ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కమిటీ వేస్తాం


తేది : 27.09.2019
అమరావతి


• బోటు ప్రమాదం దురదృష్టకరమైన సంఘటన


• ప్రమాద ఘటనపై విచారణ కమిటీ వేశాం


• ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కమిటీ వేస్తాం


• బాధిత కుటుంబాలకు పూర్తిగా అండగా ఉంటాం


• ప్రాణాలను సైతం లెక్కచేయకుండా 26 మంది ప్రాణాలను రక్షించిన కచ్చలూరు గ్రామానికి చెందిన వ్యక్తులకు రూ. 25 వేల నగదు ప్రోత్సాహం అందిస్తాం: వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు


అమరావతి, సెప్టెంబర్ 27: భవిష్యత్ లో గోదావరి బోటు ప్రమాదం లాంటి ఘటనలు పునరావృతం కాకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని, ఇందుకోసం ప్రత్యేకంగా కమిటీ వేయాలని ముఖ్యమంత్రి సూచించినట్లు వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు. శుక్రవారం వెలగపూడి సచివాలయంలోని ప్రచార విభాగంలో గోదావరి బోటు ఘటనపై మంత్రి కురసాల కన్నబాబు మీడియాతో మాట్లాడారు. గోదావరి బోటు ప్రమాదం దురదృష్టకరమైన సంఘటన అని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. వరదలు వస్తున్న సమయంలో బోటు కచ్చలూరుమందం వద్ద సుడిగుండంలో పడి చిక్కుకుపోవడం వల్ల ఈ ఘటన జరిగిందని మంత్రి అన్నారు. ప్రమాదంలో మునిగిపోయిన బోటును వెలికితీసే ప్రక్రియ కష్టతరమైనప్పటికీ వెలికితీసేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నామని మంత్రి కన్నబాబు అన్నారు. బోటు ప్రమాదం జరిగిన సమయంలో 77 మంది ఉన్నారని తెలిపారు. 26 మంది సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డారని, ఇంకా 14మంది ఆచూకీ తెలియాల్సి ఉందన్నారు. అందులో తెలంగాణకు చెందిన వారు ఆరుగురు, ఆంధ్రప్రదేశ్ కు చెందిన వారు 8 మంది ఉన్నట్లు మంత్రి తెలిపారు.


బోటు ప్రమాదంపై విచారణ కమిటీ వేశామని, ప్రమాదానికి సంబంధించిన విచారణ జరుగుతోందని మంత్రి కన్నబాబు అన్నారు. విచారణ కమిటీలో ఇరిగేషన్, పోర్టు శాఖాధికారులు, టూరిజం శాఖాధికారులు, స్థానిక కలెక్టర్ ఉన్నారని తెలిపారు. మరో రెండు మూడు వారాల్లో బోటు ప్రమాద ఘటనకు సంబంధించిన నివేదిక వస్తుందని తెలిపారు. భవిష్యత్ లో ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా ప్రత్యేక కమిటీ వేస్తామని మంత్రి చెప్పారు.


