పారదర్శకతలో ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌ మరో ముందడుగు

*పారదర్శకతలో ముఖ్యమంత్రి  వైయస్‌.జగన్‌ మరో ముందడుగు*


*అమరావతి;


మరింత పటిష్టంగా రివర్స్‌ టెండరింగ్‌*
*కనీసం ఐదుగురు లేదా బిడ్డింగ్‌లో పాల్గొన్న మొదటి 60శాతం మందికే (బిడ్డింగ్‌లో 10 మంది పాల్గొంటే అందులో ఎల్‌ 1 నుంచి ఎల్‌ 6 వరకూ) రివర్స్‌ టెండరింగ్‌లో ఛాన్స్‌*
*మరింత పారదర్శకత, పోటీపెంచడం, వీలైనంత ఎక్కువ ప్రజాధనం ఆదాయే లక్ష్యం*
*రూ.10లక్షలు నుంచి రూ.100 కోట్ల టెండర్లకూ రివర్స్‌ టెండరింగ్‌*
*జనవరి 1 నుంచి సరికొత్త విధానం అమలు* 
*ఈలోగా విధాన రూపకల్పన, పారదర్శకత శాశ్వతంగా ఉండేలా పాలసీ*
*జ్యుడిషియల్‌ ప్రివ్యూ, రివర్స్‌ టెండరింగ్‌ సంబంధిత కార్యకలాపాల సమన్వయంకోసం ఒక ఐఏఎస్‌ అధికారి*
*అధికారులతో సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌.జగన్‌* 


అమరావతి: రూ.100 కోట్లు పైబడ్డ కాంట్రాక్టు పనులను ముందస్తు న్యాయసమీక్షకు నివేదించడంద్వారా దేశంలో అత్యుత్తమ పారదర్శక విధానాన్ని ప్రవేశపెట్టిన ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌.జగన్‌ మరో ముందడుగు వేశారు. రూ.10లక్షలు ఆ పైబడ్డ విలువైన పనులు, సర్వీసులు, కొనుగోళ్లకోసం నిర్వహించే టెండర్లలో పారదర్శకతకు పెద్దపీట వేసేలా నిర్ణయాలు తీసుకున్నారు. సీఎం ఆదేశాల ప్రకారం జనవరి 1 నుంచి కొత్తపాలసీ అమల్లోకి కానుంది. ఈలోగా ప్రస్తుతం ఉన్న ఇ–ప్రొక్యూర్‌ మెంట్‌ ఫ్లాట్‌ఫాంమీదే సాధ్యమైనంతమేర పారదర్శకత ఉండేలా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. 


ప్రభుత్వ కాంట్రాక్టులు, సర్వీసులు, కొనుగోళ్లలో పారదర్శకత, ప్రజాధానం ఆదాకోసం ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌.జగన్‌ తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో వివిధశాఖల అ«ధికారులతో సమావేశమయ్యారు. రూ.100 కోట్లు పైబడ్డ కాంట్రాక్టులను ముందస్తు న్యాయసమీక్ష ప్రక్రియకు నివేదించడం ద్వారా విప్లవాత్మక సంస్కరణలు తీసుకు వచ్చామని సీఎం ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. రివర్స్‌ టెండరింగ్‌ను మరింత బలోపేతం చేయడానికి సీఎం అధికారులకు సీఎం ఆదేశాలు ఇచ్చారు. కనీసం ఐదుగురు లేదా బిడ్డింగ్‌లో పాల్గొన్న మొదటి 60శాతం మందికే (బిడ్డింగ్‌లో 10 మంది పాల్గొంటే అందులో ఎల్‌ 1 నుంచి ఎల్‌ 6 వరకూ) రివర్స్‌టెండరింగ్‌కు అర్హులయ్యేలా చూడాలన్నారు. దీనివల్ల బిడ్డింగ్‌ ప్రక్రియలో కోట్‌చేసేటప్పుడు వాస్తవికత ఉంటుందని, రివర్స్‌ టెండరింగ్‌లో మరింత పోటీకి దారితీస్తుందని సీఎం చెప్పారు. 


రూ. 10 లక్షలు పైబడి, రూ.100 కోట్ల లోపు ప్రభుత్వ సర్వీసులు, పనులు, కొనుగోళ్ల విషయంలో కూడా ఇలాంటి సంస్కరణలే ఉండాలన్నారు. ప్రభుత్వ పనులు, సర్వీసులు, కాంట్రాక్టుల్లో శాశ్వత ప్రాతిపదికన పారదర్శకత తీసుకొచ్చేలా ఒక పాలసీ ఉండాలని సీఎం ఆదేశించారు. టెండర్లలో ఎక్కువమంది పాల్గొనేలా ఈ విధానం ఉండాలన్నారు. టెండర్లలో పాల్గొనాలంటూ ఎవ్వరికైనా నిరుత్సాహం కలిగించే పరిస్థితి ఉండకూడదని సీఎం స్పష్టంచేశారు. టెండర్లలో పేర్కొంటున్న అంశాలు మరింత విశదీకరంగా ఉండాలని, ఇవన్నీకూడా అందరికీ అందుబాటులో ఉంచాలన్నారు. తక్కువ ధరకు కోట్‌ చేసిన టెండర్‌ వివరాలను ఇ–ప్రొక్యూర్‌ మెంట్‌ సైట్‌లో డిస్‌ప్లే చేయాలని, వారంరోజులపాటు ఈ వివరాలు అందరికీ అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. ఆతర్వాత రివర్స్‌ టెండరింగ్‌కు వెళ్లాలని ముఖ్యమంత్రి చెప్పారు. కేవలం రాష్ట్రస్థాయిలోనే కాకుండా జిల్లాల వారీగా టెండర్లు పిలవాలనికూడా సీఎం ఆదేశించారు. ప్యాకేజీలు కూడా ఎక్కువమంది పోటీకివచ్చేలా, పాల్గొనేలా చూడాలన్నారు. 


