కోడెల... ప్రజావేదిక... 29  ప్రాణాలు : ఇవన్నీ లక్షణాలు, అసలు జబ్బేంటి ? 


--------------


*కోడెల... ప్రజావేదిక... 29  ప్రాణాలు : ఇవన్నీ లక్షణాలు, అసలు జబ్బేంటి ?
===================
-- రాయపాటి మోహన్ సాయి కృష్ణ


(గుంటూరు మాజీ మేయర్)
==================


జ్వరం వస్తే కొంతమంది తెలియక ప్యారాసిట్మాల్ మందేసుకొని జ్వరం తగ్గిపోవాలనుకొంటారు. జ్వరం ఒక లక్షణం మాత్రమే. దానికి కారణమైన జబ్బును కనుగొని చికిత్స చేయాలి. కోడెల, ప్రజావేదిక, 29 ప్రాణాలు అనే మూడు అంశాలు కూడా జబ్బు లక్షణాలే. అసలు జబ్బేంటనేది కనిపెట్టి సరైన చికిత్స చేయాలి.
  
*1. కోడెల :* 


 గత ఐదేళ్ళుగా గుంటూరు జిల్లా  వాసిగా కోడెల కుటుంబం గురించి వింటున్నాo. 'కే' ట్యాక్స్ అని సామాన్య జనాలను, వ్యాపారులను, అధికారులను, మరీ ముఖ్యంగా సొంత తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలను హింసించి, బెదిరించి, అనేక విధాలుగా బలవంతంగా వాళ్ళ నుంచి డబ్బులు వసూలు చేశారని చెబుతున్నారు. ఎవరైనా పనులకోసం వచ్చిన లేక వాళ్ళ వాళ్ళ వ్యాపారాలు చేసుకోవడానికి, వాళ్ళ బ్రతుకు వాళ్ళు బ్రతకడానికి కూడా 'కే' ట్యాక్స్ లాంటివి వేసి వసూళ్ళు చేశారు. సత్తెనపల్లి, నరసరావుపేట నియోజక వర్గాల నుంచి వీళ్ళ బాధితుల, పీడుతుల గోడులు వింటున్నాo. కేవలం ఒక అధికారపార్టీ ఎం.ఎల్.ఎ స్థాయి వ్యక్తి కుటుంబం, మంత్రి కాక పోయినప్పటికీ, ఈ రెండు నియోజకవర్గాలలో అక్రమాలు, దౌర్జన్యాలు విచ్చలవిడిగా చేశారు. ఒక స్పీకర్ గా తన అధికారాన్ని ఉపయోగించుకుని ఫర్నిచర్ కాజేశారనేది తాజా పరిణామం.                                                        


*2. ప్రజావేదిక :* 


చంద్రబాబునాయుడు తనకు నచ్చిందని కృష్ణానది ఒడ్డున ఇల్లు అద్దెకు తీసుకొని నివాసముంటున్నారు. రోజూ ప్రజలను కలుసుకోవడానికి, సమావేశాలకు మరొక భవనం అవసరమై ఇంటి ప్రక్కన ఒక ప్రైవేట్ వ్యక్తికి సంబంధించిన స్థలంలో ఆ వ్యక్తి అనుమతి లేకుండా, అతని అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోకుండా దౌర్జన్యంగా, బలవంతంగా ప్రభుత్వ సొమ్ముతో కరకట్టకు చంద్రబాబు నివాసానికి మధ్యలో ప్రజావేదికను నిర్మించారు. నది పరిరక్షణ చట్టం, సుప్రీంకోర్ట్ మార్గదర్శకాల ప్రకారం నదికి, కరకట్టకి మధ్యలో ప్రభుత్వం ఎటువంటి కట్టడాలు కట్టకూడదు. కొంతమంది ప్రైవేట్ వాళ్ళు కట్టుకుంటున్నారు అది వేరే విషయం. అదే నిర్మాణాన్ని 100 మీటర్ల అవతల కరకట్టకు బయట కట్టుంటే బాగుండేది. కరకట్టకు బయట అంతా భూసమీకరణకు ఇచ్చిన భూమే. అసెంబ్లీ, సచివాలయ భవనాలు మాదిరి అక్కడ కట్టినట్లయితే అది చట్టబద్దమై ఉండేది. ఎవరికి అభ్యంతరం ఉండేది కాదు. దీని నిర్మాణంలో కోట్ల రూపాయల అవినీతి జరిగిందా? లేదా? అనేది తర్వాత విషయం. కరకట్ట అవతల కట్టే బదులు కరకట్ట ఇవతల కట్టుంటే ఈ రోజు కూల్చే పరిస్థితి వచ్చేది కాదు. ప్రజా ధనం వృధా అయ్యుండేది కాదు.


