రాష్ట్రంలో సీపెట్‌–సీఎస్‌టీఎస్‌ ఏర్పాటు ఎంతో సంతోషకరం

అక్టోబరు 24, 2019
సూరంపల్లి, కృష్ణా జిల్లా 


రాష్ట్రంలో సీపెట్‌–సీఎస్‌టీఎస్‌ ఏర్పాటు ఎంతో సంతోషకరం
ఇందుకు సీఎం అందించిన సహకారం చాలా అభినందనీయం
సీఎం శ్రీ వైయస్‌ జగన్‌తో ఈ వేదిక పంచుకోవడం ఆనందకరం
కేంద్ర ఎరువులు, రసాయన శాఖ మంత్రి శ్రీ డీవీ సదానందగౌడ
కృష్ణా జిల్లా సూరంపల్లిలో సీపెట్‌ ప్రారంభించిన కేంద్ర మంత్రి
నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పనకు అత్యధిక ప్రాధాన్యం
అందుకే పరిశ్రమల్లో స్థానికులకు 75 శాతం ఉద్యోగాల కోసం చట్టం
దేశంలోనే తొలిసారిగా రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రక్రియకు శ్రీకారం
ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వెల్లడి
ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో ఒక స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌
ఆ విధంగా పరిశ్రమల అవసరాలూ తీరుస్తాం. వారికీ పూర్తి సహకారం
సూరంపల్లి సీపెట్‌–సీఎస్‌టీఎస్‌ ప్రారంభంలో సీఎం శ్రీ వైయస్‌ జగన్‌


 రాష్ట్రంలో 'సెంట్రల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ప్లాస్టిక్స్‌ ఇంజనీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ', 'సెంటర్‌ స్కిల్లింగ్‌ అండ్‌ టెక్నికల్‌ సపోర్ట్‌' (సీపెట్‌–సీఎస్‌టీఎస్‌) ను ప్రారంభించడం ఎంతో సంతోషకరంగా ఉందని కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ మంత్రి శ్రీ డీవీ సదానందగౌడ అన్నారు. ఇందుకు సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ అందించిన సహకారం చాలా అభినందనీయమని ఆయన పేర్కొన్నారు. ఏపీ సీఎంతో ఈ వేదిక పంచుకోవడం చాలా ఆనందంగా ఉందని చెప్పారు. 
 నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తోందని, ఆ దిశలోనే పరిశ్రమల్లో స్థానికులకు 75 శాతం ఉద్యోగాలు ఇచ్చేలా ఒక చట్టం చేశామని ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వెల్లడించారు. దేశంలోనే తొలిసారిగా ఈ ప్రక్రియకు శ్రీకారం చుట్టామని ఆయన తెలిపారు. ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో ఒక స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ ఏర్పాటు చేసి యువతకు శిక్షణనిస్తామని, ఆ విధంగా పరిశ్రమల అవసరాలూ తీరుస్తామని, వారికీ పూర్తిగా సహకారం అందిస్తామని సీఎం చెప్పారు.  
 కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం, సూరంపల్లిలో 'సెంట్రల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ప్లాస్టిక్స్‌ ఇంజనీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ', 'సెంటర్‌ స్కిల్లింగ్‌ అండ్‌ టెక్నికల్‌ సపోర్ట్‌' (సీపెట్‌–సీఎస్‌టీఎస్‌) నూతన భవన సముదాయాన్ని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో కలిసి కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ మంత్రి శ్రీ డీవీ సదానందగౌడ గురువారం ప్రారంభించారు.
 రూ.50 కోట్ల వ్యయంతో, 12 ఎకరాల్లో సంస్థను ఏర్పాటు చేయగా, అందులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెరి రూ.25 కోట్లు చొప్పున భరించాయి. సంస్థను ప్రారంభించిన అనంతరం అక్కడ ఒక మొక్క నాటిన కేంద్ర మంత్రి శ్రీ డీవీ సదానందగౌడ, ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌ జగన్‌ ఆ తర్వాత ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రదర్శనను తిలకించారు.
సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ సహకారం అభినందనీయం
 'అందరికీ నమస్కారం' అంటూ తెలుగులో ప్రసంగం ప్రారంభించిన కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ మంత్రి శ్రీ డీవీ సదానందగౌడ అందరినీ ఆకట్టుకున్నారు. రాష్ట్రంలో సీపెట్‌–సీఎస్‌టీఎస్‌ ఏర్పాటు చేసినందుకు ఎంతో సంతోషిస్తున్నానని, సంస్థ ఏర్పాటులో సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ సహకారం ఎంతో అభినందనీయమని ఆయన పేర్కొన్నారు. ఏపీ సీఎంతో కలిసి ఈ వేదిక పంచుకోవడం ఎంతో ఆనందంగా ఉందని చెప్పారు.
