మద్యం షాపులు తగ్గినా... పెరిగిన అమ్మకాలు

మద్యం షాపులు తగ్గినా... పెరిగిన అమ్మకాలు
గత ఏడాదితో పోల్చుకుంటే అమ్మకాల్లో వృద్ధి
ఎక్సైజ్‌ శాఖకు పెరుగుతున్న ఆదాయం
అక్టోబరు 1 నుంచి జిల్లాలో అన్నీ ప్రభుత్వ మద్యం షాపులే
ఎక్సైజ్‌ అధికారులు సన్నద్ధం
గుంటూరు : జిల్లాలో మద్యం అమ్మకాలు అనుకున్నంతగా తగ్గలేదు. జిల్లా వ్యాప్తంగా అనేక మద్యం దుకాణాలు మూతపడినప్పటికీ వాటి ప్రభావం మద్యం అమ్మకాలపై ఏమాత్రం పడలేదు. దీంతో గత ఏడాదికి, ప్రస్తుత సంవత్సరానికి పోల్చుకుంటే మద్యం అమ్మకాలు ఏ మాత్రం తగ్గలేదు సరికదా పెరుగుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా 353 మద్యం షాపులు ఉండగా గత మూడు నెలల నుంచి వాటిలో 66 మద్యం దుకాణాలు నిలిచిపోయాయి. మిగిలిన మద్యం దుకాణాలకు పాత లైసెన్సుదారులే ఈనెలాఖరు వరకు కొనసాగుతున్నారు. మూతపడిన 66 మద్యం దుకాణాలలో 38 షాపులను ప్రభుత్వం సెప్టెంబరు 1 నుంచి ఆధీనంలోకి తీసుకుని నిర్వహిస్తోంది. జిల్లా వ్యాప్తంగా 20 శాతం మద్యం షాపుల్లో కోత పడగా 353 షాపులకు గాను 71 షాపులను తొలగించాల్సి వచ్చింది. జిల్లాలో ఇప్పటి వరకు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో 287, ప్రభుత్వ ఆధీనంలో 38 చొప్పున 325 మద్యం షాపులు నడుస్తున్నాయి. 28 షాపులు ఖాళీగా ఉన్నాయి. దుకాణాల సంఖ్య తగ్గినా మద్యం అమ్మకాలు పెరుగుతూనే ఉన్నాయి. అక్టోబరు 1 నుంచి జిల్లాలో 282 మద్యం షాపులను పూర్తిగా ప్రభుత్వ ఆధీనంలోనే నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి సేల్స్‌ సూపర్‌వైజర్లు, సేల్స్‌మన్‌లను కూడా ఎక్సైజ్‌ అధికారులు రిక్రూట్‌ చేసుకున్నారు. ప్రతి షాపునకు ముగ్గురు చొప్పున సిబ్బందిని ఎక్సైజ్‌ అధికారులు ఔట్‌సోర్సింగ్‌ విధానంలో నియమించారు.
తాగి తూగుతున్న యువత : బర్త్‌డే పార్టీలు, వీకెండ్‌ పార్టీలు... ఇలా రకరకాలుగా యువత మద్యంలో మునిగి తేలుతోంది. బర్త్‌డే పార్టీలను నడిరోడ్డుపైన అర్ధరాత్రి వేళల్లో నిర్వహించడం పరిపాటిగా మారింది. మద్యం కంటే బీర్ల అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. ప్రతి విషయానికి సంబంధించి సరదాగా రెండు పెగ్గులేద్దామంటూ చిన్న, పెద్ద తారతమ్యం లేకుండా మద్యం మత్తులో తూలుతున్నారు. షాపుల సంఖ్య తగ్గినప్పటికీ అమ్మకాలు తగ్గక పోవడంతో ఎక్సైజ్‌ శాఖ అధికారులు ఖుషీగా ఉన్నారు.
1 నుంచి 282 ప్రభుత్వ మద్యం షాపులు : నూతన మద్య విధానంలో భాగంగా అక్టోబరు 1 నుంచి మద్యం షాపులను ప్రభుత్వ ఆధీనంలో నిర్వహించనున్నారు. జిల్లాలో 353 మద్యం షాపులకు గాను 20 శాతం కోత విధించగా 71 షాపులను తొలగిస్తున్నారు. దీంతో 282 మద్యం షాపులు అక్టోబరు 1 నుంచి ప్రభుత్వ ఆధీనంలో నడవనున్నాయి. ఎక్సైజ్‌ శాఖ అధికారులు ఇప్పటికే క్షేత్రస్థాయిలో సన్నద్ధమయ్యారు. 
జిల్లాలో మద్యం అమ్మకాల జోరు
2018                             2019
జూన్‌ రూ.150 కోట్లు        రూ.150 కోట్లు
జూలై రూ.164 కోట్లు        రూ.187 కోట్లు
ఆగస్టు రూ.165 కోట్లు      రూ.190 కోట్లు