*3. 29 ప్రాణాలు :* 


2015 జులై లో గోదావరి పుష్కరాల సందర్భంగా రాజమండ్రిలో 29 మంది దుర్మరణం పాలవడం జరిగింది. ఆ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఉదయాన్నే 6:30 గంటలకు కుటుంబ సభ్యులతో కలిసి గంటా గంటన్నర సేపు పుష్కర స్నానం చేసి వెళ్ళగానే అక్కడ గంటలతరబడి వేచి ఉన్న భక్తులను ఒకేసారి ఘాట్ లోకి వదలడంతో తొక్కిసలాట జరిగి 29 మంది దుర్మరణం చెందారు. అసలు ఆరోజు ముఖ్యమంత్రి వి.వి.ఐ.పి. ల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఘాట్ లో స్నానం చేసే అవకాశమున్నా, ప్రచార ఆర్భాటo కోసం సాధారణ ఘాట్ లో స్నానం చేశారు. ఇది స్టేషన్ కు దగ్గర్లో ఉండడంతో రైళ్ళ నుంచి బస్సుల నుంచి భక్తులు వేలాదిగా వచ్చి రద్దీ పెరిగింది. ఆ రోజు ముఖ్యమంత్రి వి.వి.ఐ.పి ఘాట్ లో స్నానం చేసి ఉంటే 29 నిండు ప్రాణాలు పోకుండా ఉండేవి.


ఈ మూడు అంశాలను నేను ఒక జబ్బు లక్షణాలుగా చూస్తున్నాను. మనిషికి జబ్బు చేసినట్లే సమాజం అనే శరీరానికి కూడా జబ్బు చేస్తుంది. ఈ లక్షణాలకు మాత్రమే ఎప్పటికప్పుడు ఉపశమనమందుగా కంటి తుడుపు చర్యలు చేపడుతున్నారు. ప్రజావేదికను కూల్చేశారు. కోడెల పై కేసులు పెట్టారు. ఫర్నిచర్ రికవరి చేశారు. 29 మంది మృతికి విచారణ కమీషన్ వేశారు. ఇక అయిపోయింది అనుకుంటున్నాం కాని, ఈ జబ్బుకు కారణం ఏంటని ఆలోచించడం లేదు. ఈ మూడు లక్షణాలకు కారణమైన జబ్బేoటి అని నిర్ధారణ, విశ్లేషణ చేయడం లేదు. దానికి చికిత్స చేయడం లేదు. కేవలం లక్షణాలకు మందు లేస్తున్నారు. ఈ జబ్బు గురించి తెలియాలంటే కొంచెం వెనక్కి చరిత్ర లోకి వెళ్ళాలి.