యువత మన బలం
 ప్రపంచ వ్యాప్తంగా మన దేశంలోనే యువత ఎక్కువ అని కేంద్ర మంత్రి తెలిపారు. దేశంలో 65 శాతం మంది యువత 35 ఏళ్ల లోపు వారేనని ఆయన చెప్పారు. 2025 నాటికి వారి సంఖ్య 173 మిలియన్లకు చేరుకోనుందన్న ఆయన, ఈ నేపథ్యంలో దేశంలో యువత ప్రాధాన్యం ఏ స్థాయిలో ఉందో అర్ధం అవుతోందని అన్నారు. వారికి ఉపాధి కల్పన ద్వారా దేశం ఎంతో అభివృద్ధి చెందుతుందని, ప్రపంచంలోనే నెంబర్‌ వన్‌గా నిలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
కెమికల్‌ ఇండస్ట్రీకి ఉజ్వల భవిష్యతు
 దేశంలో ప్రస్తుతం కెమికల్‌ ఇండస్ట్రీ విలువ 163 యూఎస్‌ బిలియన్‌ డాలర్లు అని కేంద్ర మంత్రి శ్రీ డీవీ సదానందగౌడ తెలిపారు. ఇది నానాటికీ పురోగమిస్తోందని, 9.3 శాతం అభివృద్ధితో 2025 నాటికి ఈ రంగం 304 బిలియన్‌ డాలర్లకు చేరుకోనుందని వెల్లడించారు. కెమికల్‌ ఇండస్ట్రీకి దేశంలో ఎంతో ఉజ్వల భవిష్యత్తు ఉందని చెప్పారు.
'సీపెట్‌'లకు ప్రాధాన్యం 
 ఈ నేపథ్యంలో దేశంలో ప్రతి చోటా సీపెట్‌లు ఏర్పాటుకు ప్రాధాన్యం ఇస్తున్నామని కేంద్ర మంత్రి వెల్లడించారు. ఇప్పటికే దేశంలో 37 'సీపెట్‌' లు ఉండగా, త్వరలో మరో 5 ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఈనెల 31న కేరళలోని కొచ్చిన్‌లో ఆ సంస్థను జాతికి అంకితం ఇవ్వబోతున్నామని చెప్పారు.
 ప్లాస్టిక్‌ టెక్నాలజీలో డిగ్రీ, డిప్లొమా కోర్సులతో పాటు, స్కిల్‌ డెవలప్‌మెంట్‌లో కూడా శిక్షణ ఇస్తున్నామని, ఏపీలో ఏర్పాటు చేసిన సంస్థలో కూడా 1500 మంది శిక్షణ పొందనున్నారని శ్రీ డీవీ సదానందగౌడ పేర్కొన్నారు. 
 జీవితంలో ప్లాస్టిక్‌ ఒక భాగంలా మారిపోయిందని, దీంతో కాలుష్య సమస్య కూడా తీవ్రమైందని, దీన్ని నివారించాల్సి ఉందని చెప్పారు. అందుకు పరిశోధనలు కొనసాగాలని, ప్లాస్టిక్‌ రీసైక్లింగ్‌ జరగాలని అన్నారు. 
నాయుడుపేటలో మరో సీపెట్‌
 ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌ జగన్‌ అభ్యర్ధన మేరకు రాష్ట్రానికి మరో సీపెట్‌ కేటాయిస్తున్నామని, నెల్లూరు జిల్లా నాయుడుపేటలో సంస్థను ఏర్పాటు చేస్తామని కేంద్ర మంత్రి శ్రీ డీవీ సదానందగౌడ ప్రకటించారు. 
యువత ఉపాధి కల్పనకు అధిక ప్రాధాన్యం 
 సీపెట్‌–సీఎస్‌టీఎస్‌లో శిక్షణ పొందిన వారికి మరింత త్వరగా ఉద్యోగాలు లభిస్తాయని ఆశిస్తూ సూరంపల్లిలో సంస్థను ఏర్పాటు చేశామని ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌ జగన్‌ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 25 పార్లమెంటు నియోజకవర్గాలలో స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్లు ప్రారంభించబోతున్నామని ఆయన వెల్లడించారు. దేశంలో ఎక్కడా జరగని విధంగా మన రాష్ట్రంలో పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగాలు స్థానికులకు ఇవ్వాలని చట్టం చేశామని, యువతకు ఉద్యోగ అవకాశాలు మెరుగుపర్చేందుకే ఆ చట్టం చేశామని చెప్పారు.
