డాక్టర్ కోడెల ఆత్మహత్య, వ్యవస్థీకృత హత్య: సిపిఐ నారాయణ

డాక్టర్ కోడెల ఆత్మహత్య, వ్యవస్థీకృత హత్య: సిపిఐ నారాయణ
డాక్టర్ కోడెల శివప్రసాద రావు స్నేహితులు హైదరాబాద్ దసపల్లా కన్వెన్షన్ సెంటర్ లో ఆదివారం నిర్వహించిన కోడెల ఆత్మీయుల సమ్మేళనంలో ప్రసంగించారు.
ఈ సందర్భంగా సిపిఐ నారాయణ మాట్లాడుతూ,'' డాక్టర్ కోడెల ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదు. ఆయన మృతికి రాష్ట్ర ప్రభుత్వమే కారణం. కోడెల రాజకీయాల్లోకి రాకముందు పల్నాడులో అప్పటి పాలకుల దమనకాండ యధేచ్చగా సాగేది. ఎక్కడబడితే అక్కడ శవాలు రైల్వే ప్లాట్ ఫామ్ పై ఉండేవి. అలాంటిస్థితిలో కోడెల రాజకీయ ప్రవేశం చేశారు. పల్నాట ప్రజాస్వామ్యాన్ని బతికించారు. విజయవంతమైన వైద్యుడు కోడెల. పేదల పాలిట పెన్నిధిగా ఉన్నారు.
రాజకీయాల్లో కాంట్రవర్సీ అనేది సహజం. నాన్ కాంట్రవర్సీ పొలిటిసియన్లను నమ్మలేం. యాక్టివ్ పొలిటిసియన్లు అందరూ కాంట్రవర్సీలే. ఫర్నిచర్ తీసుకెళ్లమని లేఖలు రాశాక చోరీ కేసుల నమోదు సహేతుకం కాదు. 
ఆత్మహత్య చేసుకునేంత దుర్భలుడు కాదు కోడెల. ఆత్మహత్య చేసుకునే బలమైన పరిస్థితుల్లోకి కోడెల నెట్టబడ్డారు. కేసులు పెట్టమని పాలకులే రెచ్చగొట్టడం అతిదారుణం.
డాక్టర్ కాసు ప్రసాద్ రెడ్డి: మ్యాక్సివిజన్ తొలి ఆసుపత్రి ప్రారంభోత్సవంలో కోడెల సహకారం మరువలేం. కాసు కుటుంబానికి కోడెలకు వైరం ఉందనే ప్రచారం ఆవాస్తవమని కోడెల రుజువు చేశారు. కంటివైద్యంలో కొత్త టెక్నాలజిని ఇండియాకు తెచ్చాక హైదరాబాద్ లో మ్యాక్సివిజన్ తొలి ఆసుపత్రి ప్రారంభించాలని అనుకున్నాం. గవర్నర్ రంగరాజన్ ను ప్రారంభోత్సవానికి ఆహ్వానించగా ప్రైవేటు ఆసుపత్రి ప్రారంభానికి ఆయన నిరాకరించారు. అప్పుడు మంత్రిగా ఉన్న కోడెల చొరవ వల్లే గవర్నర్ రంగరాజన్ వచ్చి మ్యాక్సివిజన్ ప్రారంభించిన విషయం గుర్తు చేశారు. కోడెలపై వచ్చిన ఆరోపణలకు ఆయన కారకులు కాదని మాకు తెలుసు, ఆయనకు తెలుసు. ఆయన వెనుక ఎవరో చేసిన తప్పులకు కోడెల బలయ్యారు.
డాక్టర్ డిటి నాయక్: రైతులు ఆత్మహత్యలు, విద్యార్ధుల ఆత్మహత్యలు చూశాంగాని సీనియర్  రాజకీయ నాయకుల ఆత్మహత్య ఇప్పుడే చూశాం. దీనిపై మేధావులు ఆలోచించాలి. కాసు కృష్ణారెడ్డి నాకు పియూసిలో సహాధ్యాయి కాగా, ఎంబిబిఎస్ లో కోడెల సహాధ్యాయిగా చెబుతూ ముగ్గురి స్నేహం తమ విధుల నిర్వహణకు ఎప్పుడూ ఆటంకం కాలేదని తెలిపారు. హోంమంత్రిగా  కోడెలతో తన విధి నిర్వహణలో ఎదురైన అంశాలను గుర్తు చేసుకున్నారు.