మనకు స్వాతంత్ర్యం రాకముందు రాజులు, సామంతరాజులు, జమీందారులు ఉండేవారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఆ రోజులు పోయాయి. ఎవరికి తెలియoది, పుస్తకాలలో, చరిత్రలో ఎక్కడ కనబడనిదేoటంటే 2004 లో రాజశేఖరరెడ్డి సి.ఎం.గా వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ తరుపున సామంతరాజ్యాలను నెలకొల్పారు. ప్రతి నియోజక వర్గానికి ఎం.ఎల్.ఎ. ను సామంత రాజుగా చేశారు. గతంలో ఈ విధమైన పోకడ లేదు. వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి సి.ఎం. అయిన తర్వాత అదృష్టవశాత్తు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగవడంతో అనేక అభివృద్ధి, సంక్షేమ పధకాలు చేపట్టారు. దీంతో అనుకూల పరిస్థితులు ఏర్పడి ఈ పరిపాలనా అంశాలు కొట్టుకుపోయాయి. 2004 నుంచి ఎం.ఎల్.ఎ. ను సామంతరాజుగా చేసి విచ్చలవిడితనాన్ని అనుమతించారు. అధికారపార్టీ ఎం.ఎల్.ఎ. లేని నియోజకవర్గంలో ఆ పార్టీ ఇంచార్జే ఎన్నుకోబడిన ఎం.ఎల్.ఎ. కన్నా తనే సామంత రాజుగా అధికారాన్ని చలాయించాడు. అలా చేయడం వల్ల నియోజకవర్గంలో ఒక వ్యాపారం చేయాలన్నా, ఒక విగ్రహం పెట్టాలన్నా, ఒక ప్రారంభోత్సవం చేయాలన్నా, ఏదైనా చేయాలన్న, చేయకూడదన్నా, ఆఖరికి మంచి పని చేయాలన్నా, అక్రమాలు చేయాలన్నా  ఎం.ఎల్.ఎ. కను సైగల్లో జరగాలి. చీమ చిటిక్కుమన్నా తెలియాలి. అలాంటి వాతావరణం నెలకొంది. అందరూ ఎo.ఎల్.ఎ.లు అలా చేశారని అనను కాని కొంతమంది బాగా ఎక్కువగా చేశారు. చేయడంలో కొందరు ఎక్కువ, కొందరు తక్కువ. అంతేగాని సాధారణంగా ఒక మంచి వ్యక్తిత్వం ఉన్న ఎం.ఎల్.ఎ సైతం ఒక సామంతరాజుగా స్థానిక సంస్ధల ప్రతినిధులు, ఎం.పి ఎవరైనా సరే తనకిందే కొనసాగాలని రాజ్యాలు ఏలడo మొదలైంది 2004 నుంచే. దీనిలో కొంతమంది బాగా తీవ్ర స్థాయిలో అవినీతికి, అక్రమాలకు, పాల్పడి ప్రభుత్వధనాన్ని, ప్రజాధనాన్ని దోపిడీ చేశారు. ఏది చేయాలన్నా ఎం.ఎల్.ఎ.ను ప్రసన్నం చేసుకొని తీర్ధ ప్రసాదాలు సమర్పించుకోవాలి. చెడు చేయాలంటే వాటా ఇవ్వాలి, లేదంటే ఏదో బిక్షం వేసినట్లు కొంత ఇచ్చి అంతా తనే దోచుకొంటాడు. 


2004 నుంచి 2014 వరకు ఈ తంతు కొనసాగింది. 2014 నుంచి చంద్రబాబునాయుడు సి.ఎం. అయిన తర్వాత ఇవన్నీ చేస్తేనే రాజకీయంగా నిలబడగలమని భావించి తనూ ఈ తరహా వ్యవస్థను కొనసాగించారు. విచ్చలవిడితనాన్ని ప్రోత్సహించారు. పదేళ్ళ తర్వాత టి.డి.పి. అధికారంలోకి రాగానే ఆకలితో ఏదో కరువు ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు లాగా గతంలో వాళ్ళకన్నా ఎక్కువ దోచేశారు. అంతకు ముందు ఈ రకమైన ఎం.ఎల్.ఎ.లు జిల్లాకు ఒకరిద్దరు ఉంటే చంద్రబాబు హయాoలో జిల్లాకు నలుగురైదుగురు తయారయ్యారు. ఇంకా ఘోరంగా చెప్పాలంటే మంచిలోనేమో రెండాకులు తక్కువ, చేడులోనేమో రెండాకులు ఎక్కువ చదివి ఎం.ఎల్.ఎ.లు తీవ్రంగా ప్రవర్తించడం ప్రారంభించారు.


