ప్రమాదబీమా అందుకున్న కుటుంబాల సంఖ్య 4 వేలకు చేరిక

తెలుగుదేశం పార్టీ బీమా..కార్యకర్తలకు ధీమా
-ప్రమాదబీమా అందుకున్న కుటుంబాల సంఖ్య 4 వేలకు చేరిక
-ఆయా కుటుంబాలకు ప్రమాదబీమా కింద రూ.80 కోట్లు చెల్లింపు 
- వంద రూపాయల పార్టీ సభ్యత్వంతోనే ఇన్సూరెన్స్ సదుపాయం
 -టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆలోచనలకు ప్రతిరూపం


నాలుగేళ్లలో నాలుగువేల మంది కార్యకర్తల కుటుంబాలను ఆదుకున్న మైలురాయిని తెలుగుదేశం పార్టీ అందుకుంది. కార్యకర్తల సంక్షేమ విభాగం ఏర్పడిన నాలుగేళ్లలో 4 వేల మంది కార్యకర్తల కుటుంబాలకు రూ.80 కోట్లు ప్రమాదబీమా పరిహారం అందించిన  ఏకైక రాజకీయపార్టీగా తెలుగుదేశం నిలిచింది. 
ఏదైనా ప్రమాదంలో ఒక వ్యక్తి చనిపోతే.. ఆ వ్యక్తిపై ఆధారపడిన కుటుంబం రోడ్డున పడుతుంది. వారి జీవితాల్లో చీకట్లు అలముకుంటాయి. ఇటువంటి పరిస్థితి ఏ ఒక్క తెలుగుదేశం కార్యకర్తకూ ఎదురు కాకూడదనే సంకల్పంతో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధానకార్యదర్శి నారా లోకేశ్ ఆలోచన చేశారు. ఆయన ఆలోచనలు కార్యరూపం దాల్చడంతో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సంక్షేమ విభాగం ఏర్పాటైంది. ఈ విభాగం ద్వారా కార్యకర్తలకు ప్రమాదబీమా పాలసీ చేసే ఓ విధానాన్ని రూపొందించారు.


 ఒక కార్యకర్త సభ్యత్వం రూపంలో కట్టే రూ.100కి మరికొంత సొమ్ము పార్టీ సంక్షేమ నిధి నుంచి జమచేసి కార్యకర్తలందరికీ ప్రమాదబీమా సౌకర్యం కల్పించారు. 2015లో ప్రారంభమైన టీడీపీ కార్యకర్తల ప్రమాదబీమా నుంచి ఇప్పటివరకూ వేర్వేరు ప్రమాదాల్లో మరణించిన  4 వేల మంది కార్యకర్తల కుటుంబాలకు ఒక్కొక్కరికీ రూ.2 లక్షల చొప్పున ఇప్పటివరకూ రూ.80 కోట్లు ప్రమాద బీమా పరిహారాన్ని అందించారు. కార్యకర్తల సంక్షేమం కోసం తెలుగుదేశం పార్టీ మాదిరిగా ప్రత్యేకంగా సంక్షేమ విభాగాన్ని నెలకొల్పి దాన్ని పద్ధతి ప్రకారం నడిపిస్తున్న దాఖలాలు లేవు. 
 
బీమా పొందాలంటే చేయాల్సిందిలా..
జెండా మోసే కార్యకర్తలకు అండగా ఉండటం తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు అన్న నందమూరి తారకరామారావు నుంచి వస్తున్న ఆనవాయితీ. కాలానుగుణంగా టీడీపీ కార్యకర్తలకు సంక్షేమ విభాగం ద్వారా సేవలు అందించేందుకు తానే కన్వీనర్ గా నారా లోకేశ్ పటిష్టమైన యంత్రాంగం ఏర్పాటు చేశారు. ఈ విధానం ద్వారా కార్యకర్త రూ.100 చెల్లిస్తే మిగిలిన బీమా ప్రీమియంను పార్టీ సంక్షేమ విభాగం నుంచి చెల్లిస్తారు. ప్రముఖ బీమా కంపెనీల వద్ద ఈ ఇన్సూరెన్స్ పాలసీలు చేస్తారు. సభ్యత్వం ఉన్న టీడీపీ కార్యకర్త ఏదైనా ప్రమాదం జరిగి మరణించినా ఆ సమాచారం వారంలోగా తెలుగుదేశం పార్టీ సంక్షేమవిభాగం నెంబర్ 7306299999 ఫోన్ చేసి తెలియజేయాల్సి ఉంది. అలాగే మరణించిన వ్యక్తి కుటుంబం బీమా పొందేందుకు ప్రమాదానికి సంబంధించి ఎఫ్ఐఆర్ కాపీ/ఫిర్యాదు లేఖ/పోస్టుమార్టం రిపోర్టు/ డెత్ సర్టిఫికెట్ (ఈ పత్రాలన్నింటిపైనా సంబంధిత స్టేషన్ ఎస్ఐ సంతకం స్టాంపుతో ఉండాలి) కుటుంబ ధ్రువీకరణ పత్రం, ఆధార్ కార్డు, ఓటర్ ఐటీ, రేషన్ కార్డు, 4 పాస్ పోర్టు సైజ్ ఫోటోలు నెలరోజుల్లోనే అందజేయాల్సి ఉంది. ప్రమాదంలో మరణించిన వ్యక్తి నామినీకి సంబంధించిన ఆధార్ కార్డు, ఓటరు గుర్తింపు కార్డు, బ్యాంకు అక్కౌంట్, 4 పాస్ పోర్ట్ సైజ్ ఫోటోలు తెలుగుదేశం పార్టీ రాష్ర్ట కార్యాలయంలోని కార్యకర్తల సంక్షేమ విభాగానికి అందజేయాల్సి ఉంటుంది.