21.09.2019
అమరావతి
కర్నూలు జిల్లా నంద్యాలలో వరద బాధిత ప్రాంతాల్లో సహాయక చర్యలపై ముఖ్యమంత్రి శ్రీ వైయస్.జగన్ సమీక్ష
కర్నూలు జిల్లా వరదల వల్ల ముంపునకు గురైన నంద్యాల, మహానంది ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించిన ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్.... వరద ప్రభావాన్ని పరిశీలించారు. అనంతరం నంద్యాల మున్సిపల్ కార్యాలయంలో వరద నష్టంపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వరద బాధితులను ఆదుకోవడంలో అధికారులు ఉదారంగా వ్యవహరించాలని అధికారులను ఆదేశించిన సీఎం.. గతంలో ఇచ్చిన పరిహారం కంటే అధికంగా ఇవ్వాలని సూచించారు. మరోవైపు భారీ వర్షాల నేప«థ్యంలో ముంపు ప్రాంతాల్లో తీసుకోవాల్సిన చర్యలతో పాటు ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు పెంచేందుకు తీసుకోవాల్సిన చర్యలపై స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. సమీక్ష సందర్భంగా అధికారులనుద్ధేశించి ముఖ్యమంత్రి ఏమన్నారంటే....
మామూలుగా అయితే రాయలసీమ ప్రాంతంలో ఈ స్ధాయి వర్షాలు అనేది చూడ్డం కూడా అరుదే. ఐదుజిల్లాల్లో వర్షపాతం తక్కువగా ఉందని మొన్ననే బాధపడ్డం. పడాల్సిన దానికన్నా చాలా తక్కువగా ఉందని ఆందోళన చెందాం. దేవుడు దయదలచడం వల్ల మంచి వర్షాలు పడ్డాయి. అన్నిజిల్లాల్లోనూ కాస్త అటుఇటుగా ఉన్నా మళ్లీ సాధారణ వర్షపాతం నమోదవుతున్న పరిస్థితులు చూస్తున్నాం. ఒక్క అనంతపురంలో తక్కువ వర్షపాతం కాస్త అటు ఇటుగా ఉంది. కర్నూలు జిల్లాలో 66శాతం ఎక్కువ వర్షపాతం నమోదవుతోంది. ఇవన్నీకూడా మంచి పరిణామాలు.
కాకపోతే అధిక వర్షాల కారనంగా కొన్ని ఇబ్బందికర పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. దాదాపు 17 మండలాల్లో ఇలాంటి పరిస్థితి ఉందని, 17 మండలాల్లో వర్షం ఎక్కువగా వర్షం కురవడంవల్ల నష్టం వాటిల్లిందని కనిపిస్తోంది.
వరదలవల్ల వచ్చిన నష్టంలో ఎక్కువగా రోడ్లుదెబ్బతిన్నాయి. ఆర్ అండ్ బి నష్టాలే దాదాపు 420 కోట్ల రూపాయలు నష్టం కనిపిస్తున్నాయి. మరో 103 కోట్ల రూపాయలమేర పంచాయతీ రోడ్లు దెబ్బతిన్నాయి. దాదాపు 524 కోట్లుమేర రోడ్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి.
33వేల హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయి. రెండువేల హెక్టార్లలో ఉద్యానవన పంటలు దెబ్బతిన్నాయి.
అధికారులు రైతులను ఆదుకునే విషయంలో, వరబాధితులను ఆదుకునే విషయంలో మానవత్వంతో వ్యవహరించాలి. కలెక్టర్ ఉదారంగా ఉండాలని చెప్తున్నారు. గట్టిగా గిరి గీసుకుని, గట్టిగా పట్టుకునే వ్యవహారాలువద్దని చెప్తున్నారు. ఇంతే పరిహారం ఇస్తాం, దీన్ని దాటి పోలేం అంటూ గీతలు గీయొద్దు. కొంచెం లిబరల్గానే ఉండండి.
