టీడీపీ ఎమ్మెల్యేను అడ్డుకున్న వందమంది పోలీసులు
అనంతపురం/ఉరవకొండ: అనంతపురం జిల్లా కూడేరు మండలం కమ్మూరు దగ్గర ఉద్రిక్తత నెలకొంది. ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌ను భారీ పోలీసు బలగాల మధ్య అడ్డుకున్నారు. ఇప్పేరు చెరువుకు నీరు విడుదల చేయడానికి వెళుతున్న ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌ను అనంతపురం డీఎస్పీ వీర రాఘవరెడ్డి, ముగ్గురు సీఐలు, వందమంది పోలీసు బలగాలతో వాహనాన్ని ఆపి ముందుకు వెళ్లకుండా అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పయ్యావుల మీడియాతో మాట్లాడుతూ.. రేపటిలోగా నీరు విడుదల చేయకపోతే 10 వేల మందితో వచ్చి నీరు విడుదల చేస్తానని తేల్చిచెప్పారు. మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డి ఆదేశాల మేరకు పోలీసులు అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. హంద్రీనీవా కాలువకు నీరు వచ్చి నెలలు దాటుతున్న ఇంతవరకు నీటిని విడుదల చేయలేదని.. ఇప్పేరు చెరువులకు నీరు విడుదల చేయడానికి ప్రభుత్వం విఫలం కావడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని రైతుల నోట్లో మట్టి కొడుతున్నారని పయ్యావుల ధ్వజమెత్తారు. గత ప్రభుత్వ హయాంలో ఏ సమస్య లేకుండా ముద్దలాపురం, ఇప్పేరు చెరువులకు నీరు తీసుకొచ్చి రైతులకు న్యాయం చేశామన్నారు. ఈ ప్రభుత్వ హయాంలో రైతులను తీవ్రంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. రైతులను అక్కడ ఒప్పించి చెరువులకు నీటిని తీసుకెళ్తుంటే అడ్డుకోవడం సరికాదన్నారు.
టీడీపీ ఎమ్మెల్యేను అడ్డుకున్న వందమంది పోలీసులు