10 నుంచి ‘కంటి వెలుగు’

10 నుంచి 'కంటి వెలుగు'
ఉచితంగా పరీక్షలు, కళ్లజోళ్ల పంపిణీ
తొలి దశలో విద్యార్థులకు మాస్‌ స్ర్కీనింగ్‌
ఫ ఎంబీబీఎస్‌ విద్యార్థుల సేవలు వినియోగం
గుంటూరు : కంటి వెలుగు అనే బృహత్తర పథకానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. ప్రపంచ దృష్టి దినోత్సవమైన అక్టోబరు 10న జిల్లాలో ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు. ప్రాఽథమిక స్ర్కీనింగ్‌ పరీక్షల్లో దృష్టి దోషాలు (రిఫ్రాక్టివ్‌ ఎర్రర్స్‌) ఉన్న వారిని గుర్తించి తదుపరి వైద్య చికిత్సల కోసం కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రాలు, ప్రాంతీయ ఆసుపత్రులు, గుంటూరు ప్రభుత్వ వైద్య బోధన ఆసుపత్రికి పంపుతారు. ఈ పఽథకం నిర్వహణలో జిల్లాలో శంకర కంటి ఆసుపత్రి, ఎల్‌వీ ప్రసాద్‌ ఐ ఇనిస్యిట్యూట్‌కు చెందిన విజన్‌ టెక్నీషియన్‌ సేవలను వినియోగించుకుంటారు.
పథకం అమలు ఇలా : ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల్లో ఒకటి నుంచి పదో తరగతి వరకు చదివే విద్యార్థులకు పాఠశాలల్లోనే కంటి పరీక్షలు జరుపుతారు. ఆయా పరీక్షల్లో ప్రాథమిక దృష్టి దోషాలను గుర్తించి వారి పేర్లను కంటి వెలుగు యాప్‌లో అప్‌లోడ్‌ చేస్తారు. మొత్తం ఐదు రోజుల్లో ఈ ప్రక్రియను పూర్తి చేస్తారు. ప్రాథమిక స్ర్కీనింగ్‌ శిబిరాల్లో గుర్తించిన పిల్లలకు నవంబరు, డిసెంబరు నెలల్లో ఆప్తాల్మిక్‌ అసిస్టెంట్లు దృష్టి దోషాలు నిర్ధారిస్తారు. వైద్య పరీక్షలు పూర్తి చేసిన అనంతరం పీహెచ్‌సీ వైద్యాధికారులు పాఠశాలకు వచ్చి పిల్లలకు ఉచితంగా కళ్లజోళ్లు పంపిణీ చేస్తారు.
సాధారణ ప్రజలకు ఇలా : రెండో దశలో జిల్లాలో సాధారణ ప్రజలకూ కంటి పరీక్షలు చేస్తారు. ఇటీవల కొత్తగా ప్రభుత్వం నియమించిన గ్రామ వలంటీర్ల సేవలను ఇందులో వినియోగించుకుంటారు. వలంటీర్లు తమకు నిర్ధేశించిన గృహాలకు వెళ్లి స్నెలెన్స్‌ చార్ట్‌లతో కంటి పరీక్షలు జరుపుతారు. దృష్టి లోపాలు ఉన్న వారి పేర్లను నమోదు చేసుకుని కంటి వెలుగు యాప్‌లో అప్‌లోడ్‌ చేస్తారు. ఈ సమాచారం ఆధారంగా ఆఫ్తాల్మిక్‌ అసిస్టెంట్లు బాధితులకు తదుపరి కంటి పరీక్షలు జరిపి దృష్టి దోపాలను నిర్ధారిస్తారు. కళ్లజోళ్లు అందజేస్తారు. శుక్లాలు ఇతర శస్త్రచికిత్సలు అవసరమైన వారిని ప్రభుత్వాస్పత్రులకు సిఫార్సు చేస్తారు. పట్టణ ప్రాంతాల్లో గ్రామ వలంటీర్లతో పాటు గుంటూరు వైద్య కళాశాలకు చెందిన 200 మంది ఎంబీబీఎస్‌ విద్యార్థులు, పలు నర్సింగ్‌ పాఠశాలల విద్యార్థుల సేవలను కూడా వినియోగించుకుంటారు.
పీహెచ్‌సీ వైద్యులకు శిక్షణ : జిల్లా అంధత్వ నివారణ సంస్థ ఆధ్వర్యంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో  పీహెచ్‌సీ వైద్య సిబ్బందికి శిక్షణ కార్యక్రమాలు ప్రారంభిస్తున్నారు. గుంటూరు, గురజాల డివిజన్‌ పరిధిలోని పీహెచ్‌సీ సిబ్బందికి, నరసరావుపేట, తెనాలి డివిజన్‌ వైద్యులకు,  అర్బన్‌ ప్రాంతంలో పని చేసే వైద్యాధికారులకు శిక్షణ కార్యక్రమాలు జరుగుతాయి. ఇక్కడ శిక్షణ పొందిన పీహెచ్‌సీ డాక్టర్లు, ఆశాలు, ఏఎన్‌ఎంలకు శిక్షణ ఇస్తారు. ఆయా పాఠశాలల ఉపాధ్యాయులకు శిక్షణ ఇస్తారు.
అక్టోబరు 10న ప్రారంభం :  డీఎంహెచ్‌వో డాక్టర్‌ యాస్మిన్‌
జిల్లాలో అక్టోబరు 10 నుంచి పాఠశాలల్లో కంటి వెలుగు పథకం ప్రారంభిస్తున్నాం. సుమారు 6 లక్షల మంది విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహిస్తాం. దృష్టిలోపాలు ఉన్న వారిని గుర్తించి వారికి కళ్లజోళ్లు అందజేస్తాం. ఈ ఏడాది డిసెంబరు నాటికి విద్యార్థులకు కంటి పరీక్షలు, కళ్లజోళ్ల పంపిణీ పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్ణయించాం. రెండో దశ నుంచి సాధారణ ప్రజలకు కంటి పరీక్షలు చేపడతాం.