అర్చకుల  పరీక్ష ఫలితాలు విడుదల :దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి


తేది : 24.10.2019
అమరావతి


అర్చకుల  పరీక్ష ఫలితాలు విడుదల


దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు


అమరావతి, అక్టోబర్ 24 : రాష్ట్ర దేవదాయ ధర్మదాయ శాఖ ఆధ్వర్యంలో ఇటీవల అర్చకుల (ఆగమ) కోర్సులకు సంబంధించిన అర్చక పరీక్షా ఫలితాలను గురువారం  దేవదాయ ధర్మదాయ శాఖ  మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ విడుదల చేశారు. ఈ సందర్భంగా  వెలగపూడి సచివాలయంలోని రెండవ బ్లాక్ మంత్రి తన ఛాంబర్ లో మీడియాతో మాట్లాడుతూ, 2013 వ సంవత్సరం నుంచి అర్చకుల (ఆగమ)  పరీక్షలను ఏ ప్రభుత్వాలు నిర్వహించలేదన్నారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా అర్చకులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడంతో పాటు వారి జీవితాల్లో  వెలుగులు నింపేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. ఈ క్రమంలోనే 2019 జులై 13,14 తేదీల్లో దేవదాయ ధర్మదాయ శాఖ ఆధ్వర్యంలో అర్చకులకు ప్రవేశ, వర, ప్రవర ఆగమ పరీక్షలను నిర్వహించామని వెల్లడించారు. ఈ సందర్భంగా ఆగమ పరీక్షలకు సంబంధించిన ఫలితాలను మంత్రి వెలంపల్లి శ్రీనివాస్, డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి, విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణులతో కలిసి విడుదల చేశారు. ఆగమ పరీక్షలకు 5,176 మంది హాజరయ్యారన్నారు. వీరిలో మొత్తం 4,396 మంది ఉత్తీర్ణత సాధించినట్లు మంత్రి వెల్లడించారు. ప్రథమ శ్రేణిలో 2 వేల మంది, ద్వితీయ శ్రేణిలో 1,156 మంది, తృతీయ శ్రేణిలో 247, మౌఖిక మరియు ప్రయోగ పరీక్షల్లో 993 మంది ఉత్తీర్ణత సాధించారని మంత్రి ప్రకటించారు. 743 మంది పరీక్షల్లో ఫెయిల్ అయ్యారన్నారు. 37 మంది వేరొకరి సహాయంతో పరీక్షలకు హాజరయిన వారిలో ఉన్నారు. మొత్తంగా 84.93 ఉత్తీర్ణత శాతంగా ఉందని మంత్రి తెలిపారు. రీకౌంటింగ్ కోసం దరఖాస్తు చేసుకోవాల్సిన అభ్యర్థులు 25.11.2019 తేదీ లోపు కమిషనర్, దేవదాయ శాఖ కార్యాలయానికి 200 రూపాయల డీడీని జతపరిచి వివరాలను పంపాలని సూచించారు. పరీక్షల్లో తప్పిన వారికి సప్లమెంటరీ పరీక్ష తొలిసారి ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. పరీక్షల్లో తప్పినవారికి ఎటువంటి అనుమానాలు ఉన్నా అభ్యర్థుల కోరిక వెరిఫికేషన్ కు అవకాశం కల్పిస్తున్నామని మంత్రి ప్రకటించారు. అర్చకుల అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కట్టుబడి ఉన్నారన్నదానికి పరీక్షల నిర్వహణే నిదర్శమన్నారు.  అర్చకుల (ఆగమ)  పరీక్షలు నిర్వహించడం ద్వారా వారికి ఉపాధి అవకాశాలు మెరుగవుతాయన్నారు. అర్చకుల ఉద్యోగ కల్పనకు ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. అదే విధంగా అర్చకుల వంశపారపర్య పురోహితం కోసం ప్రత్యేక జీవోని అందించడం జరిగిందన్నారు.  రాష్ట్రవ్యాప్తంగా దేవదాయ ధర్మదాయ శాఖలో కొన్ని చోట్ల రెవెన్యూ ఉద్యోగులు డిప్యుటేషన్ పై పనిచేయడం, దేవదాయ శాఖ ఉద్యోగులకు పదోన్నతులు వంటి సమస్యలు ఉన్నాయని వాటిని త్వరలో పరిష్కరించడం జరుగుతుందని మంత్రి ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు..


డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి మాట్లాడుతూ, చాలా కాలంగా అర్చకుల సమస్యలు పరిష్కారానికి నోచుకోక ఇబ్బందులు పడుతున్న విషయం తమ దృష్టికి వచ్చిందన్నారు. దీనిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పందించి దేవదాయ ధర్మదాయ శాఖ ద్వారా ఇటీవల వంశపారపర్య అర్చకత్వ జీవోను విడుదల చేయడం శుభపరిణామమన్నారు. గత మూడేళ్లుగా తాము ఎక్కడికి వెళ్లినా అర్చకులు తమ సమస్యలను పరిష్కరించాలని కోరిన విషయాన్ని గుర్తుచేశారు. అర్చక (ఆగమ) పరీక్షలు నిర్వహించడం ద్వారా  అర్చకులకు రాష్ట్రంలో ఉద్యోగాలు, ఉపాధి, విదేశాల్లో ఉద్యోగాలు పొందే అవకాశం ఉందన్నారు.


విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన రెండునెలల్లోనే తొలిసారిగా అర్చకుల పరీక్ష నిర్వహించి ఫలితాలు విడుదల చేయడం అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా దేవదాయ ధర్మదాయ శాఖ అర్చక (ఆగమ) పరీక్షలను నిర్వహించి ఉత్తీర్ణత సాధించిన వారికి గుర్తింపు పట్టాను అందజేస్తుందన్నారు. తద్వారా అర్చకుల జీవితాల్లో ప్రభుత్వం మనోధైర్యం నింపిందన్నారు. గత ప్రభుత్వం అర్చకుల సమస్యలను విడనాడటం దురదృష్టకరమని మల్లాది విష్ణు ఆవేదన వ్యక్తం చేశారు. పరీక్షల్లో ఉత్తీర్ణులైన అర్చక అభ్యర్థుల వివరాలను https://tms.ap.gov.in వెబ్ సైట్ ద్వారా తెలుసుకోవచ్చన్నారు.


దేవదాయ ధర్మదాయ శాఖ కమిషనర్ పద్మ మాట్లాడుతూ, అర్చకుల (ఆగమ)  పరీక్షలను ప్రభుత్వ ఆదేశాల మేరకు పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించామన్నారు. 25.11.2019 తేదీ అనంతరం వచ్చే అభ్యర్థనలు పరిశీలించబడవని కమిషనర్ పేర్కొన్నారు. జవాబు పత్రాలను పరిశీలించి ఫలితాన్ని వారికి పోస్టులో పంపనున్నట్లు ఆమె తెలిపారు.


కార్యక్రమంలో రాష్ట్ర అర్చక సమాఖ్య అధ్యక్షులు కామేశ్ శర్మ పాల్గొన్నారు.