గుట్టుగా ఎంపిక

గుట్టుగా ఎంపిక
గుట్టుచప్పుడు కాకుండా నియామకపత్రాలందజేత
గంటల వ్యవధిలో హాజరు కావాలని అదేశం
మెరిట్‌ లిస్టు లేకుండానే ఎంపిక ప్రక్రియ
పలువురిలో అనుమానాలు
అధికారుల తీరుపై ఆగ్రహం
అనంతపురం : జిల్లా ఎక్సైజ్‌ శాఖ పరిధిలోని ప్రభుత్వ మద్యం దుకాణాల్లో పోస్టుల భర్తీపై ఏదో కిరికిరి జరిగిందనే అనుమనాలు వ్యక్తమవుతున్నాయి. అభ్యర్థుల మెరిట్‌ లిస్టు ప్రదర్శించకుండా గుట్టుచప్పుడు కాకుండా ఉద్యోగాలకు అభ్యర్థులను ఎంపిక చేయడం పలు అనుమానాలకు తావిస్తోంది. నిరుద్యోగ అభ్యర్థులను ఈ వ్యవహారం కలవరపెడుతోంది. మొత్తమ్మీద ప్రభుత్వ మద్యం దుకాణాల్లోని సూపర్‌వైజర్‌, సేల్స్‌మెన్‌ ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. అయితే ఆశాఖ అధికారులు మాత్రం నిబంధనల ప్రకారమే పోస్టులు భర్తీచేశామని చెప్పుకుంటూండడం ఆశ్చర్యం కలిగిస్తోంది. అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో రాజకీయ సిఫార్సులకు పేదపీట వేశారనే ఆరోపణలున్నాయి.
గుట్టుచప్పుడు కాకుండా : జిల్లాలో ఎక్సైజ్‌శాఖ పరిధిలోని 198 ప్రభుత్వ మద్యం దుకాణాల్లో 198 సూపర్‌వైజర్‌, 495 సేల్స్‌మెన్‌ పోస్టుల భర్తీకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీచేయడంతో నిరుద్యోగుల్లో ఆశలు చిగురించాయి. అయితే ఈ ప్రక్రియలో ఆశాఖ అధికారులు, కమిటీ సభ్యులు అనుసరించిన విధానం అభ్యర్థులను ఆందోళనకు గురిచేసింది. గతంలో ఎన్నడూ లేనివిధంగా అభ్యర్థుల మెరిట్‌ లిస్టు ప్రదర్శించకుండా అభ్యర్థులను ఎంపిక చేయడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు అభ్యర్థులైతే ఆయా కేంద్రాల వద్ద ఆందోళన కూడా చేశారు. అయినా అధికారులు స్పందించకపోవడంతో నిరాశతో వెనుదిరిగారు. చివరికి మెరిట్‌లిస్టు ప్రకటించకుండానే నియామక పత్రాలు తీసుకోవాల్సిందిగా అభ్యర్థుల సెల్‌ఫోన్లకు రహస్యంగా సమాచారం అందించడం పలు అనుమానాలకు తావిస్తోంది.
గంటల్లోనే హాజరుకు ఆహ్వానమేమిటో? : ప్రభుత్వ మద్యం దుకాణాల్లో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ఆది నుంచి గందరగోళంగానే సాగుతోంది. తమకు అన్యాయం జరిగిందని పలువురు అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కమిటీ సభ్యులు కూడా మెరిట్‌ లిస్టు ప్రకటించకుండా ఎంపిక ప్రక్రియ చేపట్టడం వారి అనుమానాలకు మరింత ఊతమిస్తోంది. ఇంటర్వ్యూలకు 1:7 ప్రకారం అభ్యర్థులను పిలిచారు. అయితే ఇంటర్వ్యూల తరువాత అర్హుల జాబితా ప్రకటించకుండా మంగళవారం రాత్రి ఉన్నట్టుండి కొందరు అభ్యర్థుల సెల్‌ఫోన్లకు రహస్యంగా సమాచారం అందించారు. దీంతో బుధవారం ఉదయం 10 గంటలకల్లా అభ్యర్థులు నగర శివారులోని ఏపీ బేవరేజెస్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌(లిక్కర్‌ గోడౌన్‌) మేనేజర్‌ను కలిసి నియామక పత్రాలందుకున్నారు. ఇలా గంటల వ్యవధిలోనే అభ్యర్థులను రహస్యంగా ఆహ్వానించడం, వారు వచ్చి నియామక పత్రాలందుకోవడం మరింత చర్చకు దారితీస్తోంది.
