ఆంధ్రప్రదేశ్ లో జాతీయ పోర్టుపై  త్వరలో స్పష్టత

*ఆంధ్రప్రదేశ్ లో జాతీయ పోర్టుపై  త్వరలో స్పష్టత : పరిశ్రమలు,వాణిజ్య, ఐ.టీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి*
ఉక్కు కర్మాగారం అభివృద్ధికి కేంద్రం సాయం కోసం వినతి పత్రమిచ్చాం  : మంత్రి మేకపాటి
విశాఖ తీర ప్రాంతం కేంద్రంగా  ఓడలకు సంబంధించిన భవన నిర్మాణం చేపట్టమని అడిగాం
వైజ్ఞానిక సంబంధమైన నైపుణ్య శిక్షణ కేంద్రం ఏపీలో ఏర్పాటు చేయాలని వినతి 
అమరావతి, సెప్టెంబర్ 25 : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి రావాల్సిన నిధులు, కేంద్రం నుంచి అందాల్సిన సహకారం కోరుతూ రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్య, ఐ.టీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ఢిల్లీ పర్యటన సాగుతోంది. రాష్ట్రంలో పరిశ్రమల స్థాపన, పోర్టుల అభివృద్ధి, జాతీయ స్థాయి గుర్తింపు, ఉక్కు కర్మాగారం ఏర్పాటుకు సంబంధించి ఎప్పటినుంచో పెండింగ్ లో ఉన్న అంశాలను ఒక కొలిక్కి తీసుకువచ్చే దిశగా కేంద్ర మంత్రులు ఒక్కొక్కరితో మంత్రి మేకపాటి భేటీ అయ్యారు. ముందుగా,  ఓడరేవుల శాఖ మంత్రి మాన్‌సుఖ్ మాండవియాను బుధవారం ఏపీ పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి కలిశారు. ఈ సందర్భంగా ఆయన రాష్ట్రానికి సంబంధించిన పలు ప్రతిపాదనలతో కూడిన వినతి పత్రాన్ని మంత్రి మేకపాటి.. కేంద్రమంత్రి మాండవియాకి అందజేశారు.  విభజన హామీలను ఆయనకు వివరించారు. దుగరాజపట్నం పోర్టును జాతీయ పోర్టుగా గుర్తించి ఏర్పాటు చేయాల్సి ఉన్నప్పటికీ కొన్ని సాంకేతిక కారణాల దృష్ట్యా ముందుకు సాగలేదని కేంద్రమంత్రికి మేకపాటి వెల్లడించారు. అయితే, ప్రత్యామ్నాయంగా వేరే ప్రాంతాలను చూపించాలని కేంద్రం కోరిందన్నారు.  అందుకు వీలుగా రామాయపట్నం, మచిలీపట్నం వంటి ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశామన్నారు మంత్రి మేకపాటి. బకింగ్‌ హామ్‌ కెనాల్‌లో జల రవాణా విషయాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లినట్టు గౌతమ్‌ రెడ్డి తెలిపారు. బకింగ్ హామ్స్ కాలువను జాతీయ ప్రాజెక్టుగా గుర్తించి జలరవాణాకు సహకరించాలని కోరినట్లు స్పష్టం చేశారు. తీర ప్రాంతంలో సరకు రవాణాకు అనువుగా మౌలిక సదుపాయాలతో కూడిన కార్యాలయాల ఏర్పాటుపై కేంద్రం ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని కోరారు. 947 కిలో మీటర్ల తీర ప్రాంతంలో ఓడలకు సంబంధించిన భవన నిర్మాణానికి చేయూతనివ్వాలన్నారు. ఆ తర్వాత ఉక్కు శాఖ మంత్రి ఫగ్గన్ సింగ్ కులస్తేతో మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి సమావేశమయ్యారు, కడప జిల్లాలో ఉక్కు కర్మాగారం అభివృద్ధికి సహకరించాలని కేంద్రమంత్రికి విన్నవించారు. ఉక్కు ఫ్యాక్టరీ ద్వారా మరిన్ని పెట్టుబడులు వచ్చేలా చూడాలన్నారు. ఎక్కువ ప్రోత్సాహకాలు అందించడమే కాకుండా, ఉక్కు కర్మాగారానికి మొదటి 7 సంవత్సరాలు జీఎస్టీని మినహాయించాలని మంత్రికి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ లో స్టీల్ క్లస్టర్ ఏర్పాటు చేయాలని విన్నవించారు. ఉక్కుకు సంబంధించిన సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల ఏర్పాటుపైనా ప్రతిపాదనలను కేంద్రమంత్రి కులస్తేకు వినతి పత్రంగా అందించారు మంత్రి మేకపాటి.  ఉక్కు శాఖ మంత్రితో సమావేశం అనంతరం కేంద్ర కెమికల్స్ మరియు ఫర్టిలైజర్స్ శాఖ ముఖ్యకార్యదర్శితో మంత్రి మేకపాటి భేటీ అయ్యారు. కాకినాడ సమీపంలో పెట్రోలియమ్ , కెమికల్స్ మరియు పెట్రో కెమికల్స్ ఇన్వెస్ట్ మెంట్ రీజియన్ (PCPIR) అభివృద్ధికి సహకరించాలని ఆయనను కోరారు. కేజీ బేసిన్ లో పుష్కలంగా ఉన్న సహజవాయువు ద్వారా ఏపీ అభివృద్ధికి కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. వైజ్ఞానిక,పారిశ్రామిక పరిశోధన మండలి డైరెక్టర్ జనరల్ , బృందంతో మంత్రి సమావేశమయ్యారు. ఏపీ కేంద్రంగా వైజ్ఞానిక సంబంధించిన వ్యాపారాలకు సహకరించాలని మంత్రి కోరారు. వైజ్ఞానిక రంగంలో యువత నైపుణ్య శిక్షణ పొందేలా నైపుణ్య కేంద్రం ఏర్పాటుకు చొరవచూపాలని కోరారు. తొలి రోజు పర్యటనలో చివరిగా డీఆర్డీవో ఛైర్మన్ సతీష్ రెడ్డిని మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి కలిశారు. ఆంధ్రప్రదేశ్ లో డీఆర్ డీవో కేంద్రం ఏర్పాటుకు ఉన్న సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని, మంత్రి ఛైర్మన్ ను విజ్ఞప్తి చేశారు.