విజయనగరం జిల్లాలో రాష్ట్ర గ‌వ‌ర్నర్ బిశ్వభూష‌ణ్ హ‌రిచంద‌న్ ప‌ర్యట‌న‌

23.10.2019 


విజయనగరం జిల్లాలో రాష్ట్ర గ‌వ‌ర్నర్  బిశ్వభూష‌ణ్ హ‌రిచంద‌న్ ప‌ర్యట‌న‌


31న సాలూరుకు రాక : జిల్లా క‌లెక్టర్ వెల్లడి


విజ‌య‌న‌గ‌రం, అక్టోబ‌రు 23: రాష్ట్ర గ‌వ‌ర్నర్ శ్రీ బిశ్వభూష‌ణ్ హ‌రిచంద‌న్ అక్టోబ‌రు 31న సాలూరులో ప‌ర్యటించ‌నున్నట్టు  విజయనగరం జిల్లా క‌లెక్టర్ డా.ఎం.హ‌రిజ‌వ‌హ‌ర్ లాల్ తెలిపారు. గ‌వ‌ర్నర్ ఆరోజు ఉద‌యం 10.30 గంట‌ల‌కు సాలూరు హెలికాప్టర్‌లో చేరుకొని సాలూరు ప‌ట్టణంలోను, స‌మీపంలోని ఏజెన్సీ గ్రామాల్లోనూ ఏర్పాటు చేసిన ప‌లు కార్యక్రమాల్లో పాల్గొంటార‌ని పేర్కొన్నారు. జిల్లా క‌లెక్టర్ వెల్లడించిన ప్రకారం రాష్ట్ర గ‌వ‌ర్నర్ సాలూరు ప‌ర్యట‌న షెడ్యూల్ ఈ విధంగా వుంది.


ఉద‌యం 10.30 గంట‌ల‌కు గ‌వ‌ర్నర్ సాలూరు డిగ్రీ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన హెలిపాడ్‌కు హెలికాప్టర్‌లో చేరుకుంటారు. 10.35 గంట‌ల‌కు సాలూరులోని యూత్ ట్రైనింగ్ సెంట‌ర్‌కు చేరుకొని మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొంటారు. అనంత‌రం గిరిజ‌న ప్రాంతాల్లో రాష్ట్ర ప్రభుత్వం చేప‌డుతున్న సంక్షేమ‌, అభివృద్ధి కార్యక్రమాల‌పై రాష్ట్ర ఉప‌ముఖ్యమంత్రి శ్రీ‌మ‌తి పాముల పుష్పశ్రీ‌వాణి, గిరిజ‌న సంక్షేమ‌శాఖ ముఖ్య కార్యద‌ర్శి ఆర్‌.పి.సిసోడియా లు గ‌వ‌ర్నర్‌కు వివ‌రిస్తారు. 10.55 గంట‌ల‌కు గిరిజ‌న గ‌ర్భిణీల కోసం సాలూరులో నిర్వహిస్తున్న వ‌స‌తిగృహాన్ని సంద‌ర్శిస్తారు. 11.05 గంట‌ల‌కు బ‌య‌లుదేరి అన్నంరాజువ‌ల‌స వ‌ద్ద ఉద్యాన పంట‌లు పండిస్తున్న ప్రాంతానికి 11.25 కి చేరుకుంటారు. అక్కడ గిరిజ‌నులు పండిస్తున్న ఉద్యాన పంట‌ల‌ను ప‌రిశీలించి గిరిజ‌నుల‌తో ముచ్చటిస్తారు. 11.50 గంట‌ల‌కు అన్నంరాజువ‌ల‌స గ్రామానికి చేరుకొని గ్రామ స‌చివాల‌యం వ‌ద్ద ఏర్పాటు చేసిన గ్రామ‌స‌భ‌లో పాల్గొంటారు. అక్కడి ఆదివాసీల‌తో గ‌వ‌ర్నర్ ముఖాముఖిలో పాల్గొంటారు. అనంత‌రం గ్రామంలో గిరిజ‌నుల‌కు ఆస్తుల‌ను పంపిణీ చేస్తారు. 12.50 గంట‌ల‌కు పి.కోన‌వ‌ల‌స‌లోని గిరిజ‌న సంక్షేమ బాలిక‌ల‌ గురుకుల పాఠ‌శాల‌ను సంద‌ర్శిస్తారు. అక్కడి బాలిక‌ల‌తో సంభాషిస్తారు. బాలిక‌ల‌తో క‌ల‌సి స‌హ‌పంక్తి భోజ‌నంలో పాల్గొంటారు. 1.45 గంట‌ల‌కు సాలూరులో హెలిపాడ్ చేరుకొని హెలికాప్టర్‌లో బ‌య‌లుదేరి వెళ‌తారు.