మెరిట్‌ లిస్టు ఏదీ? : ప్రభుత్వ మద్యం దుకాణాల్లో పోస్టుల భర్తీకి సంబంధించి మెరిట్‌ లిస్టు ప్రదర్శించకుండానే ఎంపిక ప్రక్రియ పూర్తి చేయడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సమయం తక్కువగా ఉందనే సాకుతో ఆశాఖ అధికారులు, కమిటీ సభ్యులు నిబంధనలకు పాతరేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మెరిట్‌ లిస్టు ప్రకటించకపోవడం, రహస్యంగా అభ్యర్థుల సెల్‌ఫోన్లకు మేసేజి రూపంలో సమాచారం చేరవేయడం, పోస్టుల భర్తీపై ఆశించిన స్థాయిలో ప్రచారం చేయకపోవడం, సమయం లేదనే పేరుతో నిబంధనలకు పాతరేయడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి.
రాజకీయ సిఫార్సులకే పెద్దపీట : జిల్లాలోని ప్రభుత్వ మద్యం దుకాణాల్లో పోస్టుల భర్తీకి సంబంధించి రాజకీయ సిఫార్సులకే పెద్దపీట వేసినట్లు తెలుస్తోంది. ఈ కారణంగానే ఎంపిక కమిటీ నిబంధనలు తుంగలో తొక్కిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. తాము సూచించిన అభ్యర్థులకే ఉద్యోగావకాశాలు కల్పించాలని ఆ శాఖ అధికారులతో పాటు కమిటీ సభ్యులకు రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు సిఫార్సు లేఖలు పంపారనే విమర్శలు వినిపిస్తున్నాయి. దీంతో కమిటీ సభ్యులు ఏమీ చేయలేక నిబంధనలు తుంగలో తొక్కినట్లు సమాచారం. ప్రజాప్రతినిధులు సూచించిన అభ్యర్థులు రిజర్వేషన్‌ ప్రకారం లేనందునే కొన్ని పోస్టులు భర్తీ చేయకుండా వదిలేశారనే విమర్శలు ఆ శాఖ వర్గాల నుంచి వ్యక్తమవుతూండడం గమనార్హం. మొత్తమ్మీద నిరుద్యోగ అభ్యర్థులతో పాటు అందరిలోనూ ఈ పోస్టుల భర్తీ ప్రక్రియ ఆందోళన కలిగిస్తోంది.
 
అధికారుల తీరుపై విమర్శలు..
ప్రభుత్వ మద్యం దుకాణాల్లోని ఉద్యోగాల భర్తీలో ఆ శాఖ అధికారులు, కమిటీ సభ్యులు వ్యవహరించిన తీరు దుమారం రేపుతోంది. ఎలాంటి స్పష్టమైన సమాచారం ప్రకటించకుండా ఉద్యోగాలు భర్తీ చేయడం అభ్యర్థులను కలవరపెడుతోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా నడుచుకోవడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. ఇదే విషయమై కొందరు అభ్యర్థులు ప్రశ్నించగా వారిపై చిందులు వేయడం వారి అనుమానాలకు మరింత బలం చేకూరుస్తోంది.  ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల సంఖ్య గానీ, ధృవపత్రాల పరిశీలనకు సంబంధించిన వివరాలు కానీ, ఇంటర్వ్యూలకు సంబంధించి 1:7 జాబితా వివరాలు కానీ.. ఇంటర్వ్యూ తరువాత ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల జాబితా గానీ ప్రకటించకుండా గుట్టుచప్పుడు కాకుండా అభ్యర్థులకు నియామక పత్రాలందజేయడం ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. ప్రజాప్రతినిధులు, రాజకీయనాయకుల సిఫార్సు లేఖలు, ఆ శాఖ అధికారులు, కమిటీ సభ్యుల్లో కొందరి చేతివాటం (రూ.లక్షల్లో తీసుకున్నట్టు వినికిడి) ఇందుకు కారణాలై ఉంటాయని భావిస్తున్నారు. ఇంత జరుగు తున్నా జిల్లా కలెక్టరు కానీ, ఆ శాఖ ఉన్నతాధికారులు కానీ దృష్టి సారించకపోవడం గమనార్హం.