అమెరికన్ కాన్సుల్ జనరల్ జోయల్ ఆర్ రీఫ్ మెన్ తో గవర్నర్ బిశ్వభూషన్

నూతన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ కు సహకరించండి
అమెరికన్ కాన్సుల్ జనరల్ జోయల్ ఆర్ రీఫ్ మెన్ తో గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్


నూతనంగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆర్ధికంగా, పారిశ్రామికంగా అభివృద్ది చెందేందుకు అవసరమైన తోడ్పాటును అందించాలని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ మాన్యశ్రీ బిశ్వభూషన్ హరిచందన్ అమెరికన్ కాన్సుల్ జనరల్ జోయల్ ఆర్ రీఫ్ మెన్ ను కోరారు. ప్రగతి కాముక ముఖ్యమంత్రి ఇక్కడ పనిచేస్తున్నారని, తగిన సహకారం అందిస్తే మంచి అభివృద్ధి ని సాధించగలుగుతారని వివరించారు.  అమెరికన్ కాన్సుల్ జనరల్ రీఫ్ మెన్, ఇతర కాన్సుల్ సభ్యులు బుధవారం రాజ్ భవన్ లో గౌరవ బిశ్వ భూషన్ హరిచందన్ ను మర్యాద పూర్వకంగా కలిసారు. వీరిరువురి మధ్య విభిన్న అంశాలు చర్చకు వచ్చాయి. ప్రధానంగా రీఫ్ మెన్ గవర్నర్ తో మాట్లాడుతూ, తాను ఏవిధంగానైనా సహకరించగలనా అని విన్నవించగా, ఈ రాష్ట్రానికి చేయగలిగిన సహాయం ఏదైనా ఉంటే చేయాలని గవర్నర్ తెలిపారు. 
రాష్ట విభజన తరువాత ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ అభివృద్ది చెందవలసి ఉందని అందుకు సహకరించాలని కోరారు. అమెరికా, భారత్ మధ్య మంచి సంబంధాలు ఉన్నాయని, ఆ క్రమంలోనే విశాఖ స్మార్ట్ సిటి ఏర్పాటులో తమ భాగస్వామ్యం ఉందని, తాను మంగళవారమే విశాఖపట్నంను సందర్శించానని నిధులు సద్వినియోగం అవుతున్నాయని కాన్సుల్ జనరల్ వివరించారు. అమెరికన్ కంపెనీలలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఓరిస్సా ప్రాంతాలకు చెందిన వారే గణనీయంగా విధులు నిర్వహిస్తున్నారని, మరింతగా వారికి అవకాశాలు వచ్చేలా చూస్తామని తెలిపారు. అమెరికా, ఇండియాలలోని గవర్నర్ వ్యవస్ధలపై వీరిరువురి మధ్య ఆసక్తికర చర్చ నడించింది. 
విశాఖలో అమెరికా, ఇండియా నావికాదళం ఇచ్చి పుచ్చుకునే ధోరణిలో సంయిక్తంగా పలు కార్యక్రమాలు నిర్వహించాయని ఇందుకోసం యుఎస్ నుండి భారీ నౌక కూడా విశాఖ వచ్చివెళ్లిందని రీఫ్ మెన్ గవర్నర్ కు దృష్టికి తీసుకువచ్చారు. ఇటు ఆంధ్రప్రదేశ్, అటు ఒరిస్సాల నుండి అమెరికా లో స్ధిరపడిన వారి యోగ క్షేమాలపై వీరిరువురు కొద్దిసేపు సమాలోచించారు. వీరిరువురి భేటీ నేపధ్యంలో గవర్నర్ తెలుగు సాంప్రదాయాన్ని అనుసరించి రీఫ్ మెన్ ను శాలువాతో ఘనంగా సత్కరించారు. గవర్నర్ కు అమెరికన్ కాన్సుల్ జనరల్ మెమొంటోను బహుకరించారు  కార్యక్రమంలో గవర్నర్ వారి కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా, సంయిక్త కార్యదర్శి అర్జున రావు  పాల్గొన్నారు.