బోటు ప్రమాదానికి అసలు కారకులెవరు?

బోటు ప్రమాదానికి అసలు కారకులెవరు?
రంపచోడవరం : కచ్చులూరు మందంలో పర్యాటక బోటు ప్రమాదానికి అసలు కారకులెవరు? గోదావరి పరివాహక ప్రాంతంలో నదీ రవాణాను పర్యవేక్షించే ధవళేశ్వరం ఇరిగేషన్‌ అధికారులు, కాకినాడ పోర్టు అధికారుల నిర్లక్ష్యమే ఈ ఘోర ప్రమాదానికి కారణం కావడంతో దోషమంతా వారిదేనని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గోదావరి వరదలో ఏ స్థాయిలో లాంచీలు, బోట్లు నడపవచ్చో నిర్దేశిస్తూ వరద సంరక్షణ ప్రణాళికలో ఇరిగేషన్‌ అధికారులు పేర్కొ న్నారు. దీని ఆధారంగా కాకినాడ పోర్టు అధికారులు నిర్దేశించిన నిబంధనలు వాస్తవ పరిస్థితులకు భిన్నంగా వున్నాయి. మార్గదర్శకాల్లో లోపాలే బోటు మునకకు కారణమై చాలా కుటుంబాల్లో తీవ్ర విషాదం మిగిల్చింది. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయిలో మాత్రమే గోదావరిలో బోట్లు, లాంచీల ప్రయా ణానికి నిషేధాజ్ఞలు అమలు చేస్తున్నారు. గోదావరి వరదల సమయంలో ఉభయ గోదావరి జిల్లాల్లో అనుసరించాల్సిన వ్యూహాలకు సంబంధించి ఇరిగేషన్‌ అధికారులు 2019 వరద సంరక్షణ ప్రణాళికలో రూపొందించారు. దీనికి అనుబంధంగా ఆగస్టు చివర్లో కాకినాడ పోర్టు అధికారులు ఉత్తర్వులు విడుదల చేశారు. ధవళేశ్వరం వద్ద గోదావరి వరద మొదటి ప్రమాద హెచ్చరిక (11.75 అడుగుల) స్థాయిలో ఆనకట్టకు దిగువున, ఎగువున కూడా బోట్లు, లాంచీలను నిషేధించారు. తుపాను, ఇతర ప్రతికూల పరిస్థితుల్లో ఇదే విధంగా చేయాలి. అఖండ గోదావరిలో అయితే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ అనంతరం, వశిష్ఠ, గౌతమి పాయల్లో అయితే 13.75 అడుగుల స్థాయిల్లో వరద ప్రవాహం ఉంటే ఎటువంటి పడవలూ నడపరాదు. ఈ స్థాయిలో 80 హెచ్‌పీ లేదా 18 టన్నుల సామర్థ్యం గల లాంచీలకు మినహాయింపు ఉంటుంది. అయితే ధవళేశ్వరం వద్ద వరద 11 అడుగుల స్థాయికి వస్తే గోదావరిలో లాంచీల సంచారానికి ఎటువంటి నిషేధాలూ ఉండవు. కానీ వాతావరణ ప్రతికూలతతో పాటు ప్రత్యేక పరిస్థితుల్లో కూడా గోదావరిలో ప్రయాణాన్ని నిరోధించవచ్చన్న క్లాజు కూడా పెట్టారు. కాగా కచ్చులూరు మందం వద్ద ప్రమాదం జరిగిన రోజున ధవళేశ్వరం వద్ద వరద ప్రమాద స్థాయికి దిగువున... అంటే సుమారు 7-8 అడుగుల మధ్యనే నమోదైంది. దీంతో వరద సంరక్షణా ప్రణాళిక ప్రకారం లాంచీలు, బోట్లు గోదావరిలో సంచరించడానికి ఆటంకం లేదు. కానీ ఎగువ ప్రాంత పరిస్థితులు పాపికొండలుకు వెళ్లడానికి బోట్లకు అనువుగా లేవని నిర్దేశించడంలో అధికారులు విఫలమయ్యారు. ప్రతికూల పరిస్థితులను ఉటంకిస్తూ హెచ్చరికలు చేయాల్సిన బాధ్యతను ఇరిగేషను, పోర్టు అధికారులు పూర్తిగా విస్మరించారు. పాపికొండలు మార్గంలో ప్రమాదపరిస్థితిని ముందుగానే గుర్తించి బోట్లను నిషేధించి ఉంటే ఈ ప్రమాదం జరిగేది కాదు. గోదా వరిపై పూర్తి పట్టు ఉండాల్సిన ఇరిగేషన్‌ అధికారులు గోదావరి వడిని అంచనావేసి ప్రణాళిక రూపొందించకపోవడమే ఈ ప్రమాదానికి కారణమైంది. పోర్టు అధికారులు కూడా తమ వంతుగా గోదావరిలో పరిస్థితులను అంచనా వేయకుండా కేవలం ఇరిగేషన్‌ అధికారులు ఇచ్చే నివేదికల ఆధారంగా మార్గదర్శకాలను ఇవ్వడమూ ఇందులో లోపమే అయింది. ఈ ప్రమాదం నేపథ్యంలోనైనా వరద సంరక్షణా ప్రణాళికలో గోదావరిలో లాంచీలు, బోట్ల సంచారానికి ఉన్న నిబంధనలను సవరించి భవిష్యత్తులో ఇటువంటివి పునరావృతం కాకుండా చూడాలి.