దుకాణాలు యధాతథం... వసూళ్లేమో 'జే'ట్యాక్స్‌ ప్రకారం

తేది 03-10-2019


 


   దుకాణాలు యధాతథం... వసూళ్లేమో 'జే'ట్యాక్స్‌ ప్రకారం


గుంటూరు అక్టోబర్ 3 (అంతిమ తీర్పు):
- 20 శాతం తగ్గిస్తే, 2,800 దుకాణాలు మాత్రమే ఉండాలి.


- నూతనపాలసీ పేరుతో ప్రభుత్వం గుడులు, బడులు ఇళ్లమధ్యన విచ్చలవిడిగా  మద్యంషాపులు పెట్టింది.  


 - శ్రీ కొల్లు రవీంద్ర


మద్యాన్ని నిషేధించాం, మహిళలను సంతోషపెట్టామంటూ ప్రగల్భాలు పలుకుతున్న రాష్ట్ర ప్రభుత్వం ఒక్క మద్యం దుకాణం కూడా తీసివేయకపోగా, మద్యం ధరలు ఇష్టాను సారం పెంచేసి 'జే' ట్యాక్స్‌ రూపంలో నూతనమద్యం విధానంతో యథేచ్ఛగా దోపిడీకి తెరతీసిందని మాజీమంత్రి కొల్లురవీంద్ర తెలిపారు. గురువారం ఆయన పార్టీరాష్ట్ర కార్యాలయంలో విలేరులతో మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా మద్యం షాపులను 3,500 లకే పరిమితం చేశామంటున్న ప్రభుత్వం, వాస్తవానికి ఉన్న షాపుల్లో రెన్యువల్‌ అవగా   ఎన్నిదుకాణాలుంటాయో సమాధానం చెప్పాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 4380 దుకాణాలుంటే, ఏటా రెన్యువల్‌ అయ్యి, 3,600 మాత్రమే రన్నింగ్‌లో ఉంటాయన్నారు. 20శాతం షాపులను తగ్గించామంటున్న ప్రభుత్వం, నిజంగా ఆ పనిచేసుంటే  దుకాణాల సంఖ్య 2,800కే పరిమితం కావాల్సి ఉందని రవీంద్ర చెప్పారు. ఇవన్నీ పరిశీలిస్తే ప్రభుత్వం ఒక్క దుకాణాన్ని తగ్గించకపోగా, గతంలో ఉన్నవాటిని యధాతథంగా కొనసాగిస్తూ, కొన్ని కంపెనీల బ్రాండ్లపై ధరలను రెండు, మూడురెట్లు పెంచేసి ప్రజల నుంచి పెద్దఎత్తున వసూళ్లు చేస్తోందని మాజీమంత్రి పేర్కొన్నారు. మద్యం దుకాణాల ఏర్పాటుతో ప్రభుత్వ అధికారులను సేల్స్‌మెన్స్‌గా మార్చేసిన ఘనత జగన్‌సర్కారుకే దక్కిందన్న ఆయన, కొన్ని మద్యం బ్రాండ్లపై ధరలు పెంచేసి, డిస్టిలరీల నుంచి పెద్దఎత్తున దాదాపు రూ.2,000 కోట్లవరకు ప్రభుత్వం దోచుకుంటోందని స్పష్టంచేశారు. రోజువారీ కూలీలు, సామాన్యులు తాగేమద్యంపై ధరలు  పెంచిన ప్రభుత్వం, ధనవంతులు తాగే  బ్రాండ్లను మాత్రం వదిలేసిందన్నారు. చీప్‌లిక్కర్‌, ఇతర తక్కువస్థాయి మద్యం రూ.50కే అమ్మాల్సి ఉండగా, దాన్ని రూ.80కి రూ.20 ట్యాక్స్‌ కలిపి రూ.100ల వరకు వసూలు చేస్తున్నారని, ధనవంతులు తాగే మద్యం బ్రాండ్లపై తక్కువట్యాక్స్‌లు విధించి అరకొరగా వసూలు చేయడమేనా ప్రభుత్వ తీసుకొచ్చిన నూతన విధానమని రవీంద్ర ప్రశ్నించారు.  మద్యం దుకాణాల ఏర్పాటులో కూడా ప్రభుత్వం బరితెగించి వ్యవహరించిందని, వైసీపీ నేతలు చెప్పినచోట, వారు చెప్పినట్లే అద్దెధరలు నిర్ణయించడం జరిగిందన్నారు. రూ.5 నుంచి రూ.10వేలు అద్దెలు చెల్లించే దుకాణాలకు, రూ.80వేలకు పైగా అద్దెలు నిర్ణయించిన ప్రభుత్వం, ఆ మొత్తాన్ని 'జే' ట్యాక్స్‌ రూపంలో వైసీపీ నేతలకే దోచిపెడుతోంద ని కొల్లు మండిపడ్డారు. విచ్చలవిడిగా ఎక్కడపడితే అక్కడ గుడి-బడి అనే వ్యత్యాసం లేకుండా రాష్ట్రవ్యాప్తంగా దుకాణాలు ఏర్పాటుచేసిన ప్రభుత్వం, మహిళలకు ఎలాంటి మేలు చేసిందో సమాధానం చెప్పాలన్నారు. ఇళ్లు, గుడులు-బడులు ఉన్న ప్రదేశాల్లో దుకాణాలు వద్దని పెద్దఎత్తున మహిళలు ఆందోళనలు చేస్తుంటే, పోలీసులు సాయంతో వారిని భయభ్రాంతులకు గురిచేస్తూ దుకాణాల నిర్వహణకు పూనుకోవడం ఎంతమాత్రం   సమర్థనీయం కాదని రవీంద్ర తేల్చిచెప్పారు. మాటతప్పను మడమ తిప్పనని చెప్పిన జగన్‌, నూతన మద్యం పాలసీపేరుతో మహిళల మానప్రాణాలను పణంగా పెట్టి, మద్యం వ్యాపారం చేస్తున్నాడని మాజీమంత్రి మండిపడ్డారు.