టీడీపీ హయాంలో రైతన్న ఆత్మహత్యలు, వలసలు

*రైతన్నలూ.. ధైర్యంగా వ్యవసాయం చేయండి*


*▪️చెప్పిన మాటకంటే ఎక్కువగా 'రైతు భరోసా'*


*▪️అర్హులందరికీ పెట్టుబడి సాయం అందిస్తాం*


*▪️టీడీపీ హయాంలో రైతన్న ఆత్మహత్యలు, వలసలు*


*▪️భరోసా ఇచ్చే నాయకుడు లేకే ఆ పరిస్థితి*


*▪️ఇకపై ఆ పరిస్థితులు ఉండవు*


*▪️మా ప్రభుత్వంలో అన్నదాతకు పెద్దపీట*


*▪️సీఎం జగన్‌ నాయకత్వంలో మారనున్న జిల్లా రూపురేఖలు*


*▪️అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకట రామిరెడ్డి స్పష్టీకరణ*అనంతపురం, అక్టోబర్‌ 15:


'ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వానికి మీ ఆశీర్వాదం కావాలి. ఇకపై వ్యవసాయాన్ని పండుగ చేస్తాం. వలసలు ఉండవు. రైతులు ఆత్మహత్యలు చేసుకోవాల్సిన పనిలేదు. మీరు ధైర్యంగా వ్యవసాయం చేయండి.. మీకు అండగా మేముంటాం' అని అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకట రామిరెడ్డి అన్నారు. మంగళవారం అనంతపురం ఆర్ట్స్‌ కళాశాల ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌లో 'వైఎస్‌ఆర్‌ రైతు భరోసా–పీఎం కిసాన్‌' పథకాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మాట్లాడుతూ 'రైతులకు ఈ రోజుల్లో భరోసా కావాలి. భరోసా ఇచ్చే వాళ్లు లేక ఇన్నాళ్లూ వాళ్లు బాధపడేవాళ్లు. మీ అందరి ఆశీర్వాదంతో మంచి ప్రభుత్వాన్ని అధికారంలోకి తెచ్చారు. జగన్‌ సీఎం అయితే బతుకులకు భరోసా వస్తుందని రైతులే కాకుండా అన్ని వర్గాలు భావించాయి. తప్పకుండా కులాలకు అతీతంగా పథకాలు అందిస్తాం' అని అన్నారు. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ మేనిఫెస్టోలో చెప్పిన దానికంటే రైతాంగానికి ఎక్కువ మేలు చేస్తోందని అన్నారు. పాదయాత్ర సమయంలో రైతుల కష్టాలు తెలుసుకున్న వైఎస్‌ జగన్‌.. రైతులకు పెట్టుబడి సాయం కింద రూ.12,500 ఇస్తానని చెప్పారని, ఇప్పుడు మరో రూ.1000 పెంచి రూ.13,500 అందిస్తున్నట్లు చెప్పారు. గతంలో తెలుగుదేశం పార్టీ తమ మేనిఫెస్టోలో అనేక  హామీలిచ్చి ఆ తర్వాత విస్మరించిందని విమర్శించారు. తీరా ఎన్నికల సమయంలో తూతూ మంత్రంగా పథకాలు తెచ్చారని, కానీ వైఎస్‌ జగన్‌ సీఎం అయిన తర్వాత మేనిఫెస్టోలోని అన్ని పథకాలను ప్రజల ముందుకు తీసుకొస్తున్నారన్నారు. నవరత్నాల అమలు కోసం చట్టాలు చేశారని గుర్తు చేశారు. 'రాజు బాగుంటే రాజ్యం బాగుంటుదంటారు. చంద్రబాబు హయాంలో వలసలు, రైతుల ఆత్మహత్యలు సాగాయి. అంతకుముందు వైఎస్‌ఆర్‌ హయాంలో వర్షాలు పడ్డాయి. గడిచిన ఐదేళ్లు వర్షాలు లేని అనంతపురం జల్లాలో జగన్‌ సీఎం అయ్యాక విరివిగా వర్షాలు పడుతున్నాయి. కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. మీ అందరి సహకారం, ఆశీర్వాదం ఈ ప్రభుత్వానికి ఇవ్వండి' అని కోరారు. వైఎస్‌ఆర్‌ రైతు భరోసా–పీఎం కిసాన్‌ యోజన ద్వారా రాష్ట్రంలోని ప్రతి రైతు కుటుంబానికి పెట్టుబడి సాయం కోసం రూ.13,500 ఇస్తున్నామన్నారు. ఖరీఫ్‌లో రూ.7500, రబీలో రూ.4000, సంక్రాంతి సమయంలో రూ.2 వేలు అందిస్తున్నామని తెలిపారు. అనంతపురం జిల్లా వ్యాప్తంగా 6.14 లక్షల మందికి రైతు భరోసా అందిస్తున్నామని, ఆధార్, ఇతర సాంకేతిక కారణాలతో ఇంకా కొంత మందికి రాలేదన్నారు. అర్హులందరికీ 'రైతు భరోసా' అందజేస్తామని స్పష్టం