30–09–2019
న్యూఢిల్లీ
*బొగ్గు కొరతను తీర్చడానికి యుద్ధప్రాతిపదికన చర్యలు*
*రేపు కోల్‌కతాలో బొగ్గు, రైల్వే, ఏపీ జెన్కో, విద్యుత్ శాఖ అధికారుల కీలక సమావేశం*
*గురువారం ఢిల్లీలో కీలక మంత్రిత్వ శాఖల భేటీ*
*విద్యుత్ కొరత తీర్చడానికి జెన్కో ముమ్మర ప్రయత్నాలు*
న్యూఢిల్లీ: థర్మల్ విద్యుత్ కేంద్రాలలో బొగ్గు కొరత తీర్చడానికి రాష్ట్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టింది. ముఖ్యమంత్రి శ్రీ వైయస్.జగన్మోహన్రెడ్డి ఇది వరకే కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖకు లేఖ రాయగా, సీఎం ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ ఇవాళ న్యూఢిల్లీలో పర్యటించారు. కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ కార్యదర్శి అనిల్‌కుమార్ జైన్‌ను కలుసుకున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితిని అధిగమించడానికి తీసుకోవాల్సిన చర్యలు, కేంద్రం నుంచి కావాల్సిన సహకారం తదితర అంశాలపై మాట్లాడారు. ముఖ్యమంత్రి రాసిన లేఖతో రేపు (అక్టోబరు 1, మంగళవారం) కోల్‌కతాలో కోల్ ఇండియా, ఏపీ జెన్కో, రైల్వేశాఖ అధికారులు ప్రత్యేకంగా సమావేశమవుతున్నారు. గురువారం నాడు కేంద్ర ప్రభుత్వంలోని బొగ్గు, రైల్వే, విద్యుత్ శాఖలు ఏపీ జెన్కో, కోల్ ఇండియా అధికారులతో సమావేశమవుతున్నారు. తమిళనాడు తరహాలో సెంట్రల్ కోల్ ఫీల్డ్స్ నుంచి బొగ్గు నేరుగా రాష్ట్రం కొనుగోలు చేసే అంశాన్ని కూడా ఏజీ జెన్కో చురుకుగా పరిశీలిస్తోంది. ఒడిశా జెన్కో వద్దనున్న మిగులు బొగ్గు నిల్వలను కూడా కొనుగోలు చేయడానికి ఏపీ జెన్కో ప్రయత్నిస్తోంది. లేదా ఆ నిల్వలను ఒడిశా లోని జిందాల్ లాంటి ప్రైవేటు విద్యుత్ ఉత్పత్తి కంపెనీలకు ఇవ్వడం ద్వారా 25 శాతం విద్యుత్‌ను ఓపెన్ మార్కెట్ ద్వారా కొనుగోలు చేసే అంశాన్ని కూడా ఏపీ జెన్కో పరిశీలిస్తోంది. ఇప్పటికే సింగరేణి నుంచి.. వచ్చే 7 రోజులపాటు 8 ర్యాకుల వరకూ బొగ్గు అదనంగా తీసుకురావడానికి అన్ని ఏర్పాట్లూ పూర్తయ్యాయి. ఇది జెన్కోకు ఊరటనిచ్చే అంశం.