ఇవాళ ఈ దేశం మొత్తం ఎవరీ నాయకుడు, ఏమీటీ ధైర్యం అని ఒక నాయకుడు వైపు తిరిగి చూస్తోందని

*15,10.2019*
*అమరావతి*


*నెల్లూరు జిల్లా కాకుటూరులో రైతుభరోసా కార్యక్రమం ప్రారంభం సందర్భంగా వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ కురసాల కన్నబాబు ప్రసంగం*


రైతు భరోసా కార్యక్రమంతో ఇవాళ ఈ దేశం మొత్తం ఎవరీ నాయకుడు, ఏమీటీ ధైర్యం అని ఒక నాయకుడు వైపు తిరిగి చూస్తోందని.. ఆ నాయకుడే మన ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌ జగన్మోహన్‌ రెడ్డి అని వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ కురసాల కన్నబాబు అన్నారు.


 నెల్లూరు జిల్లా కాకుటూరులో రైతు భరోసా కార్యక్రమం ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరైన శ్రీ కన్నబాబు గారి ప్రసంగం.... ఈ రోజు మనమే కాదు జగనన్నను చూస్తే ప్రకృతే పులకరిస్తోందని ఆయన ప్రశంసించారు. సీఎం శ్రీ జగన్మోహన్‌ రెడ్డి అడుగు పెడుతూనే తిరుపతిలో వర్షం, నెల్లూరు జిల్లాలో అడుగు పెట్టిన వెంటనే ఇక్కడా వర్షం పడుతోందని, ప్రకృతే పులకరిస్తోందంటే ఇంత కన్నా పాజిటివ్‌ సంకేతాలు ఇంకేం ఉంటాయన్నారు. 


ఈ రోజు ఈ రాష్ట్ర చరిత్రలో సువర్ణాధ్యాయంగా లిఖించదగ్గ రోజని.. ఈ రోజు  చరిత్రలో నిల్చిపోతుందని చెప్పారు.


 ఎందుకంటే దేశంలో ఏ
ముఖ్యమంత్రి చేయని విధంగా రైతులకు పెట్టుబడి సాయం అందించాలని, ఒక్క రోజులో లక్షలాది మంది రైతుల అకౌంట్లలో వేల కోట్ల రూపాయలు పెట్టుబడి సాయాన్ని ఆయన ప్రారంభించారన్నారు.


 కచ్చితంగా ఇదో  చరిత్రని.... ఈ దేశంలో కౌలురైతులకు ఎప్పుడూ, ఎవరూ పెట్టుబడి సాయం కాదుకదా... ఏ ఒక్క సాయం అందించలేదన్నారు.  కౌలు రైతులకు పెట్టుబడి సాయంతో పాటు వారిని వ్యవసాయదారులగా గుర్తించి ఇతర సాయాలు అందిస్తున్న మొట్టమొదట ముఖ్యమంత్రిగా శ్రీ జగన్మోహన్‌ రెడ్డి గారు నిల్చిపోతున్నారని స్పష్టం చేశారు.


 గత ముఖ్యమంత్రులు తమను విదేశీ నేతలతో పోల్చుకుటూ, చాలా గొప్ప సీఈఓ అని పేరు తెచ్చుకోవాలనుకునేవారని, కానీ మన ముఖ్యమంత్రి రైతుల గుండెల్లో స్ధానం సంపాదించుకోవాలి, రైతుల కళ్లల్లో నేను ఆనందం చూడాలని అని తపనపడే  ముఖ్యమంత్రి అని అన్నారు.


 ఈ రోజున దాదాపు 54 లక్షల కుటుంబాలకు వైయస్‌.ఆర్‌. రైతు భరోసా కార్యక్రమం క్రింద పెట్టుబడి సాయం అందించే కార్యక్రమం ప్రారంభించడం ఆనందంగా ఉందని చెప్పారు. కౌలు రైతులకూ పెట్టుబడి సాయం అందిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు.