2004 నుంచి సామంతరాజులుగా కొనసాగే పరంపరలో కోడెల వ్యవహారం ఒక పరాకాష్ట. ఫర్నిచర్ విషయంలో కోడెలపై బాగా చెడు ప్రచారం వచ్చింది. ప్రజావేదిక, 29 ప్రాణాలు కూడా అంతే. ఎం.ఎల్.ఎ.లు విపరీత అధికారాలు చెలాయించడం, ప్రజావేదికను కట్టడం, పుష్కరాలప్పుడు వి.వి.ఐ.పి. ఘాట్ లో స్నానం చేయకుండా చంద్రబాబు సామాన్యజనాలకు కేటాయించిన ఘాట్ లో స్నానం చేయడం వంటివి 'జబ్బు' లక్షణాలు. అసలు జబ్బు ఏంటంటే చట్టాలను నిబంధలను అతిక్రమించే ప్రజాప్రతినిధుల చర్యలకు అధికారులు 'నో' చెప్పకపోవడమే. వ్యవస్థలన్నీ నిర్వీర్యమవడమే. అంతకు ముందు కూడా ఈ తరహా పరిస్థితి ఉన్నా 2004 తర్వాత ఎక్కువైంది. ఏ అధికారి కూడా ఒక ఎం.ఎల్.ఎ.కు, సి.ఎం. కు గాని ఏ రకంగానైనా 'నో' అని చెప్పలేని పరిస్థితి ఉంది. ఇది కుదరదు, చేయలేము, ఇది నిబంధనలకు వ్యతిరేకం అని వాళ్ళకు చెప్పకపోవడం 'జబ్బు'. ఐ.ఎ.ఎస్. ఐ.పి.ఎస్. అధికారులు, ఆఖరికి అటెండర్,  కూడా ప్రజలపై ప్రతాపం చూపిస్తారు. కాని ఒక ప్రజాప్రతినిధి, ఎం.ఎల్.ఎ., మంత్రి గాని ఒక నిర్ణయం తీసుకొంటే దానిలో మంచి చెడులు గురించి ఆలోచించి ఇది చేయకూడదని ఒక ఐ.ఎ.ఎస్., నుంచి పోలీస్ స్టేషన్ లో ఎస్.ఐ., ఎం.ఆర్.ఒ లు దాకా చెప్పడం లేదు.


వాళ్ళుచెప్పింది చేయడం తప్పితే ఇది చట్టవ్యతిరేకమైనదని, అనైతికతమైనదని అధికారులు 'నో' చెప్పడం లేదు. ఎక్కడో వందలో ఒక్కరో ఇద్దరో 'నో' అని చెప్పేవారు ఉండొచ్చు. కాని 99 శాతo ఐ.ఎ.ఎస్. నుంచి అటెండర్ వరకు అందరూ కూడా ఎం.ఎల్.ఎ. నుంచి ముఖ్యమంత్రి దాకా అందరికి 'ఎస్' అని చెప్పడమే గాని ఎవరికి 'నో' అని చెప్పే సాహసం చేయడం లేదు.
ఈ జబ్బు వల్లే సి.ఎం. పుష్కారాల స్నానానికి వస్తున్నప్పుడు అక్కడ ఎస్.పి. గాని, కలెక్టర్ గాని “సార్ మీరు మామూలు ఘాట్ లోకి వస్తే సామాన్య జనాలు ఇబ్బంది పడతారు, వి.వి.ఐ.పి. ఘాట్ లోనే స్నానం చేయాలి.” అని చెప్పే ధైర్యం చేయలేదు. నేను అక్కడికే వస్తానని ఒకవేళ సి.ఎం. చెబితే, ప్రజలు గంటల తరబడి వేచి ఉండడం వల్ల ఏమన్నా పరిణామాలు జరిగితే మేము బాధ్యులం కాదు అని నెగిటివ్ గా రిపోర్ట్ రాయలేరు. అప్పుడు మీదే బాధ్యత అని చెప్పే ధైర్యం కూడా లేదు. ఆ రోజు అక్కడ సి.ఎం.ను  అనుమతిoచకపోయి ఉన్నట్లయితే 29 మంది ప్రాణాలు కాపాడి ఉండేవారు. 
ప్రజావేదిక కూడా ఇంతే. ఆ నిర్మాణానికి టౌన్ ప్లానింగ్, ఆర్.&.బి, ఇరిగేషన్ అధికారులెవరైనా కరకట్ట లోపల కట్టకూడదు అని 'నో' చెప్పినట్లయితే ఆ నిర్మాణం జరిగేది కాదు. ప్రభుత్వం ప్రజల సొమ్ముతో కట్టకూడదు అని సంబంధిత అధికారులు 'నో' అని చెప్పినట్లయితే చంద్రబాబునాయుడు ఒక్కడే కట్టుకోలేరు కదా! ప్రజా ప్రతినిధులనేవాళ్ళు సంతకం పెట్టి పని చేయమంటారే కాని చేయాల్సింది క్రింది అధికారులు. అది చట్టబద్ధం కానప్పుడు వాళ్ళు 'నో' అని చెప్పాలి. కరకట్టకు లోపల కట్టినట్లయితే ప్రభుత్వ మార్గదర్శకాలకు తిలోదకాలు ఇచ్చినట్లు అవుతుందని చెప్పి ఉండాల్సింది. ప్రజావేదికను కరకట్టకు అవతల కట్టుంటే చంద్రబాబు నివాసానికి ప్రజవేదికకు మధ్య దూరం ఎక్కువై మరియు రోడ్డు ఉండడం వల్ల భద్రత కొంచెం సంక్లిష్టంగా ఉంటుందని నివాసం ప్రక్కనే ప్రజావేదిక కడితే భద్రత కల్పించడం సులభమవుతుందని పోలీస్ శాఖా వారు కూడా సూచించి ఉండవచ్చు. ఏయే శాఖలు దీని నిర్మాణంలో అనుమతులివ్వాలో అవన్ని 'నో' అని చెప్పి కరకట్టకు అవతల కట్టుకోవచ్చని చెప్పి ఉండాల్సింది.


