిన తీరు,  ఏకగ్రీవంగా ప్రశాంతంగా జరపటం ద్వారా రికార్డ్ సృష్టించామని మంత్రి సురేష్  ఆనందం వ్యక్తం చేశారు. మిగిలిన 1680 పాఠశాలల్లో కోరం లేని కారణంతో పాటు వాటిలో 234 చోట్ల స్థానిక సమస్యల కారణంగా ఎన్నిక వాయిదా పడిందన్నారు.
విద్య హక్కు చట్టాన్ని పకడ్బందీగా అమలు చేసేందుకు రాష్ట్రం లో చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి  తెలిపారు. విద్యాశాఖ పటిష్ఠతకు ముఖ్యమంత్రి  జగన్ మోహన్ రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా ప్రత్యేక శ్రద్ద తో రాష్ట్రం లో ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నట్లు మంత్రి సురేష్ ఒక ప్రకటనలో వెల్లడించారు. నైపుణ్యాభివృద్ధి కి తమ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని,  ఫీజు నియంత్రణ కోసం కొత్తగా రెగ్యులేటరీ కమిషన్ ఏర్పాటు, పిల్లలను బడికి పంపే తల్లులకు అమ్మ ఒడి, పాఠశాలల్లో సాంకేతిక అంశాలు, ఈ -హాజరు, డిజిటల్ తరగతి గదులు, నో బాగ్ డే, కెరీర్ కౌన్సిలింగ్,  బాలికలకు సైకిళ్ల పంపిణీ వంటి ఎన్నో కార్యక్రమాలు చేపట్టామన్నారు. రాష్ట్రం లో విద్యావ్యవస్థ ను పటిష్ట పరచటం ప్రభుత్వ ధ్యేయమని మంత్రి సురేష్ ఒక ప్రకటన లో వెల్లడించారు.