చేశారు. జిల్లాలో రైతాంగాన్ని ఆదుకునేందుకు ఏటా రూ.800 కోట్ల వరకు ఖర్చు చేయనున్నట్లు చెప్పారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ హయాంలో రైతుల్లో ఓ భరోసా ఉండేదని, అప్పట్లో వేరుశనగ రైతులకు వైఎస్‌ అండగా ఉన్నారన్నారు. వేరుశనగ పంటకు కాసులు కాయిస్తానని వైఎస్‌ చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఒక అడుగు ముందుకు వేశారన్నారు. రైతులు ధైర్యంగా పంటలు సాగు చేయాలని, మీకు అండగా వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. పంటల బీమాను ప్రభుత్వమే కడుతుందని, వడ్డీ లేని రుణాలు కూడా అందిస్తామన్నారు. ఉద్యాన పంటలపై దృష్టి సారించాలని, సబ్సిడీ అందజేస్తామన్నారు. పేదరికంలో ఉన్నామని ఎవరూ బాధపడకుండా పిల్లలకు ఉన్నత చదువులు చెప్పించాలన్నారు. అమ్మ ఒడి ద్వారా వచ్చే జనవరిలో ప్రతి తల్లికి రూ.15 వేలు అందజేయనున్నట్లు స్పష్టం చేశారు. చంద్రబాబు రుణమాఫీ పేరుతో రైతాంగాన్ని మోసం చేశారని, కానీ వైఎస్‌ జగన్‌ మాత్రం మాట తప్పకుండా చెప్పిన దానికంటే మెరుగ్గా పథకాలు తీసుకొస్తున్నారన్నారు. హంద్రీనీవా ద్వారా 3.50 లక్షల ఎకరాలకు, జిల్లాలోని అన్ని చెరువులకు నీరు అందిస్తామని తెలిపారు. 2012 నుంచి ఏటా 30 టీఎంసీలకు పైగా నీరు వస్తున్నా ఒక్క ఎకరాకు కూడా ఇవ్వలేదని విమర్శించారు. కరువు జిల్లాను సస్యశ్యామలం చేయడం కోసం వైఎస్‌ జగన్‌ కృతనిశ్ఛయంతో ఉన్నారని, ఇందులో భాగంగానే ఇటీవల 'వైఎస్‌ఆర్‌ కంటి వెలుగు' ప్రారంభానికి వచ్చి జిల్లా రూపురేఖలు మారుస్తానని మాట ఇచ్చారన్నారు. గతంలో రైతులు ఆత్మహత్య చేసుకుంటే ఆదుకునే పరిస్థితి ఉండేది కాదని, తమ ప్రభుత్వం బాధిత కుటుంబానికి రూ.7 లక్షలు అందించనున్నట్లు చెప్పారు. ఆత్మహత్యలు లేని జిల్లాగా అనంతను తయారు చేస్తామన్నారు. వ్యవసాయంలో పురుషుల కంటే మహిళల పాత్రే అధికంగా ఉంటుందని, ఈ రోజు మహిళా రైతు దినోత్సవం కావడంతో అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. మహిళా సంఘాల రుణాలను నాలుగు విడతల్లో మాఫీ చేస్తామని చెప్పారు. ప్రజలకు సత్వర సేవలు అందించడం కోసమే 'సచివాలయ వ్యవస్థ'ను తీసుకొచ్చినట్లు తెలిపారు. ఎమ్మెల్సీ గోపాల్‌రెడ్డి మాట్లాడుతూ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి రైతు సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నారన్నారు. పెట్టుబడి సాయాన్ని మూడు విడతల్లో రైతుల బ్యాంక్‌ ఖాతాల్లోకి నేరుగా వేయనున్నట్లు చెప్పారు. ప్రతి రైతూ ఆనందంగా ఉండాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. అనంతరం అర్బన్‌ నియోజకవర్గ పరిధిలోని 8120 రైతు కుటుంబాలకు రూ.10 కోట్ల 90 లక్షల రూపాయల మెగా చెక్‌ను ఎమ్మెల్యే అనంత, ఎమ్మెల్సీ గోపాల్‌రెడ్డి పంపిణీ చేశారు. మహిళా రైతు దినోత్సవం సందర్భంగా పలువురు మహిళా రైతులకు ప్రశంసాపత్రాలు, జ్ఞాపికలు అందజేశారు. ఎస్సీ, ఎస్టీ కౌలు రైతులకు ధ్రువీకరణ పత్రాలు పంపిణీ చేశారు. అంతకుముందు మైదానంలో ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను వారు పరిశీలించారు. కార్యక్రమంలో రెడ్డిపల్లి వ్యవసాయ క్షేత్రం శాస్త్రవేత్త భార్గవి, వ్యవసాయశాఖ సహాయ సంచాలకులు గురుమూర్తి, ఏఓ వెంకటేశ్వర ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.