ప్రభుత్వాలకు, మీడియాకు వారధిగా పి.ఐ.బి పనిచేస్తోంది - కలెక్టర్ శ్రీ శామ్యూల్ ఆనంద్ కుమార్
దేశాభివృద్ధిలో గ్రామీణ విలేకరుల పాత్ర కీలకం - పి.ఐ.బి. అదనపు డీజీ శ్రీ డి. మురళిమోహన్
గుంటూరు, సెప్టెంబరు 19, (అంతిమ తీర్పు) :
ప్రభుత్వాలకు, మీడియాకు వారధిలా పత్రికా సమాచార కార్యాలయం పనిచేస్తోందని గుంటూరు జిల్లా కలెక్టర్ శ్రీ శామ్యూల్ ఆనంద్ కుమార్ అన్నారు. ఈరోజు నగరంలో కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన పత్రికా సమాచార కార్యాలయం, విజయవాడ ఆధ్వర్యంలో పాత్రికేయులకు ఒకరోజు శిక్షణ కార్యక్రమం వార్తాలాప్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా కలెక్టర్ శ్రీ శామ్యూల్ ఆనంద్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితులలో సమాచార వ్యవస్థ వేగంగా ముందుకు సాగుతోదని, అందుకు అనుగుణంగా ఆధునిక పరిజ్ఞానాన్ని వినియోగించి ప్రభుత్వానికి, మీడియాకు మధ్య వారధిగా పత్రికా సమాచార కార్యాలయం పనిచేస్తోందన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలకు విస్తృత ప్రచారాన్ని కల్పించే బాధ్యతను ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో విజయవంతగా నిర్వహిస్తోందని ప్రశంసించారు. ప్రభుత్వ పధకాలను ప్రజలు సమగ్రంగా వినియోగించుకునే విధంగా, పత్రికలు తమ కధనాలు ద్వారా తెలియపరుస్తాయని ఆయన అన్నారు. ప్రజాస్వామ్యంలో అన్ని వ్యవస్థలు సామాన్యుడి కోసం పని చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన అభిప్రాయ పడ్డారు.
పి.ఐ.బి. ఆంధ్ర ప్రదేశ్ రీజియన్ అడిషనల్ డైరక్టర్ జనరల్ శ్రీ. డి. మురళి మోహన్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం వివిధ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందని, వీటిని క్షేత్రస్థాయిలో ప్రజలకు చేరవేసేందుకు పి.ఐ.బి. కృషి చేస్తుందన్నారు. ప్రభుత్వ పథకాలకు సంబంధించిన సమాచారాన్ని ప్రాంతీయ మీడియాకు చేరవేయడంతో పాటు, స్థానిక స్థితిగతులపై ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు పి.ఐ.బి నివేదిక అందిస్తుందని తెలిపారు. ఏదైనా అంశంపై ప్రజల్లో సంశయం ఏర్పడినప్పుడు వాటిని నివృత్తి చేసేలా పి.ఐ.బి కచ్ఛితమైన సమాచారం అందిస్తుందన్నారు. వివిధ సాంస్కృతిక, కళా రంగాల ద్వారా, పత్రికా మాధ్యమాల ద్వారా, ప్రకటనల ద్వారా ప్రభుత్వ పధకాల గురించి పిఐబి విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తుందన్నారు.
ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిధిగా హాజరైన సీనియర్ పాత్రికేయులు పద్మశ్రీ యడ్లపల్లి వెంకటేశ్వర్రావు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసే పధకాలకు విస్తృతంగా ప్రచారం కల్పించే పి.ఐ.బి. విలేకరులకు శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించడం అభినందనీయమని అన్నారు.
ది హిందూ పత్రిక గుంటూరు బ్యూరో చీఫ్ శ్రీ శామ్యూల్ జొనాథన్ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన ఖచ్చితమైన సమాచారాన్ని పి.ఐ.బి. అందిస్తుందన్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ప్రత్యేక సమావేశాలు నిర్వహించి, ప్రభుత్వ పథకాలపై ప్రజల్లో ఉన్న అపోహలు, అనుమానాలను నివృత్తి చేసేందుకు పిఐబి కృషిచేస్తుందని ఆయన తెలిపారు.
ఈ కార్యక్రమంలో పి.ఐ.బి. అధికారులు, రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన వివిధ విభాగాల అధికారులు, గుంటూరు జిల్లాకు చెందిన వివిధ గ్రామీణ, ప్రాంతీయ స్థాయి పత్రికా ప్రతినిధులు, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు హాజరయ్యారు.