*రూ.10 లక్షలనుంచి రూ.100 కోట్లలోపు పనులు, సర్వీసులు, కొనుగోళ్లపై జాబితా:*
ప్రభుత్వం నుంచి సర్వీసులు, పనులు, కొనుగోళ్లలో ఒకేరీతి విధానం లేదని అధికారులు సీఎం దృష్టికి తీసుకువచ్చారు. దీనికి స్థిరమైన విధానంలేదని,  ఒక్కోశాఖ ఒక్కోలా వ్యవహరిస్తోందని అధికారులు పేర్కొన్నారు. ఇప్పటివరకూ దీనిపై ఒక జాబితాయే లేదని వెల్లడించారు.


ఇ–ప్రొక్యూర్‌మెంట్‌కోసం ఉన్న పోర్టల్‌ను పూర్తిస్థాయిలో వినియోగించని వైనాన్నికూడా సీఎం దృష్టికి తీసుకు వచ్చారు. అసలు ప్రభుత్వ పరంగా చేస్తున్న కొనుగోళ్లు, అప్పగిస్తున్న సర్వీసులు, పనులు విషయంలో ఒక జాబితా తయారుచేయాలని సీఎం ఆదేశించారు. ఆతర్వాత వీటి టెండర్ల విషయంలో ఒక విధానాన్ని తీసుకురావాలన్నారు. ఇప్పటికే శాఖల వారీగా వివరాలు సేకరిస్తున్నామని, వీటిని పరిగణలోకి తీసుకుని ఒక విధానాన్ని తీసుకురావడానికి సంబంధిత కార్యదర్శులతో కమిటీని ఏర్పాటుచేస్తున్నామని సీఎంకు వివరించారు. ఆర్థికశాఖ మిగతా శాఖలతో సమన్వయం చేసుకుని మాన్యువల్‌ను రూపొందిస్తుందని చెప్పారు. కొత్త పాలసీని జనవరి 1 నుంచి అమల్లోకి తీసుకురావాలని, ఆలోగా ప్రస్తుతం ఉన్న ఇ– ప్రొక్యూర్‌ మెంట్‌పోర్టల్‌ను పూర్తిస్థాయిలో నవంబర్‌ 1 నుంచి వినియోగించాలని సీఎం అ«ధికారులను ఆదేశించారు. ఈ పద్ధతుల్లో బిడ్‌ దక్కించుకున్న వారికి చెల్లింపులు కూడా వేగంగా జరిగేలా, ఆమేరకు చెల్లింపుల విభాగంతో ఒక లింక్‌ అయ్యేలా సీఎం ఏర్పాటు చేయాలన్నారు. 


*జ్యుడిషియల్‌ ప్రివ్యూ, రివర్స్‌ టెండరింగ్ , ఇ–ప్రొక్యూర్‌మెంట్‌ సంబంధిత అంశాల సమన్వయం, పర్యవేక్షణకు ఒక ఐఏఎస్‌ అధికారి*


ప్రభుత్వ సర్వీసులు, పనులు, కొనుగోళ్ల టెండర్లలో ఇ–ప్రొక్యూర్‌ మెంట్, జ్యుడిషియల్‌ ప్రివ్యూ , రివర్స్‌ టెండరింగ్‌ పక్రియలు సాఫీగా జరిగేలా సహకారం అందించేందుకు ఒక ఐఏఎస్‌ అధికారిని నియమించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఎప్పటికప్పుడు ప్రభుత్వ సర్వీసులు, పనులు, కొనుగోళ్లను వీరి దృష్టికి తీసుకువచ్చి రివర్స్‌ టెండరింగ్‌ ప్రక్రియ సాఫీగా చూడాల్సిన బాధ్యత ఈ అధికారిదని సీఎం అన్నారు. జ్యుడిషియల్‌ ప్రివ్యూకు అవసరమైన వివరాలు అందించడానికి, ప్రాధామ్యాలను నిర్దేశించడానికి ఈ అధికారిని పనిచేస్తారని ముఖ్యమంత్రి చెప్పారు. జ్యుడిషియల్‌ ప్రివ్యూకు టెండర్‌ పంపగానే సంబంధిత శాఖ అధికారి వెళ్లి అక్కడ న్యాయమూర్తికి వివరించాలనికూడా సీఎం ఆదేశించారు. జ్యుడిషియల్‌ ప్రివ్యూకు తమ తమ శాఖలనుంచి సాంకేతిక సహకారం అందించడానికి వ్యక్తులను వెంటనే సూచించాలన్నారు.