వరద ఉధృతి సమయంలో తూర్పుగోదావరి జిల్లా కచ్చలూరు గ్రామ సమీపంలో ఘటన జరిగిన వెంటనే స్పందించి ప్రాణాలను లెక్కచేయకుండా నదిలోకి వెళ్లి 26 మంది ప్రయాణీకుల ప్రాణాలు కాపాడిన కచ్చలూరు గ్రామస్థులను ఇప్పటికే సీఎం అభినందించారని మంత్రి గుర్తు చేశారు.  ఈ సందర్భంగా బోటు ప్రమాద ఘటనలో ప్రాణాలను సైతం లెక్కచేయకుండా 26 మంది ప్రయాణీకులను కాపాడిన కచ్చలూరు గ్రామానికి చెందిన వ్యక్తులకు 25 వేల రూపాయల నగదు ప్రోత్సాహం ఇవ్వనున్నట్లు వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు. ప్రయాణీకులను కాపాడిన కచ్చలూరు గ్రామస్థుల వివరాలు అధికారుల వద్ద ఉన్నాయని తెలిపారు. త్వరలోనే వారికి నగదు ప్రోత్సాహం అందించాలని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డికి ఆదేశాలు జారీ చేశామన్నారు. అదే విధంగా ముఖ్యమంత్రి కార్యదర్శి ఎప్పటికప్పుడు ఇందుకు సంబంధించిన అప్ డేట్స్ ను పర్యవేక్షిస్తున్నారని మంత్రి తెలిపారు. కచ్చలూరు గ్రామస్థులు ఇంతటి సాహసానికి ఒడిగట్టకపోయి ఉంటే మరణించేవారి సంఖ్య పెరిగేదని  మంత్రి అభిప్రాయపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే సంఘటన స్థలానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చి పరిశీలించి, బాధితులను ఓదార్చి వారికి ధైర్యం చెప్పి నష్టపరిహారం ప్రకటించారన్నారు. ఎస్డీఆర్‌ఎఫ్‌, ఎన్టీఆర్‌ఎఫ్‌ గాలింపు చర్యలు నేటికీ కొనసాగుతున్నాయని, ఆచూకీ లభ్యంకాని వారిని త్వరలోనే గుర్తిస్తామన్నారు. ఇంకా ఆచూకీ తెలియనివారి కుటుంబసభ్యులు డెత్‌ సర్టిఫికెట్‌ కోరుతున్నారని, పరిశీలించి  తగు చర్యలు తీసుకొని సంబంధిత జీవో తెచ్చే ప్రయత్నం చేస్తామన్నారు. 


బోటును తీసే సామర్థ్యం ఉందని కొందరు ముందుకు వచ్చినప్పటికీ, వరద ప్రవాహం కొనసాగుతున్నందువల్ల కొత్త సమస్యలు వస్తాయని అవకాశమిచ్చేందుకు ఆలోచిస్తున్నామని మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు. ఇప్పటికే బోటును వెలికితీసే బృందాలను సంఘటన స్థలానికి తీసుకువచ్చామని మంత్రి అన్నారు. నేవీ అధికారులతో పాటు, ఎక్స్ పర్ట్స్ వచ్చి ఘటనాస్థలిని పరిశీలించి తమ వంతు ప్రయత్నాలు చేశారన్నారు. అదే విధంగా ఛత్తీస్ ఘడ్ నుంచి ఒక బృందం, బలిమెల రిజర్వాయర్ ఘటనలో పాల్గొన్న బృందాన్ని, సముద్రంలో బోట్లు తిరగబడిన ఘటనలో వెలికితీసిన కాకినాడకు చెందిన ఒక బృందాన్ని, సంప్రదాయ పద్ధతిలో బోటును వెలికితీసే మత్స్యకారుల బృందాన్ని తీసుకువచ్చామన్నారు. బోటును వెలికితీసేందుకు తమ వంతు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నామన్నారు. ఎవరైనా బోటు తీస్తామని  ముందుకు వస్తే జిల్లా ఉన్నతాధికారులతో మాట్లాడాలని మంత్రి సూచించారు.  అలా వచ్చే వ్యక్తుల లేదా బృందాల సామర్థ్యం, గతంలో పాల్గొన్న ఘటనలు, వారి రికార్డు, వారు బోటును ఎలా తీయగలరో వివరించే ప్రణాళికను ఆధారంగా చేసుకొని వారికి బోటును వెలికితీసే సామర్థ్యం ఉందా లేదా అని పరిశీలించి అవకాశం ఇస్తామన్నారు.  250 నుండి 300 అడుగుల లోతులో బోటు ఉన్నట్లు అంచనా వేస్తున్నామన్నారు. ఇంత లోతులో బోటు ఇరుక్కుపోవడం దేశంలోనే తొలిసారని భావిస్తున్నామన్నారు.