పల్లె రఘునాధ్ రెడ్డి: భరింపరాని బాధ, ఆత్మక్షోభకు కోడెల గురయ్యారు. ఆయన ఆత్మహత్యకు ప్రభుత్వం సిగ్గుతో తలవంచుకోవాలి. మహానేత బలవన్మరణానికి పాల్పడే పరిస్థితి ప్రభుత్వమే తెచ్చింది. ప్రజల పట్ల, నియోజకవర్గం పట్ల అంత చిత్తశుద్ది గల నాయకుడిని చూడలేదు. ప్రజాసేవ చేయడంలో ఆయనకు ఆయనే సాటి. రాజకీయాల్లో ప్రత్యేక ఒరవడి సృష్టించారు. చేపట్టిన ప్రతిపదవికి వన్నెతెచ్చారు. స్వచ్ఛాంధ్రప్రదేశ్ కు మార్గదర్శకంగా నరసరావుపేట, సత్తెనపల్లి నియోజకవర్గాలను తీర్చిదిద్దారు. మరుగుదొడ్లు, పక్కా ఇళ్లు, రోడ్లు, తాగునీటి పథకాలు,ఇరిగేషన్ స్కీములు ఎన్నో అభివృద్ది చేశారు. కోటప్పకొండను అద్భుత పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దారు.
మండవ వెంకటేశ్వర రావు(మాజీ మంత్రి): ఒక మంచివ్యక్తిని, గొప్ప నేతను వ్యవస్థ మింగేసింది. మంత్రివర్గ సహచరుడిగా కోడెలతో అన అనుబంధం గుర్తు చేశారు.
రామ్మోహన్ రావు(మాజీ డిజిపి): రాజకీయాల్లో ఓనమాలు దిద్దేటప్పుడు నన్ను అంకుల్ అని కోడెల పిలిచేవారు. తాను డిజిపిగా, ఆయన హోంమంత్రిగా ఆ 2ఏళ్లలో గత స్మృతులను ప్రస్తావించారు.
డాక్టర్ గోఖలే(కార్డియాలజిస్ట్): వైద్యులు అందరికీ డాక్టర్ కోడెల రోల్ మోడల్. కామన్ మ్యాన్ కు కోడెల ఎంతో దగ్గరగా ఉండేవారు. ఒక సింహాన్ని చూసినట్లు ఉండేది. దేనికీ తలదించనివాడు, ఆత్మహత్య చేసుకోవడమే అందరిని కలిచివేసింది.
నాదెళ్ల గంగాధర్(తానా మాజీ అధ్యక్షుడు): నందమూరి బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి అభివృద్దికి కోడెల చేసిన కృషిని మరువలేము. జన్మభూమి అభివృద్ధిలో ఎన్నారైలను భాగస్వాములను చేశారు. 
లక్ష్మీనారాయణ(మాజీ ఐఏఎస్ అధికారి): 
''రాజకీయాల్లో ద్వేషభావాలు పెరగడం అవాంఛనీయ పరిణామం. అబద్దాల ఆరోపణలకు కోడెల బలయ్యారు'' అని పలువురు వక్తలు అభిప్రాయబడ్డారు. 
మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు, మాజీ ఎంపి మురళీమోహన్, కంభంపాటి రామ్మోహన్ రావు,మాజీ ఐఎఎస్ అధికారి లక్ష్మీనారాయణ, బొల్లినేని శీనయ్య, సీనియర్ జర్నలిస్ట్ డిఎన్ ప్రసాద్, మాగంటి రూప తదితరులు ప్రసంగించారు. హైదరాబాద్ లోని వివిధ ప్రాంతాలకు చెందిన కోడెల అభిమానులు, స్నేహితులు ఈ సంస్మరణ సభకు హాజరయ్యారు.