ఆటోమొబైల్, ఆహారశుద్ధి, రొయ్యలసాగు, మామిడిపండ్లు, మిర్చిసాగు రంగాల్లో తోడ్పడండి

ఆటోమొబైల్, ఆహారశుద్ధి, రొయ్యలసాగు, మామిడిపండ్లు, మిర్చిసాగు రంగాల్లో తోడ్పడండి
* ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం విజ్ణప్తి
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర్లంలో ఆటోమైబైల్, ఆహరశుద్ధి రంగాలతో పాటు రొయ్యల సాగు మామిడి పండ్ల ఉత్పత్తి ఎగుమతి రంగాల్లో తోడ్పాటును అందించేందుకు దక్షిణ కొరియా సంస్థలు ముందుకు రావాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం విజ్ణప్తి చేశారు. దక్షిణ కొరియా కౌన్సల్ జనరల్ ఆఫ్ ఇండియా ఇన్ బూసన్ జంగ్ డియోక్-మిన్ (Jung Deok-min)నేతృత్వంలో గల దక్షిణ కొరియాకు చెందిన కంపెనీల ప్రతనిధి బృందం శుక్రవారం అమరావతి సచివాలయంలో సిఎస్ సుబ్రహ్మణ్యం, సియం ప్రధాన సలహాదారు అజయ్ కల్లాంతో సమావేశమైంది. ఈ సందర్భంగా సిఎస్ మాట్లాడుతూ యువ సియం జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని నూతన ప్రభుత్వం రాష్ట్ర సమగ్రాభివృద్ధికి వినూత్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టి పటిష్టంగా అమలు చేస్తోందని చెప్పారు. రాష్ట్రంలో అపారమైన సహజ వనరులున్నాయని, వ్యవసాయంలో రాష్ట్రం గణనీయమైన అభివృద్ధి సాధిస్తోందని వ్యవసాయ ఉత్పత్తులకు మరింత విలువ ఆధారిత సేవలను జోడించేందుకు కృషి జరుగుతోందని తెలిపారు. యువతకు వివిధ రంగాల్లో నైపుణ్య శిక్షణ ఇప్పించి పెద్దఎత్తున ఉపాధి కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ముఖ్యంగా రాష్ట్రం రొయ్యల ఉత్పత్తి ఎగుమతిలో దేశంలో అగ్రగామిగా ఉందని ఈరంగంలో మరింత మెరుగైన ప్రగతిని సాధించేందుకు కొరియన్ సంస్థలు ముందుకు రావాలని ఆకాంక్షించారు. రాష్ట్రంలో విశాఖపట్నం-చెన్నై, చెన్నై-బెంగుళూర్ పారిశ్రామిక క్లస్టర్లు అభివృద్ధి జరుగుతోందని ఈ క్లస్టర్లలో ఆటోమొబైల్ పరిశ్రమలు ఏర్పాటుకు ముందుకు రావాలని కోరారు. మామిడిపండ్లు, మిర్చి ఉత్పత్తి ఎగుమతిలో రాష్ట్రం మంచి పేరుగాంచిందని వాటిని వాటిని మరింత ప్రోత్సహించేందుకు తోడ్పడాలని సిఎస్ విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా కొరియన్ టెక్నికల్ ఇనిస్టిట్యూట్లు రాష్ట్రంలోని కొన్ని ఇంజనీరింగ్, పాలిటెక్నిక్ కళాశాలలను ఎంపిక చేసి విద్యా వ్యాప్తికి కృషి చేయాలని అన్నారు. పిపిపి తరహాలో మౌళిక సదుపాయాల అభివృద్ధి ప్రాజెక్టులు స్థాపనకు, కొరియా ఎఎంఇ ఇండస్ట్రియల్ కాంప్లెక్సు ఏర్పాటుకు కృషి చేయాలని సిఎస్ విజ్ఞప్తి చేశారు. అంతేగాక నైపుణ్య శిక్షణ, వొకేషనల్ శిక్షణలో తోడ్పాటును అందించాలన్నారు. రాష్ట్రంలో పెద్దఎత్తున భూములు సర్వే ప్రక్రియ కొనసాగుతోందని దానికి బ్లాక్ చెయిన్ టెక్నాలజీ తోడ్పాటును అందించేందుకు కృషి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సుబ్రహ్మణ్యం కోరారు.  
                                   ప్రభుత్వ ప్రధాన సలహాదారు అజయ్ కల్లాం మాట్లాడుతూ రాష్ట్రంలో ఆహారశుద్ధి, మౌళిక సదుపాయాల రంగాల్లో కలిసి పనిచేసేందుకు కొరియన్ సంస్థలు ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు. అదే విధంగా రాష్ట్రం ఉష్ణ మండల వాతావరణంతో కూడి మామిడి, మిర్చి, పొగాకు, ప్రత్తి, వరి, వివిధ చిరుధాన్యాల పంటలకు పెట్టింది పేరని ఈ పంటల సాగు ఎగుమతుల ప్రోత్సాహానికి వాటికి విలువ ఆధారిత సేవలను పెంపొందించేందుకు కలిసి పనిచేసేందుకు తోడ్పడాలని కోరారు. రాష్ట్రంలో కొరియన్ ఇండస్ట్రియల్ కాంప్లెక్సు ఏర్పాటుకు ముందుకు వస్తే అందుకు అవసరమైన స్థలాన్ని సమకూర్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. అలాగే రాష్ట్రంలో పెద్దఎత్తున రొయ్యలసాగు జరుగుతోందని ఒకరకంగా చెప్పాలంటే ఏపీని స్రింప్ క్యాపిటల్ గా పేర్కొనవచ్చని కావున ఈరంగంలో మరింత ఉత్పత్తి,ఎగుమతుల ప్రోత్సాహానికి తోడ్పడాలని విజ్ఞప్తి చేశారు.
కౌన్సల్ జనరల్ ఆఫ్ ఇండియా ఇన్ బూసన్ జంగ్ డియోక్ మిన్ మాట్లాడుతూ గతంలో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొరియన్ ఇండస్ట్రియల్ కాంప్లెక్సు ఏర్పాటుకు చర్యలు తీసుకోనున్నట్టు తెలిపారు. పారిశ్రామిక, ఐటి, విద్య, వ్యవసాయం, విద్య, మత్స్యరంగాలు, ఆరోగ్య రంగాల్లో రాష్ట్రంతో కలిసి పనిచేసేందుకు కొరియన్ సంస్థలు అన్ని విధాలా ఆసక్తితో ఉన్నాయని చెప్పారు. సమావేశంలో కౌన్సల్ జనరల్‌తో పాటు 18మంది కొరియన్ కంపెనీల ప్రతినిధి బృందం పాల్గొంది. అలాగే ఏపీ ఆర్ధికాభివృద్ధి సంస్థ (ఎపిఈడిబి) ప్రతినిధులు పాల్గొన్నారు.