  ఇక కోడెల విషయంలో టి.డి.పి. కార్యకర్తలు, అభిమానులే ఎక్కువ నష్టపోయారు. కాని ఫిర్యాదు చేసే ధైర్యం ఎవరికీ లేదు. ఎందుకంటే పోలీస్ స్టేషన్ కు, మరియు ఏ అధికారి దగ్గరికి వెళ్ళినా వాళ్ళు పట్టించుకోరు. అందుకే ఐదేళ్ళ కాలంలో కోడెల మీద ఫిర్యాదు చేసిన దాఖలాలు లేవు. అదే విధంగా అసెంబ్లీ సిబ్బందికి తెలియకుండా ఫర్నిచర్ ను ఎలా తీసుకెళ్తారు? ఇది నిబంధనకు వ్యతిరేకo అని అసెంబ్లీ అధికారులు ఎందుకు చెప్పలేదు? అదీగాక కోడెల కొడుకు షోరూం లో ఆ ఫర్నిచర్ ని వాడుకోవడం ఇంకా ఘోర తప్పిదం. అధికారులను సి.ఎం, ఎం.ఎల్.ఎ. లు ఏదన్నా పని చేయమన్నా, నిర్ణయం తీసుకొన్నా అది సరైంది కాకపోతే వీళ్ళు సలహా ఇవ్వాలి. ఇది తప్పు, ప్రజలకు నష్టం, ప్రభుత్వానికి నష్టం, నిబంధనలకు వ్యతిరేకమని వాళ్ళకు గట్టిగా చెప్పాల్సిన బాధ్యత అధికారులకు ఉంది. ఒకవేళ వింటే వింటారు వినకపోతే వ్యతిరేకించాలి. ఆ నిర్ణయాలు అమలు చేయకూడదు. కాదంటే బదిలీ చేస్తారు. అంతకు మించి ఏమి చేయలేరు. కాని అధికారులకు కూడా వాళ్ళకుండే ఇబ్బందులు వాళ్ళకు ఉన్నాయి. కావాల్సిన చోటుకి బదిలీలు కావాలన్నా, మంచి పోస్టులు కావాలన్నా, అదే స్థానంలో కొనసాగాలన్నా ప్రజాప్రతినిధుల మాటలకు తలొగ్గాల్సిందే. అందుకని ఇదంతా మనకెందుకులే, వాళ్ళతో గొడవ, రోజు మన ఉద్యోగం మనం చేసుకోవాలానే భావంతో ఉంటున్నారు. లేదా అవినీతి చేసి బాగా సంపాదించాలనే ధ్యాసే కలిగి ఉంటున్నారు.


