స్పీకర్‌కు లేఖ ఇస్తారనే ప్రచారం జరుగుతోంది.

గన్నవరం టిడిపి ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పార్టీ మారడం ఖాయమైన తరువాత...టిడిపిలో ఓ చర్చ జరుగుతోంది. 'వంశీ' తరువాత వెళ్లేదెవరనే దానిపై పార్టీ నాయకులు లెక్కలు కడుతున్నారు. ప్రస్తుతానికి ఎనిమిది మంది ఎమ్మెల్యేలు పార్టీ అధినాయకత్వానికి అందకుండా దూరంగా ఉన్నారని చెబుతున్నారు. వీరందరూ పార్టీని వీడతారని చెబుతున్నారు. అయితే 'వంశీ' తరువాత ఎవరు..? అనే దానిపై పార్టీ నాయకులు అంతర్గతంగా చర్చించుకుంటున్నారు. వీరిలో విశాఖపట్నానికి చెందిన మాజీ మంత్రి ముందు వరుసలో ఉన్నారు. ఆయన తరువాత ప్రకాశం జిల్లాకు చెందిన ముగ్గురు సభ్యులపై పార్టీ నేతలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వీరిలో 'కరణం బలరాం' బిజెపిలోకి వెళతారని ప్రచారం జరుగుతుండగా..ఆయన ఈ రోజు దానిపై ఖండన ఇచ్చారు. తాను 'సుజనాచౌదరి'ని మర్యాదపూర్వకంగా కలిశానని, తాను వెళ్లిన పెళ్లికి ఆయన వచ్చారని, అంతకు మించి ఏమీ లేదని ఆయన చెబుతున్నా..ఆయన వైఖరిపై పార్టీలో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇక మరో ఇద్దరు ప్రకాశం ఎమ్మెల్యేలపైనా అనుమానాలు ఉన్నాయి. వీరిలో ఒకరు గతంలో వైకాపా నుంచి వచ్చిన వారే కావడంవిశేషం. వీరు కాకుండా గుంటూరు జిల్లాకు చెందిన ఓ శాసనసభ్యుడు, రాయలసీమకు చెందిన సీనియర్‌ ఎమ్మెల్యే, శ్రీకాకుళం జిల్లాకు చెందిన మరో ఎమ్మెల్యే, విశాఖకు చెందిన ఓ ఎమ్మెల్యేపై పార్టీ నేతలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 


మొత్తం 23 మందిలో ఎనిమిది మంది పార్టీ మారతారని, వీరు..పార్టీ మారతారు..లేదా..ప్రత్యేకంగా తమను ఓ గ్రూపుగా గుర్తించమని స్పీకర్‌కు లేఖ ఇస్తారనే ప్రచారం జరుగుతోంది. ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డి సూచనలకు అనుగుణంగా వారు వ్యవహరిస్తారని అంటున్నారు. పార్టీ మారితే స్పీకర్‌ వెంటనే వేటు వేస్తారని, వేయాలని 'జగనే' అసెంబ్లీ సాక్షిగా చెప్పడంతో..వారు ఇప్పటికిప్పుడు పార్టీ మారరని, ఒక ప్రత్యేక గ్రూపుగా అసెంబ్లీలో ఉంటూ వైకాపాకు అనుకూలంగా వ్యవహరిస్తారని చెబుతున్నారు. అంతే కాకుండా ఇప్పుడు రాజీనామాలు చేసి ఎన్నికలకు వెళితే పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పలేమని, తమకు అనుకూలమైన పరిస్థితులు వచ్చేదాకా అలా ఉండి ఆ తరువాత రాజీనామాలు చేస్తారంటున్నారు.  మరోవైపు టిడిపిపైనా, టిడిపి అధినేత 'చంద్రబాబు'పైనా తీవ్రస్థాయిలో దాడి చేస్తారని, వీరిని అడ్డం పెట్టుకుని..టిడిపి గత చరిత్రను తవ్వి తీయాలని 'జగన్‌' భావిస్తున్నారట. మొత్తం మీద...టిడిపి అధినేతను చికాకు పెట్టేందుకు, ఆ పార్టీని బలహీనం చేసేందుకు, ఆ పార్టీని పుంజుకోనీయకుండా చేసేందుకు 'జగన్‌' జాగ్రత్తగా పావులు కదుపుతున్నారు.