వరద నష్టాల విషయంలో ప్రభుత్వం ఏం చేయాలన్నదానిపై ఒక ప్రణాళిక వేసుకోండి. భవిష్యత్తులో ఏమేర కుందూనదిలో వరద ప్రమాహం వస్తే.. ఏయే ప్రాంతాలకు నష్టం వాటిల్లుతుందనే దానిపై అధ్యయనం చేసి ఒక నివేదిక తయారుచేయండి. దీర్ఘకాలికంగా చేయాల్సిన పనులపై అంచనాలు తయారుచేసి, ఆమేరకు ప్రతిపాదనలు సిద్ధంచేయండి. వాటిని అమలు చేసే దిశగా మనం అడుగులు వేద్దాం.
శ్రీశైలం నుంచి తొంభై రోజులు, వంద రోజులు, నూట ఇరవై రోజులు మనకు వరదజలాలు వస్తాయన్న పరిస్థితులు ఇప్పుడు కనిపించడంలేదు. 47 సంవత్సరాల సీడబ్ల్యూసీ రికార్డుల ప్రకారం ఏడాదికి సగటున 1200 టీఎంసిల నీళ్లు వస్తున్నాయన్న లెక్కలు కనిపిస్తున్నాయి. అదే గత పది సంవత్సరాల సీడబ్ల్యూసీ లెక్కల ప్రకారం చూస్తే శ్రీశైలంలోకి ఎన్ని నీళ్లు వస్తాయనేది చూస్తే అది 600 టీఎంసీలకు పడిపోయిన పరిస్ధితి. గత ఐదేళ్లుగా చూస్తే శ్రీశైలంలోకి ఎన్ని నీళ్లు వస్తా ఉన్నాయని సీడబ్ల్యూసీ లెక్కల ప్రకారం చూస్తే... అవి 400 టీఎంసీలకు పడిపోతున్నాయి.
ఈ సంవత్సరం దేవుడు దయ వల్ల ఆ పరిస్దితి లేదు కానీ, మామూలుగా అయితే 40 యేళ్లు సీడబ్ల్యూసీ లెక్కల ప్రకారం శ్రీశైలంలోకి వచ్చేది 1200 టీఎంసీల అయితే, గత ఐదు సంవత్సరాల సీడబ్ల్యూసీ లెక్కల ప్రకారం శ్రీశైలంలోకి వచ్చే నీళ్లు 400 టీఎంసీలకు మాత్రమే.
ఇటువంటి పరిస్ధితుల్లో ఒకవైపు ఆల్మట్టీ ఎత్తును 519 నుంచి 524 మీటర్ల ఎత్తును పెంచుకుంటూ పోతున్నారు. దీనివల్ల మరో 100 టీఎంసీల నీళ్లు రావడం అనేది తగ్గిపోతాయి.
ఇటువంటి పరిస్ధితుల్లో కృష్టా ఆయకట్టును బతికించుకోవాలన్నా, రాయలసీమ ప్రాంతం ఎడారి కాకుండా రక్షించుకోవాలన్నా మనమేం చేయాలన్న విషయం మీద చాలా జాగ్రత్తగా ఆలోచనలు చేసి అడుగులు వేస్తా ఉన్నాం. ఇందులో భాగంగానే తెలంగాణా ముఖ్యమంత్రి గారితో మాట్లాడ్డం, గోదావరి నీళ్లను కచ్చితంగా నాగార్జునసాగర్, శ్రీశైలంలోకి ఎలా తీసుకొని రావాలి అనే దానిపైన ఆలోచనలు కూడా చేయడం జరుగుతోంది.
ఎట్టి పరిస్ధితుల్లోనూ రాయలసీమలోని అన్ని రిజర్వాయర్లనూ వరదనీళ్లు వచ్చే 40–45 రోజుల్లోపలే నింపుకునే పరిస్ధితుల్లోకి మనం రావాలి.
