శ్రీసిటీలో ఆంధ్ర-తమిళనాడు సరిహద్దు పోలీసు అధికారుల సమావేశం
శ్రీసిటీ, సెప్టెంబర్ 26, (అంతిమ తీర్పు) ఆంధ్ర-తమిళనాడు సరిహద్దు జిల్లాల పోలీసు అధికారుల సమావేశం గురువారం శ్రీసిటీలో జరిగింది. చిత్తూరు, నెల్లూరు, తిరువళ్లూరు (తమిళనాడు) జిల్లాలకు చెందిన పలువురు పోలీస్ అధికారులు ఇందులో పాల్గొనగా, శ్రీసిటీ డైరెక్టర్ ముకుందరెడ్డి వీరికి సాదర స్వాగతం పలికారు. శ్రీసిటీ డీఎస్పీ విమలకుమారి సమావేశానికి అధ్యక్షత వహించగా, గుమ్మిడిపూండి డీఎస్పీ కల్పనాదత్, గూడూరు డీఎస్పీ భవానీ శ్రీహర్ష తదితరులు పాల్గొని శ్రీసిటీ పరిసర ప్రాంతాలలో శాంతి భద్రతలపై ప్రధానంగా చర్చించారు.
ఈ సందర్భంగా విమలకుమారి మాట్లాడుతూ, శ్రీసిటీని ఆనుకుని పైమూడు జిల్లాలకు చెందిన కొన్ని ప్రాంతాలు ఉన్నాయన్నారు. చిత్తూరు ఎస్పీ ఆదేశాల మేరకు శ్రీసిటీ పరిధిలోని సరిహద్దు జిల్లాల పోలీస్ స్టేషన్ల పోలీసు సిబ్బంది మధ్య సహకారం, సమన్వయం పెంపొందించేందుకు ఈ సమావేశం ఏర్పాటు చేశామన్నారు. శ్రీసిటీ పరిధిలో శాంతిభద్రతల అంశాలు, ఇతర భద్రతా సమస్యలను ఆమె ఈ సందర్భంగా వివరించారు. ఈ ప్రాంతంలో శాంతిభద్రతల పరిరక్షణకు అందరు ఈ చర్చలో చురుకుగా పాల్గొని తగు సూచనలు ఇవ్వాలని ఆమె అధికారులను కోరారు.
శ్రీసిటీ మేనేజింగ్ డైరెక్టర్ రవీంద్ర సన్నారెడ్డి మాట్లాడుతూ, అంతర్రాష్ట్ర పోలీసు అధికారుల సమావేశం ఏర్పాటు యోచనను అభినందిస్తూ, దీనికి శ్రీసిటీ ఆతిధ్యం ఇచ్చే అవకాశాన్ని కల్పించినందుకు చిత్తూరు ఎస్పీకి కృతజ్ఞతలు తెలిపారు. సురక్షితమైన వాతావరణం ఉన్నప్పుడు మాత్రమే పారిశ్రామిక అభివృద్ధి సాధ్యమని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. ప్రత్యేకించి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వచ్చే పారిశ్రామికవాడల్లో ఇది చాలా కీలకమన్నారు. పోలీసుల సహకారం, సమన్వయంపై స్పందించిన ఆయన, అందరూ సమిష్టిగా శాంతి భద్రతల విషయంలో శ్రీసిటీని మోడల్ సిటీగా మార్చే లక్ష్యంగా పనిచేద్దామని పిలుపునిచ్చారు. సమావేశానికి అధ్యక్షత వహించి, పోలీసు అధికారుల మధ్య సమన్వయం కోసం మంచి చర్చను చేపట్టిన శ్రీసిటీ డీఎస్పీ విమలకుమారికి ఆయన అభినందనలు తెలిపారు.
కేంద్ర ఇంటలిజెన్స్ బ్యూరో డివిజనల్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ అనీష్ మాట్లాడుతూ, దేశంలో భద్రతాపరమైన సమస్యల గురించి వివరిస్తూ, విదేశీ వృత్తి నిపుణులకు సంబంధించిన భద్రతా అంశాలపై దృష్టి సారించాలని కోరారు. గుమ్మిడిపూండి డీఎస్పీ కల్పనాదత్, గూడూరు డీఎస్పీ భవానీ శ్రీహర్ష తదితరులు శాంతి భద్రతల చర్చలో పాల్గొని తమ అభిప్రాయాలను తెలియచేశారు.
సత్యవేడు, సూళూరుపేట, ఆరంబాక్కం, చిత్తూరు స్పెషల్ బ్రాంచ్ సీఐ లతో పాటు సంబంధిత సర్కిల్ పోలీస్ స్టేషన్ల ఎస్సైలు, ఇతర సిబ్బంది ఇందులో పాల్గొన్నారు.