బోటు ప్రమాద ఘటన అనంతరం బాధితులను చూడ్డానికి వచ్చిన కుటుంబసభ్యులకు, బంధువులకు అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగిందని మంత్రి అన్నారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం పూర్తిగా అండగా ఉంటుందని ముఖ్యమంత్రి చెప్పారని మంత్రి అన్నారు. బోటు ఘటనకు ముందు దేవీపట్నం పోలీసులు బోటును క్షుణ్ణంగా తనిఖీ చేసి లైఫ్ జాకెట్లు వేసుకున్న ప్రయాణీకుల ఫోటోలు తీసిన తర్వాతే బోటును పంపించారన్నారు. పరిమితికి లోబడే ప్రయాణీకులు బోటులో ఉన్నారని స్పష్టం చేశారు. దురదృష్టవశాత్తు బోటు సుడిగుండంలో చిక్కుకుపోవడం వల్లే బోటు మునిగిపోయిందని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. బోటులో ప్రయాణించిన వారి వివరాలు, మృతిచెందిన వారి వివరాలు, సురక్షితంగా ఒడ్డుకు చేరిన వారి వివరాలు, ఆచూకీ తెలియని వారి వివరాలను ట్రావెల్ ఏజెన్సీ ద్వారా, బోటు నిర్వహకుల ద్వారా తీసుకున్నామని, కొందరు తమ వారు తప్పిపోయారని తెలియజేయడం వల్ల సమాచారం లభ్యమయ్యిందని మంత్రి అన్నారు. 


ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బోటు ప్రమాద సంఘటన స్థలాన్ని పరిశీలించి,బాధితులను పరామర్శించిన అనంతరం రాజమహేంద్రవరంలో గంటన్నరపాటు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇలాంటి తరహా ఘటనలు జరగకుండా తీసుకోవాల్సిన చర్యలపై మ్యానువల్ రూపొందించాలని సీఎం సూచించారని మంత్రి తెలియజేశారు. భవిష్యత్ లో కమాండ్ కంట్రోల్ రూమ్స్ తో పాటు, బోటులో సీసీ కెమెరాలు, జీపీఎస్ సిస్టమ్, నేవిగేషన్ వంటివి ఉండేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి సూచించినట్లు మంత్రి తెలిపారు.


కొందరు బోటు ఘటనను రాజకీయం చేయాలని చూస్తున్నారని మంత్రి ఆరోపించారు. తమ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో ఈ తరహా ఘటనలు పునరావృతం కాకుండా చేసేందుకు అస్పష్టమైన జీవో జారీ చేశారని గుర్తుచేశారు. సంబంధిత జీవోలో ఎవరేం చేయాలో చెప్పారు కానీ ఎవరు అమలు చేయాలో చెప్పలేదని, అదొక అస్పష్టమైన జీవో అని మంత్రి విమర్శించారు. తమ ప్రభుత్వం ఆ తరహా జీవోలు కాకుండా స్పష్టమైన జీవోను తయారు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించినట్లు మంత్రి తెలిపారు. ఇలాంటి తరహా ఘటనలు పునరావృతం కాకుండా తమ ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుందని, ఇప్పటికే ఆ దిశగా ముఖ్యమంత్రి దిశానిర్ధేశం చేశారని మంత్రి కురసాల కన్నబాబు వెల్లడించారు.


సమావేశంలో తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం ఎమ్మెల్యే ధనలక్ష్మీ, రంపచోడవరం పార్టీ ఇన్ ఛార్జి అనంతబాబు పాల్గొన్నారు.


 


.......


