అంబేద్కర్ విదేశీ విద్యానిధి పథకానికి 22 మంది ఎంపిక

విజయవాడ
అంబేద్కర్ విదేశీ విద్యానిధి పథకానికి 22 మంది ఎంపిక
షెడ్యూల్డ్ కులాలు/ షెడ్యూల్డ్ తెగలు చెందిన విద్యార్థులకు విదేశీ విద్యను అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం అమలు చేస్తోన్న అంబేద్కర్ విదేశీ విద్యా నిధి పథకం కింద లబ్ధిపొందేందుకు 22 మంది గిరిజన విద్యార్థులను ఎంపిక చేసినట్లు గిరిజన సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీ.R.P సిసోడియా, IAS తెలిపారు. సోమవారం విజయవాడలోని గిరిజన సంక్షేమ శాఖ కార్యాలయంలో జరిగిన రాష్ట్ర స్థాయి సెలక్షన్ కమిటీ సమావేశానికి చైర్మన్, గిరిజన సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీ.R.P సిసోడియా, IAS, కమిటీ కన్వీనర్, గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టర్ శ్రీ.P. రంజిత్ బాషా, IAS, ఇతర సభ్యులు హాజరయ్యారు. ఈ పథకం కింద లబ్ధిపొందేందుకు మొత్తం 26 మంది దరఖాస్తు చేసుకోగా వీరిలో 22 మందిని అర్హులుగా ఎంపిక చేయడం జరిగింది. ఎంపికైన విద్యార్థుల్లో 12 మంది ఫిలిప్పీన్స్, ఇద్దరు చైనా దేశాల్లో వైద్యవిద్యను అభ్యసించేందుకు వెళ్తుండగా, ఆరుగురు యూ.కే, ఇద్దరు జర్మనీ దేశాల్లో పీజీ కోసం వెళ్తున్నట్లు గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టర్ శ్రీ.P.రంజిత్ బాషా, IAS పేర్కొన్నారు. వీరికి రెండు దశల్లో రూ.15 లక్షల ఆర్థిక సాయం అందచేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఇందులో తొలుత 50శాతం, మిగిలిన మొత్తం సగం కోర్సు పూర్తి అయిన విడుదల చేయడం జరుగుతుందన్నారు. అలాగే విద్యార్థులకు వీసా ఫీజు రీయింబర్స్ మెంట్ చేయడంతో పాటు ఒక వైపు ప్రయాణానికి అయ్యే ఖర్చును కూడా ప్రభుత్వమే భరిస్తుందని తెలిపారు. విద్యార్థుల ఎంపిక పూర్తిగా పారదర్శకంగా జరిగినట్లు శ్రీ. రంజిత్ భాషా స్పష్టం చేశారు.