ఈరోజు ఉండే స్నేహం రేపు ఉండకపోవచ్చు

ఈరోజు ఉండే స్నేహం రేపు ఉండకపోవచ్చు
విశాఖ: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎవ్వరితోను నిలకడగా ఉండరని, అలాంటి వ్యక్తితో ఏపీ సీఎం జగన్ స్నేహం చేస్తున్నారని టీడీపీ ఎమ్మెల్సీ రామారావు అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ కపట ప్రేమ గుర్తించాలన్నారు. గోదావరి మిగులు జలాలను తెలంగాణకు ఇచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందని, రోజుకు 4 టీఎంసీల చొప్పున 120 రోజుల పాటు తరలించేందుకు ప్లాన్ చేస్తున్నారని అన్నారు. గోదావరి నీళ్ళపై సర్వ హక్కులు ఏపీ ప్రభుత్వానికే ఉన్నాయని.. అలాంటప్పుడు మిగులు జలాలు ఎలా తరలిస్తారని రామారావు ప్రశ్నించారు.
ఈరోజు ఉండే స్నేహం రేపు ఉండకపోవచ్చు.. భవిష్యత్తులో రెండు రాష్ట్రాల మధ్య వివాదాలకు, అవకాశం ఉందని రామారావు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇలాంటి ప్లాన్ కార్యరూపం దాల్చితే ఏపీ నష్టపోతుందని, భవిష్యత్తు తరాలను దృష్టి పెట్టుకొని జగన్ నిర్ణయాలు తీసుకోవాలని ఆయన సూచించారు. ఏపీకి రావల్సినవి తీసుకోకుండా వారికి కావల్సినవి ఇవ్వడం వల్ల రాష్ట్రం నష్టపోతుందన్నారు. రాయలసీమకు నీళ్ళు అవసరమని.. దానిపై ప్రత్యామ్నాయ మార్గాలు ఏర్పాటు చేయాలన్నారు. పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గిస్తే.. కట్టిన ప్రయెజనం ఉండదని రామరావు అభిప్రాయం వ్యక్తం చేశారు.