Press Meet Points On Alapati Rajendhra Prasad 29-09-2019
--
తేది 29-09-2019
విలేకరుల సమావేశం వివరాలు
వివేకానందరెడ్డి హత్యకేసును నీరుగారుస్తున్న వైకాపా ప్రభుత్వం
కుటుంబ పెద్ద హత్య కేసులోనే ఇంత నిర్లక్ష్యమైతే.. సామాన్యుల పరిస్థితేంటి..?
మిగులు విద్యుత్ రాష్ట్రంగా చంద్రబాబు మారిస్తే.. జగన్ అంధకారంగా మార్చేశారు
పాలన చేతగాక చంద్రునిపై మచ్చ వేసే ప్రయత్నం చేస్తున్నారు..
- ఆలపాటి రాజేంద్రప్రసాద్
వైఎస్ రాజశేఖర్‌రెడ్డి తర్వాత కుటుంబ పెద్ద, సొంత బాబాయి అయిన వివేకానందరెడ్డి చనిపోతే.. ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్రెడ్డి ఆ కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించడం బాధాకరమని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ అన్నారు. గుంటూరు నగరంలోని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వివేకానందరెడ్డి హత్య జరిగి నేటికి 198 రోజలైతే.. ఏపీ సీఎంగా వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం చేసి 121 రోజులు గడిచినా కేసులో చిక్కుముడి వీడలేదని విమర్శించారు. వివేకా మృతి సమయంలో గుండెపోటు అని ఒకరు.. హత్య అంటూ మరొకరు ఇలా కుటుంబసభ్యులే భిన్న స్వరాలు వినిపించారన్నారు. సొంత బాబాయి చనిపోతే సాయంత్రం వరకు చూడటానికి జగన్మోహన్రెడ్డి వెళ్లకపోవడంపై నాడు అనేక అనుమానాలు వచ్చాయన్నారు. వివేకానంద రెడ్డి హత్య మిస్టరీని తేల్చడం కోసం సీబీఐతో విచారణ జరపాలని ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో డిమాండ్ చేసిన జగన్మోహన్రెడ్డి.. సీఎంగా పగ్గాలు చేపట్టి ఇన్నాళ్లు అవుతున్నా కేసును ఎందుకు చేధించలేకపోయారని ప్రశ్నించారు. వైకాపా ప్రభుత్వం కేసును నీరుగార్చడానికి వైకాపా ప్రయత్నిస్తోందని ఆరోపించారు. అసలు నిందితులను రక్షించడానికి అమాయకులను ఆత్మహత్య చేసుకునేలా పోలీసులతో వేధింపులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికే పోలీసుల ఒత్తిడితో శ్రీనివాసులు రెడ్డి ఆత్మహత్యకు పాల్పడ్డాడన్నారు. ఆత్మహత్యకు ముందు శ్రీనివాస్ రెడ్డి రాసినట్టుగా భావిస్తున్న రెండు సూసైడ్ నోట్లలో వేర్వేరు చేతి రాతలు ఉన్నాయని.. ఒక లేఖ శ్రీనివాస్‌రెడ్డి రాసినా మరో చేతిరాత ఎవరిది అన్నది కూడా ఇప్పటి వరకు తెలుసుకోలేకపోయారన్నారు. హత్య కేసు ఛేదించేందుకు డీజీపీ గౌతమ్‌సవాంగ్ స్వయంగా రంగంలోకి దిగినా.. కేసు విచారణ ఎందుకు ఆలస్యమవుతోందన్నారు. పరిటాల రవి హత్య కేసులోని నిందితులలో కొందరు జైళ్లలో చంపబడితే.. మరికొందరు ఆత్మహత్యలు చేసుకున్నారని.. అటువంటి పరిణామక్రమాలు మరలా వివేకానందరెడ్డి హత్య కేసులో చోటుచేసుకుంటున్నాయన్నారు. తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు వరుస ప్రెస్ మీట్లు పెట్టిన వైఎస్ వివేకానంద కూతురు సునీతారెడ్డి.. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి హత్య గురించి ఎందుకు మాట్లాడటం లేదన్నారు. హత్య జరిగి ఇన్నాళ్లయినా.. వివరాలు బయటకు రాకపోవడంపై మీ జగనన్న ప్రభుత్వాన్ని ఎందుకు నిలదీయలేకపోతున్నారన్నారు. స్వయానా చిన్నాన్నను చంపినవారిని పట్టుకోలేని వారు రాష్ట్రాన్ని ఏం కాపాడతారన్నారు ఆలపాటి రాజేంద్రప్రసాద్. రాష్ట్రంలో పాలన, అభివృద్ధి పూర్తిగా కనుమరుగయ్యాయని ఎద్దేవా చేశారు.