పరిశ్రమలకూ సహకారం
 దీంతో తమ బాధ్యత కూడా పెరిగిందని, అందుకే పారిశ్రామిక వర్గాల అవసరాలు తీర్చే విధంగా స్కిల్‌నెస్‌ పెంచి, యువతను సిద్ధం చేస్తున్నామని సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ తెలిపారు. మరోవైపు పరిశ్రమలకూ పూర్తి సహకారం అందిస్తున్నామన్న ఆయన, ఆ దిశలోనే 25 పార్లమెంటు నియోజకవర్గాలలో స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నామని మరోసారి చెప్పారు. ఈ ప్రక్రియలో అవసరమైన సహకారం అందించాలని కేంద్రాన్ని కోరారు. 
 మంత్రులు శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, శ్రీ మేకపాటి గౌతమ్‌రెడ్డి, శ్రీ వెల్లంపల్లి శ్రీనివాస్, మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి, ప్రభుత్వ విప్‌ శ్రీ సామినేని ఉదయభాను, ఎమ్మెల్యేలు శ్రీ కె.పార్థసారథి, శ్రీ మల్లాది విష్ణు, శ్రీ రక్షణనిధి, శ్రీ ఎం.జగన్మోహన్‌రావు, శ్రీ కైలా అనిల్‌కుమార్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యంతో పాటు, పలువురు అధికారులు, అనధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.


Popular posts
విజయవాడలో కొత్త ట్రాపిక్ సిగ్నల్ వ్యవస్థ
*శాంతి భద్రతల పరిరక్షణ కోసం అందరం కృషి చేద్దాం..* నూతన సి.ఐ శ్రీనివాసరావు... ఉదయగిరి, జూలై 31 (అంతిమ తీర్పు-ఇంచార్జ్ దయాకర్ రెడ్డి): ప్రజలందరూ కూడా ప్రశాంత వాతావరణములో జీవన ప్రమాణాలు కలిగి ఉండే విధంగా అందరం శాంతి భద్రతల పరిరక్షణ దిశగా ముందుకు సాగుదామని ఉదయగిరి నియోజకవర్గంలోని కలిగిరి నూతన సి.ఐగా భాద్యతలు చేపట్టిన జి.ఎల్.శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. గత సి.ఐ రవికిరణ్ స్థానంలో శ్రీనివాసరావు నియామకం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కలిగిరి, వింజమూరు, కొండాపురం మండలాలలో శాంతి భద్రతల పరిరక్షణకు ప్రజల భాగస్వామ్యంతో నిర్విరామంగా కృషి చేయనున్నామన్నారు. అసాంఘిక కార్యకలాపాలను ఉపేక్షించేది లేదన్నారు. అక్రమ మద్యం విక్రయాలు, బెల్టు షాపులు, పేకాట, కోడి పందేలు, నిషేదిత గుట్కా విక్రయాలపై ఉక్కుపాదం మోపనున్నామని సి.ఐ శ్రీనివాసరావు స్పష్టం చేశారు. ప్రస్తుతం ఎటు చూసినా కరోనా వైరస్ విస్తరిస్తున్నందున ప్రజలందరూ కూడా కోవిడ్-19 నిబంధనలకు అనుగుణంగా నడుచుకోవాలన్నారు. ప్రభుత్వాలు ప్రజల సం రక్షణ కోసమే పనిచేస్తాయనే విషయమును ప్రతి ఒక్కరూ గుర్తించుకోవాలన్నారు. కంటైన్మెంట్ జోన్లులో అధికారుల సూచనలు, సలహాలు పాటిస్తూ కరోనా వైరస్ నియంత్రణ దిశగా తగు జాగ్రత్తలు వహించాలని ఈ సందర్భంగా సి.ఐ శ్రీనివాసరావు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
Image
ఆర్టీసీలో 1000 ఎలక్ట్రిక్‌ బస్సులు
శ్రీశైలం ప్రాజెక్ట్ నీటి ఉదృతి
జర్నలిస్టుల అక్రిడిటేషన్లు పొడిగింపునకు డి.ఎం.ఎ.సి. సమావేశం