 వ్యవసాయ మిషన్‌ మీటింగ్‌ను సీఎం  ప్రతీనెల క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నారని, నిన్న జరిగిన సమావేశంలో వ్యవసాయమిషన్‌ వైస్‌ ఛైర్మన్, ఆర్డీటీ సంస్ధ నిర్వాహకులు మల్లారెడ్డితో పాటు మంత్రులందరం కలిసి ముఖ్యమంత్రి గారికి  చేసిన  విజ్ఞప్తిని గుర్తు చేశారు.  ఒకేసారి ఖరీప్‌లో పెట్టుబడి సాయం వేస్తున్నాం. రబీలో కూడా సాయం చేసే విధంగా  ఉండాలని చెప్పినప్పుడు, ఆయన ఐదు నిమిషాల్లో తన నిర్ణయం ప్రకటిస్తూ... ఇచ్చే మొత్తాన్ని ఖరీప్‌లోనూ, రబీలోనూ కాదు సంక్రాంత్రికి కూడా పండగ కానుకగా రెండువేలు ఇచ్చే విధంగా రూ.12500 నుంచి రూ.13500 పెట్టుబడి సాయాన్ని పెంచుతూ కేవలం ఐదు నిమిషాల్లో వందల కోట్ల భారాన్ని భరించడానికి కూడా నిర్ణయం తీసుకున్నారని చెప్పారు.   అధికారంలోకి వచ్చి నాలుగు నెలలైంది. నాలుగు నెలల్లో వ్యవసాయ రంగానికి చేసిన సేవలు చూస్తే.. ఆశ్యర్యం కలుగుతుందన్నారు.


ఇవాళ వై.యస్‌.ఆర్‌. రైతు భరోసా పథకం ఒక్కటే కాదని, ఈ పథకంతో పాటు ఉచితంగా పంటల భీమా పథకం, వడ్డీ లేని పంట రుణాలిచ్చే కార్యక్రమంతో పాటు చంద్రబాబు నాయుడు గారు బకాయి పడి, రెండువేల కోట్ల రూపాయలు ఇన్‌పుట్‌ సబ్సిడీని కూడా ఎగ్గొడితే ఆ డబ్బులు కూడా నేనే ఇస్తానని ముఖ్యమంత్రి శ్రీ వై.యస్‌ జగన్‌ నెరవేర్చారన్నారు.


దీంతో పాటు  మూడువేల కోట్ల రూపాయలతో ధరల స్ధిరీకరణనిధిని ఏర్పాటు చేసి, ఉచిత బోర్లని మీ పొలాల్లో రైతులు నమోదు చేసుకుంటే మంజూరు చేస్తామన్న విషయాన్ని గుర్తు చేశారు.


 మరోవైపు పామాయిల్‌ రైతులు, పొగాకు రైతులు మొదలుకుని రొయ్యలు పండించే రైతుల వరకు ఆయన దృష్టికి వచ్చిన ప్రతీరైతుకి,  ప్రతీ ఒక్క విభాగానికి సాయం చేస్తున్న నేత మన ముఖ్యమంత్రి అని కొనియాడారు.


ఇదే సమయంలో  తెలుగుదేశం పార్టీ వాళ్లను చూస్తుంటే  జాలేస్తుందన్నారు. వాళ్ల బాధ వర్ణణాతీతమని మంత్రి కన్నబాబు ఎద్దేవా చేశారు. మేం ఖాలీ ఖజానా అప్పజెప్పాం. రూపాయి లేకుండా అప్పజెప్పాం. నలభైవేల కోట్ల రూపాయలు పెండింగ్‌ బిల్లులు అప్పజెప్పాం. ఈయనేం జేస్తారులే. ఏం చేయగలరు లే ఆనుకున్నారని, కానీ వాళ్ల దురదృష్టమేమిటంటే, సీఎం జగన్మోహన్‌ రెడ్డి , ఆయన చెప్పినవే కాకుండా, చెప్పనవీ కూడా నాలుగు నెలల్లో చేసి చూపిస్తుంటే ఏం చేయాలో అర్ధం కాకుండా టిడిపి వాళ్లకు మైండ్‌ బ్లాంక్‌ అయిందన్నారు.


 గత మూడు, నాలుగు రోజుల నుంచి చంద్రబాబుతో పాటు టిడిపి నాయకులు జగన్మోహన్‌ రెడ్డిగారు మడమ తిప్పరు, మాట తప్పారు అంటారు గదా... ఆదిగో మాట తప్పారంటూ మొదలు పెట్టారని.. అది ఏంటంటే.. నాలుగేళ్లు ఇస్తానన్న పెట్టుబడి సాయం  వై.యస్‌.ఆర్‌. రైతు భరోసా పథకాన్ని ఐదేళ్లకు పెంచడమేనన్నారు. ఏడాదికి రూ.12500 ఇస్తానన్నా దానిని రూ.13500కు పెంచితే మాట తప్పనట్లు, నాలుగేళ్లలో రూ.50వేలు పెట్టుబడి  సాయం అన్నదాన్ని రూ.67500కు పెంచితే వాళ్లకు మాట తప్పినట్లు, అందుకనే ఇప్పుడు బాధపడిపోతా ఉన్నారని వ్యాఖ్యానించారు.


 సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ ఇలా చేసుకుంటూ పోతే  ఆ పార్టీకి పుట్టగతులుండవేమో అన్న భయం వారికి పట్టుకుందన్నారు. అందుకే రైతులకు సంబంధించి  రాజకీయ చేయొద్దని, రైతులను రాజకీయాలకు ముడివేస్తే మీరే నష్టపోతారని హెచ్చరించారు. ఇప్పటికి జరిగిన శాస్తి చాలదా అని ప్రశ్నించారు.


 మీరు చేసిన పాలనలో రుణమాఫీని ఒక్కసారి గుర్తుతెచ్చుకోవాలని సూచించారు. మీరు ఆ రోజు రూ.84వేల కోట్ల రుణమాఫీ చేస్తానని హామీ ఇచ్చి, కేవలం రూ.24వేల కోట్ల రూపాయలకు కుదించి, రూ.15వేల కోట్లు  ఇచ్చి, రుణమాఫీ కోస తెచ్చిన డబ్బును కూడా పసుపు,కుంకాల కోసం మల్లించి, మీ ఇష్టానుసారం చేసిన చరిత్ర మీదని గుర్తు చేసారు.


ఇక చెప్పనవి, చెప్పినవి కూడా నాలుగు నెలల్లో చేసి చూపిస్తున్న చరిత్ర మా నాయకుడు జగన్మోహన్‌రెడ్డిగారిదని స్పష్టం చేశారు. వ్యవసాయం మీద సీఎంకున్న శ్రద్ధ వల్లే..  ఈ రాష్ట్రంలో యూరియాకు కొరత లేదని, పొరుగు రాష్ట్రాల్లో యూరియా విపరీతమైన కొరత వచ్చిందన్నారు. ఖాలీ ఖజానా ఇచ్చినా.... సీఎంగా మీరు  చేస్తున్న ఈ సాహసానికికృతజ్ఞతలు తెలియజేస్తున్నానన్నారు.


 మరోవైపు గతంలో ఏ పథకాలైనా సరే కేంద్రం నుంచి నిధులొస్తే, చంద్రన్నబాట, చంద్రన్న పాట అని పేరు పెట్టుకునేవారని,  కానీ ఇవాళ ముఖ్యమంత్రి శ్రీ జగన్‌ గారు  పారదర్శకంగా చేయాలన్న ఆలోచన చేశారని... కేంద్ర ప్రభుత్వం నిధులు కూడా ఈ పథకంలో కలిసాయి కనుక...  వై.యస్‌.ఆర్‌ రైతు భరోసా– పిఎం కిసాన్‌ అని నామకరణం చేసారన్నారు. బహుశా నాకు తెలిసి ఈ దేశంలో మీలాగా అంత విశాల ధృక్పధంతో పనిచేస్తున్న ముఖ్యమంత్రి మరొకరు ఉండరు అన్నారు.


 ఇంత పెద్ద క్రతువులో, ఇంత పెద్ద మహా యజ్ఞంలో స్ధానం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలిపారు.  పార్టీ పేరు యువజన శ్రామిక రైతు కాంగ్రెస్‌ని సార్ధకం చేస్తూ.. ఈ ఒక్క నెలలో 15 రోజుల్లో యువజనులకి గ్రామ సచివాలయాల్లో అక్టోబరు 2న  1.40 వేల ప్రభుత్వ ఉద్యోగాలిచ్చి ఒక చరిత్ర సృష్టించారని, ఇచ్చిన మాట ప్రకారం వై.యస్‌.ఆర్‌ వాహనమిత్ర క్రింద ఒక్కొక్క ఆటో సోదరుడుకి రూ.10వేలు ఇచ్చి శ్రామికులుకి మేలు చేశారన్నారు. ఇప్పుడు  రైతులకి రైతు భరోసా క్రింద ఇవాళ మీరు పెట్టుబడి సాయాన్ని అందిస్తున్నామన్నారు. యువజన,శ్రామిక, రైతు కాంగ్రెస్‌ అనే పార్టీ పేరుకి నిజమైన అర్ధాన్ని కేవలం ఒక నెలలోనే చేసిచూపించారని ప్రశంసించారు.