విద్యుత్ కొరతతో అంధకారం దిశగా రాష్ట్ర ప్రగతి
2014 రాష్ట్ర విభజన నాటికి ఏపీలో విద్యుత్ కోతలు అధికంగా ఉండటంతో రాష్ట్రం మొత్తం పూర్తి అంధకారంలో ఉండేదని, దాదాపు 22 లక్షల యూనిట్ల విద్యుత్ కొరత కారణంగా నిత్యం కరెంట్ కోతలతో జనం అల్లాడుతున్న రాష్ట్ర ప్రజలకు టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండు నెలల వ్యవధిలోనే 24 గంటల విద్యుత్ అందించిన ఘనత తమ ప్రభుత్వానిదని ఆలపాటి రాజేంద్రప్రసాద్ పేర్కొన్నారు. ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వం రాష్ట్రంలో కోతలు లేని విద్యుత్ సరఫరా చేసి రాష్ట్ర ప్రజలకు అండగా ఉంటే... నేటి ప్రభుత్వం వర్షాకాలంలో సైతం విద్యుత్ కోతలతో జనాన్ని ఇబ్బందులకు గురి చేయడం బాధాకరమన్నారు. విద్యుత్ అంశంపై తాము ఈవిధంగా విలేకరుల సమావేశంలో మాట్లాడాల్సి రావడం సిగ్గుచేటు అని అన్నారు. చంద్రబాబు దూరదృష్టితో విద్యుత్ లోటును కేవలం రెండు నెలల కాలంలోనే పూర్తిస్థాయిలో అధిగమించారన్నారు. కానీ వైసీపీ ప్రభుత్వ చర్యలతో 2014కు ముందు నాటి పరిస్థితులు తీసుకొచ్చారని మండిపడ్డారు. అధికారంలోకి వస్తే తొమ్మిది గంటల పాటు నాణ్యమైన విద్యుత్ ఇస్తామని గొప్పలు చెప్పుకున్న వైసీపీ... ప్రస్తుతం అప్రకటిత విద్యుత్ కోతలతో జనాన్ని ఇబ్బందులకు గురి చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ హయాంలో మిగులు విద్యుత్ సాధించిన చరిత్ర ఏపీకి ఉంటే అదే వైసీపీ హయాంలో విద్యుత్ కొరతతో ప్రజలు అల్లాడటం వైసీపీ ప్రభుత్వ చేతకానితనానికి నిదర్శనం కాదా? అని ప్రశ్నించారు. ఆనాడు చంద్రబాబు విద్యుత్ రంగంలో అనేక సంస్కరణలు తీసుకోస్తే జగన్ ప్రభుత్వం మాత్రం విద్యుత్ రంగాన్ని సంక్షోభంలోకి నెట్టే ప్రయత్నం చేస్తోందని ఆలపాటి ఆక్షేపించారు. రాష్ట్ర విభజన సమయంలోనూ విద్యుత్ వాటాల పంపకంలో రాష్ట్రానికి అన్యాయం జరిగిందని, అయినా మా నాయకుడు చంద్రబాబు ముందు చూపుతో మిగులు విద్యుత్ సాధిస్తే... ఉన్న విద్యుత్‌ను ఉపయోగించుకోవడం చేతకానీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి... నిత్యం గత ప్రభుత్వంపై నిందలు వేయడం ఎంత వరకు సబబో చెప్పాలన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో విధిస్తున్న విద్యుత్ కోతలకు జగన్మోహన్రెడ్డి, అధికారులు ఏం సమాధానం చెబుతారో చెప్పాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వంలో జరిగిన విద్యుత్ ఒప్పందాల్లో ఎటువంటి అవకతవకలు చోటుచేసుకోలేదని అటు కేంద్ర పెద్దలు, ఇటు హైకోర్టు జగన్ ప్రభుత్వానికి మొట్టికాయలు వేసినా ప్రభుత్వానికి సిగ్గురాకపోవడం విచారకరమన్నారు. జగన్‌కు సరైన అవగాహన లేకపోవడం వల్లే ధర్మల్విద్యుత్ ప్లాంట్లు సైతం మూతపడే స్థితికి చేరుకున్నాయని అన్నారు. కనీసం పది రోజులకు సరిపడా బొగ్గు నిల్వలు లేకపోవడంతో విద్యుత్తుత్పత్తికి ఆటంకం ఏర్పడిందని, ఫలితంగా రాష్ట్రంలో విద్యుత్ కోతలు తీవ్రతరమౌతున్నాయని తెలిపారు. జగన్ పాలనతో ప్రస్తుతం రాష్ట్రంలో ఏ వర్గం సైతం సంతృప్తిగా లేరని, విద్యుత్ ఎప్పుడు వస్తుందో తెలియక రైతన్నలు, కార్మికులు అనేక ఇబ్బందులు పడుతున్నారని ఇకనైన ప్రభుత్వం కళ్లు తెరచి వాస్తవాలు గ్రహించాలని ఆలపాటి రాజేంద్రప్రసాద్ హితవు పలికారు.