కాల్వల సామర్థ్యాన్ని కచ్చితంగా పెంచుకోవాలి. రాయలసీమలోని ప్రతీ డ్యామ్, రిజర్వాయర్ నింపుకునేలా ప్రణాళికలు రూపొందిస్తున్నాం. ఇందులో భాగంగానే కుందూ నదిలో ప్రవాహాన్ని పరిగణలోకి తీసుకుని ఇంకా మెరుగుపరచ్చేందుకు, నీళ్ల వలన ఈ గ్రామాలకు ఎటువంటి నష్టం జరగకుండా చూసుకునేందుకు కూడా చర్యలు కూడా చేస్తా ఉన్నాం.
చామకాల్వ నుంచికూడా నంద్యాల ఎమ్మెల్యే రవి ఇంతకుముందే చెప్పాడు. నాన్నగారు బతికున్నప్పుడు ప్రొటెక్షన్ వాల్ కట్టాలని అప్పట్లోనే డిసైడ్ చేసి దాదాపు వందకోట్ల రూపాయలు కేటాయింపులు చేసి దాదాపు కొంతమేర పనులు కూడా చేసినప్పుడు నాన్నగారు చనిపోవడం, ఆ తర్వాత పనులన్నీ ఆగిపోయాయి. అవన్నీ కూడా కార్యక్రమాలు మొదలుపెట్టించే పనిలో ఉంటాం.
అదే మాదిరిగా షార్ట్ టెర్మ్ మెజర్స్ లో భాగంగా ఈ 17 మండలాలకు సంబంధించి 7 మండలాలు సివియర్గా వరద ప్రభావిత మండలాలు, మరో రెండు మున్సిపాల్టీలు ఏదైతే సివియర్గా ఎఫెక్ట్ అయ్యాయి.
అందరికీ ఒకటే చెపుతా ఉన్నాను. అందరికీ మంచి చేస్తాం. న్యాయం చేస్తామని కచ్చితంగా చెప్తా ఉన్నాం. 25 కేజీల బియ్యం, ఒక కేజీ కందిపప్పు, ఒక కేజీ ఉల్లిపాయలు, ఒక లీటర్ పామాయిల్, ఒక కేజీ టమోటో ఇవన్నీ కూడా ఇవ్వడం మొదలుపెట్టమని కలెక్టర్ గారికి చెప్పా. టోటల్గా అందరికీ కూడా తోడుగా ఉండాలి.
ఇవే కాకుండా పరిహారాన్ని గతంతో పోలిస్తే ఇచ్చే దానికన్నా కూడా దాదాపు 15 శాతం పెంచి ఇవ్వాలని అ«ధికారులను ఆదేశించా. ఇంతకుముందు వరద వచ్చినప్పుడు ఎవరూ పట్టించుకోకపోగా, కేవలం పదికేజీల బియ్యం ఇచ్చే పరిస్ధితి మాత్రమే ఉండేది, ఇప్పుడా పరిస్దితిని పూర్తిగా మార్చి 25 కేజీల బియ్యం ఇచ్చే విధంగా ఆదేశాలు జారీ చేశాం. ఇవి కాకుండా ప్రతీ ఇంటికి కూడా, నష్టపోయిన ప్రతి కుటుంబానికి రెండువేల రూపాయలు అదనంగా ఇస్తాం.
కలెక్టర్ గారి కార్యాలయంలో ఒక సెల్ పెట్టండి. ఎవ్వరికీ ఏ సమస్య ఉన్నా, గ్రీవెన్స్ ఉంటే నేరుగా కలెక్టర్ దగ్గరికి వెళ్లండి. కలెక్టర్ నేరుగా మీ సమస్యపై స్పందించి చర్య తీసుకుంటారు.
అదే విధంగా అధికారులకు నేను ఒక్కటే రిక్వెస్ట్ చేస్తా ఉన్నా... అధికారులందరూ కూడా లిబరల్గా ఉండండి. ప్రతీ ఒక్కరి మొహంలో చిరునవ్వులు చూసే విధంగా వ్యవహరించండి అని ప్రతీ అధికారికి చెప్తున్నాను.