ఆదివారం నుంచి సచివాలయానికి తాళం

ఆదివారం నుంచి సచివాలయానికి తాళం
హైదరాబాద్ : తెలంగాణ ప్రస్తుత సచివాలయానికి తాళం పడనుంది. ఇందుకు ముహూర్తం ఆదివారం ఉదయం పదిన్నర గంటలు. ఈ సచివాలయాన్ని పూర్తిగా తొలగించి, దాని స్థానంలో కొత్త సచివాలయాన్ని నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం విదితమే. ఈ క్రమంలో... సచివాలయంలోని అన్ని శాఖలూ ఇప్పటికే బీఆర్కే భవన్‌తోపాటు మరికొన్ని భవనాలకు తరలిపోయిన విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలో ఇక సచివాలయానికి పూర్తి స్థాయిలో ఆదివారం నుంచి తాళం పడనుంది. సచివాలయాన్ని ఖాళీ చేసి వెంటనే వెళ్ళపోవాలంటూ అన్ని శాఖలకూ సాధారణ పరిపాలనా శాఖ నుంచి శుక్రవారం ఆదేశాలందాయి. సచివాలయం నుంచి శాఖల తరలింపు ప్రక్రియ ఇప్పటికే 90 శాతం పూర్తైంది. ఆదివారం సాయంత్రానికి తరలింపు ప్రక్రియ పూర్తి కానుంది. కాగా ఆదివారం నుంచి సచివాలయానికి తాళం పడనున్న నేపధ్యంలో... సాధారణ పరిపాలనా శాఖ సిబ్బంది బృందాలుగా విడిపోయి శుక్రవారం మధ్యాహ్నం నుంచి అన్ని బ్లాకులనూ చుట్టబెట్టారు. ఆయా శాఖల సిబ్బందిని వెంటనే బీఆర్కేఆర్ భవనానికి తరలిపోవాలని సాధారణ పరిపాలన శాఖ సిబ్బంది సూచించారు. ఆదివారం ఉదయం పాత సచివాలయ ప్రాంగణం ప్రధాన ద్వారానికి సాధారణ పరిపాలన శాఖ అధికారులు తాళాలు వేయనున్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దగ్గర తాళంచెవి ఉంటుందని, అవసరం ఉన్నవాళ్లు తాళాలను సీఎస్ దగ్గరి నుంచే తీసుకోవాల్సి ఉంటుందని జీఏడీ అధికారులు సూచిస్తున్నారు.