Popular posts
*కలిగిరి కార్యదర్శి వి.మధు కు ఉత్తమ అవార్డు* ఉదయగిరి, ఆగష్టు 23 (అంతిమ తీర్పు- ఇంచార్జ్ దయాకర్ రెడ్డి): ఉదయగిరి నియోజకవర్గంలోని కలిగిరి పంచాయితీ కార్యదర్శి వెలుగోటి. మధు ఉత్తమ కార్యదర్శిగా ఎంపికయ్యారు. ఆగష్టు 15 స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రకటించిన ఉత్తమ అధికారుల జాబితాలో మధు ముందు వరుసలో నిలిచారు. గత 4 సంవత్సరాల నుండి ఆయన అవార్డులకు ఎంపిక కాబడుతుండటం గమనించదగిన విషయం. పంచాయితీ సెక్రటరీగా కలిగిరిలో గ్రామ పంచాయితీ అభివృద్ధికి బంగారు బాటలు వేశారు. ఎంతోకాలంగా ఆక్రమణల చెరలో ఉన్న పంచాయితీ స్థలాలకు కబ్జా కోరల నుండి విముక్తి కల్పించి ప్రభుత్వానికి ఆదాయ వనరులను చూపించారు. కరోనా కాలంలో ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయడంతో పాటు పారిశుద్ధ్య కార్యక్రమాలను వేగవంతం చేశారు. ప్రతినెలా 1 వ తేదీన జరిగే ఫించన్ల పంపిణీ విషయంలో వెలుగోటి.మధు చేస్తున్న కృషి పలువురి ప్రశంసలు అందుకుంటున్నది. ఉదయం 7 గంటల కల్లా ఫించన్ల పంపిణీ లక్ష్యాలను అధిగమించి అందరి చేత బేష్ అనిపించుకుంటారు. వృత్తి పట్ల అంకితభావం కలిగిన మధును ఈ యేడాది కూడా ఉత్తమ కార్యదర్శి అవార్డు వరించడం అభినందనీయమని పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Image
*ఉపాధి పనుల్లో కొండంత అవినీతిని గోరంతగా ప్రజావేదికలో తేల్చిన అధికారులు* ఉదయగిరి, అక్టోబర్ 20 (అంతిమ తీర్పు - ఇంచార్జ్ దయాకర్ రెడ్డి): గ్రామీణ ప్రాంతాల్లో వలసల నివారణకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గ్రామీణ ఉపాధి హామీ పథకం అధికారులకు కాసుల వర్షం కురిపించే కల్పతరువుగా రంగా మారింది. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వరికుంటపాడు మండలం లో 2017,2018,2019 సంవత్సరం నుంచి ఇప్పటివరకు జరిగిన 24.88 కోట్ల రూపాయలు పనులలో 7.69 లక్షలు రూపాయలు అవినీతి జరిగినట్లు సామాజిక తనిఖీ లో అధికారులు నిగ్గు తేల్చారు. దాదాపు 5 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని ప్రజలు గుసగుసలు వినిపిస్తున్నాయి.అంతే కాకుండా గ్రామాలలో లేని వారి పేర్లు ఫీల్డ్ అసిస్టెంట్ లు మస్టర్లలో వేసుకొని పెద్ద ఎత్తున ఉపాధి అధికారులు మండల స్థాయి అధికారులు అవినీతికి పాల్పడినట్లు తెలుస్తున్న అధికార పార్టీ నాయకులను లోబర్చుకుని పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడిన సామాజిక తనిఖీ ఆడిట్లో అవినీతి బయట పడకుండా పెద్ద ఎత్తున నగదు చేతులు మారినట్లు ప్రజలు అనుకుంటున్నారు. ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసిన సంబంధిత మండల ఉపాధి అధికారులు మండల స్థాయిఅధికారులపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని వరికుంటపాడు ప్రాంత ప్రజలు కోరుతున్నారు.
Image
శ్రీ‌వాణి ట్ర‌స్టు దాత‌ల కోసం ఆన్‌లైన్ అప్లికేష‌న్ ప్రారంభం
అంబెడ్కర్ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన ysrcp నేత దేవినేని ఆవినాష్
Image
ఆంధ్ర ప్రదేశ్‌ రెవెన్యూశాఖ ఆధ్వర్యంలో ఇకపై ఆటో మ్యుటేషన్‌ సేవలు అమలు.