గోదావరి పుష్కరాలలో జరిగిన సంఘటనకు బాధ్యులైన అధికారులపై ఎందుకు చర్య తీసుకోరు? ఇప్పుడు సoబంధిత  ఐ.ఎ.ఎస్, ఐ.పి.ఎస్., ఇతర అధికారులపై విచారణ చేసి ఎందుకు చర్య తీసుకోరు? అదే విధంగా కోడెలపై కేసు పెట్టారు. అంటే జబ్బు లక్షణానికి మందేసినట్లైంది. కాని అసలు కోడెల ఇలా చేయడానికి కారణమైన అధికారులపై, ప్రజావేదిక నిర్మాణానికి సంబంధించి కూడా దానికి సహకరించిన అధికారులపై చర్య తీసుకోవాలి. తప్పు తీవ్రతను బట్టి ఉద్వాసన పలకాలి. అప్పుడే జబ్బుకు చికిత్స చేసినట్లవుతుంది. అంతేగాని 'వేరుకు పురుగు పడితే ఆకుకు మందు' వేసే చందంగా ఉండకూడదు. ప్రధాని నరేంద్రమోడీ కేంద్రంలో తప్పు చేసిన అధికారులను తీసిపారేస్తున్నారు. ఇక్కడ కూడా తప్పు చేసిన వారిని ఆ ఉద్యోగం నుంచి తీసివేయాలి. అప్పుడే అధికారుల్లో భయం అనేది ఏర్పడుతుంది. ఇలా చేస్తే భవిష్యత్ లో జగన్ మోహన్ రెడ్డి చట్టాలకు, నిబంధనలకు వ్యతిరేకంగా ఏమన్నా చెప్పినా కూడా చేయరు.


అధికారులందరూ రాజ్యాంగానికి, చట్టాలకు బద్ధులై తమ విధుల ప్రకారం నడుచుకోవాలి కాని ప్రజా ప్రతినిధులకు వంత పాడకూడదు. తమ సొంత ఆర్థిక ప్రయోజనాలకోసం పోరాడే ఉద్యోగ సంఘాలు ఈ విధంగా 'నో' అని చెప్పే అధికారులకు  బాసటగా నిలవాలి. చట్టప్రకారం నడుచుకొనే అధికారుల మీద ప్రజా ప్రతినిధులు ఏమన్నా కక్ష సాధింపు చర్యలు చేపట్టినా, అనవసర బదిలీలు చేసినా ఈ సంఘాలు మరియు న్యాయస్థానాలు వారికి అండగా నిలబడాలి. అధికారులను తరుచు బదిలీలు చేయకుండా ఒక కాల పరిమితి ప్రకారం పారదర్శకంగా బదిలీలు చేయాలి. అధికారులు 'నో' చెప్పినా, వాళ్ళను రక్షించే వ్యవస్థ ఉండాలి. 


రోజూ ఎం.ఎల్.ఏ.లు, వారి అనుచరులు, నిబంధనలు అతిక్రమించి అధికారులను లోబర్చుకొని సామాన్య ప్రజలను వేధిస్తుంటే ప్రజాస్వామ్యంలో సామాన్యులను రక్షించాల్సిన వ్యవస్థలు ఏమయ్యాయి? ప్రజా ప్రతినిధులు బరితెగించి చేస్తున్న దుర్మార్గాలను, దౌర్జన్యాలను అడ్డుకోవాల్సిన న్యాయస్థానాలు, పోలీసులు, రెవిన్యూ, ఇతర యంత్రాగం కనులున్నా చూడనట్లు వ్యవహరిస్తున్నాయి.


