తిరుమల, 2019 సెప్టెంబర్ 30
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు
వేద విద్య వ్యాప్తికి పెద్దపీట :
టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ వై.వి.సుబ్బారెడ్డి
మన పూర్వీకుల వారసత్వ సంపద అయిన వేదాలను పరిరక్షించి, వేద విద్య వ్యాప్తికి పెద్దపీట వేస్తున్నామని టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ వైవి.సుబ్బారెడ్డి తెలిపారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమలలోని ఆస్థానమండపంలో సోమవారం ఏర్పాటుచేసిన శ్రీ శ్రీనివాస వేద విద్వత్ సదస్సు ప్రారంభోత్సవానికి ఛైర్మన్ ముఖ్య అతిథిగా విచ్చేశారు.
ఈ సందర్భంగా ఛైర్మన్ మాట్లాడుతూ వేదాల్లోని విజ్ఞానాన్ని సామాన్య ప్రజలకు అందేలా పండితులు కృషి చేయాలని కోరారు. వేద విద్య నేర్చుకున్నవారికి సమాజంలో మంచి గౌరవం ఉందన్నారు. శ్రీవారి వైభవం, పూజలు, ఉత్సవాలు తదితర అంశాలు కూడా వేదాల్లో ఉన్నాయన్నారు. టిటిడి అదనపు ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి మాట్లాడుతూ వేల సంవత్సరాలుగా వేదాలు మౌఖికంగా లోకానికి జ్ఞానాన్ని పంచుతున్నాయని తెలిపారు. ఈ సదస్సుకు గొప్ప వేదవిద్వాంసులను ఆహ్వానించామని, వారి సందేశాన్ని భక్తులందరూ వినాలని కోరారు. అనంతరం వేద విద్యార్థులు చతుర్వేద పారాయణం చేశారు. ఎస్వీ వేద వర్సిటీ మాజీ ఉపకులపతి ఆచార్య కెఇ.దేవనాథన్ వేదంలో పురుషార్థాలు అనే అంశంపై ఉపన్యసించారు.
ఈ కార్యక్రమంలో టిటిడి సిఏవో శ్రీ శేషశైలేంద్ర, ఎస్టేట్ అధికారి శ్రీ విజయసారథి, ఎస్వీ ఉన్నత వేదాధ్యయన సంస్థ ప్రాజెక్టు అధికారి డా. ఆకెళ్ల విభీషణశర్మ తదితరులు పాల్గొన్నారు.