 అధికారులు 'నో' చెబితే ఏ ప్రజా ప్రతినిధైనా వినాలి. ప్రజల సొమ్ముతో జీతాలు తీసుకుంటూ ప్రజలకు సేవ చేయాలేగాని ఎం.ఎల్.ఎ.లు, వి.వి.ఐ.పి.లు చెప్పే చట్టవ్యతిరేకమైన పనులు అధికారులు చేయకూడదు. అలా చేయకపోవడంతో ప్రజా ప్రతినిధులు ఆటలు సాగుతున్నాయి. అధికారులలో ఉన్న వెన్నుముక లేని తత్వాన్ని విడనాడాలి. అప్పుడే సమాజానికి పట్టిన ఈ జబ్బు నయమవుతుంది. అంతే కాని కంటి తుడుపు చర్యగా ప్రభుత్వo తీసుకొనే చర్యలు సరిపోవు. ఈ మూడు అంశాలే కాకుండా రోజు రాష్ట్రం మొత్తం మీద ఈ తరహా సంఘటనలు కొన్ని వేలు జరుగుతున్నాయి. కేవలం రెండు మూడు అంశాలపై తూతూ మంత్రంగా చర్యలు తీసుకుంటున్నారు. 'నో' చెప్పని అధికారులు, ఎస్. అని చెప్పి కర్తవ్యాన్ని విస్మరించిన అధికారులు, ఇలాంటి సంఘటనలు పర్యవేక్షించిన అధికారులు, ప్రజా ప్రతినిధులను దేవుడులా భావించే అధికారులకు కనువిప్పు కలిగించే విధంగా అధికారులపై చర్యలు చేపట్టాలి. అధికారులు భవిష్యత్ లో 'నో' చెప్పడం నేర్చుకొని క్రమేణా ఈ 'జబ్బు' కు చికిత్స జరిగి నయమవుతుంది. ప్రజాస్వామ్య వ్యవస్థ పరిపుష్టి అవుతుంది.


 *(రాయపాటి మోహన్ సాయిక్రిష్ణ)* 
      


Popular posts
*కలిగిరి కార్యదర్శి వి.మధు కు ఉత్తమ అవార్డు* ఉదయగిరి, ఆగష్టు 23 (అంతిమ తీర్పు- ఇంచార్జ్ దయాకర్ రెడ్డి): ఉదయగిరి నియోజకవర్గంలోని కలిగిరి పంచాయితీ కార్యదర్శి వెలుగోటి. మధు ఉత్తమ కార్యదర్శిగా ఎంపికయ్యారు. ఆగష్టు 15 స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రకటించిన ఉత్తమ అధికారుల జాబితాలో మధు ముందు వరుసలో నిలిచారు. గత 4 సంవత్సరాల నుండి ఆయన అవార్డులకు ఎంపిక కాబడుతుండటం గమనించదగిన విషయం. పంచాయితీ సెక్రటరీగా కలిగిరిలో గ్రామ పంచాయితీ అభివృద్ధికి బంగారు బాటలు వేశారు. ఎంతోకాలంగా ఆక్రమణల చెరలో ఉన్న పంచాయితీ స్థలాలకు కబ్జా కోరల నుండి విముక్తి కల్పించి ప్రభుత్వానికి ఆదాయ వనరులను చూపించారు. కరోనా కాలంలో ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయడంతో పాటు పారిశుద్ధ్య కార్యక్రమాలను వేగవంతం చేశారు. ప్రతినెలా 1 వ తేదీన జరిగే ఫించన్ల పంపిణీ విషయంలో వెలుగోటి.మధు చేస్తున్న కృషి పలువురి ప్రశంసలు అందుకుంటున్నది. ఉదయం 7 గంటల కల్లా ఫించన్ల పంపిణీ లక్ష్యాలను అధిగమించి అందరి చేత బేష్ అనిపించుకుంటారు. వృత్తి పట్ల అంకితభావం కలిగిన మధును ఈ యేడాది కూడా ఉత్తమ కార్యదర్శి అవార్డు వరించడం అభినందనీయమని పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Image
శ్రీ‌వాణి ట్ర‌స్టు దాత‌ల కోసం ఆన్‌లైన్ అప్లికేష‌న్ ప్రారంభం
ఆంధ్ర ప్రదేశ్‌ రెవెన్యూశాఖ ఆధ్వర్యంలో ఇకపై ఆటో మ్యుటేషన్‌ సేవలు అమలు.
పౌష్ఠిక ఆహారం అందజేత
Image
ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కు అందజేత
Image