విశాఖపట్నం, అమరావతి, తిరుపతిలో అంతర్జాతీయ ప్రమాణాలతో క్రీడా సముదాయాల నిర్మాణానికి సీఎం గ్రీన్‌ సిగ్నల్‌

ప్రపంచ పర్యాటక పటంలో ఏపీకి గుర్తింపు తెస్తాం...
* రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాసరావు 
* విశాఖపట్నం, అమరావతి, తిరుపతిలో అంతర్జాతీయ ప్రమాణాలతో క్రీడా సముదాయాల నిర్మాణానికి సీఎం గ్రీన్‌ సిగ్నల్‌
* ప్రతి జిల్లాల్లోనూ స్టార్ హోటళ్ల, స్పోర్టు కాంప్లెక్స్‌లు, కల్చరల్ అకాడమీల ఏర్పాటు
* ఇడుపులపాయలో 10 ఎకరాల్లో శిల్పారామం 
* బోట్ల నిర్వహణపై ఆరుగురు ఐఎఎస్‌లతో కమిటీ
* టూరిజం కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను తొలగించం 
అమ‌రావ‌తి:  ప్రపంచ పర్యాటక పటంలో ఆంధ్రప్రదేశ్‌కు గుర్తింపు వచ్చేలా తమ ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోందని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు (అవంతి శ్రీనివాసరావు) తెలిపారు. రాష్టంలో 15 నుంచి 20 పర్యాటక ప్రాంతాలను ఎంపిక చేసి, అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేయనున్నామని, ప్రతి జిల్లాలోనూ స్పోర్ట్సు కాంప్లెక్స్ లు, వాటి పక్కనే కల్చరల్ అకాడమీలు ఏర్పాటు చేయనున్నామని వెల్లడించారు. 13 జిల్లాల్లోనూ5, 7 స్టార్ హోటళ్ల ఏర్పాటుకు కార్యాచరణ సిద్ధం చేస్తున్నామన్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో  టూరిజం, ఆర్కియాలజీ, యూత్‌ ఎఫైర్స్‌ శాఖల పనితీరుపై శుక్రవారం సీఎం నివాసంలో సమీక్షా సమావేశం నిర్వహించామన్నారు. ఈ సమావేశంలో టూరిజంతోపాటు చారిత్రక ప్రాంతాల అభివృద్ధి తో పాటు జిల్లాల్లో క్రీడా సదుపాయాల ఏర్పాటుపై సుదీర్ఘంగా చర్చ జరిగిందన్నారు. రాష్ట్రంలో అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధిచేయాల్సిన ప్రాంతాలను ముందుగా ఎంపిక చేసిన తక్షణమే వివరాలు అందజేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశించారన్నారు. అతిథ్యం, పర్యాటక రంగంలో అంతర్జాతీయస్థాయిలో పేరు ప్రఖ్యాతలున్న సంస్థల చేత హోటళ్లు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఇదే సమయంలో కళింగపట్నం, విశాఖపట్నం, కాకినాడ, రాజమండ్రి, పోలవరం, సూర్యలంక, హార్సిలీ హిల్స్, ఓర్వకల్లు, గండికోట తదితర ప్రాంతాలను అధికారులు ప్రతిపాదించగా, పూర్తిస్థాయి వివరాలతో తనకు మళ్లీ సమాచారం అందించాలని సీఎం అధికారులను ఆదేశించారు. గండికోట అడ్వెంచర్‌ అకాడమీ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి అవంతి శ్రీనివాసరావు అక్కడ తెలిపారు. రాష్ట్రంలో చారిత్రక స్థలాల అభివృద్ధి, మౌలిక సదుపాయాలను కల్పించడానికి, వాటిని సరిగ్గా నిర్వహించడానికి ఆర్కియాలజీ కార్పొరేషన్‌ ఏర్పాటుకు సీఎం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారన్నారు. కొండపల్లికి రోడ్డు, లైట్ల సదుపాయం, బాపు మ్యూజియంలో అభివృద్ది కార్యక్రమాలను తక్షణమే పూర్తిచేయాలని సీఎం ఆదేశించారన్నారు. 
                                          కృష్ణా, గోదావరిలో మరలా బోట్ల నిర్వహణపై  సమావేశంలో చర్చకు వచ్చిందని, నదీతీరాల్లో కంట్రోల్‌ రూమ్స్‌ ఏర్పాటుపై  ఈ సందర్భంగా సీఎం ఆరాతీశారని మంత్రి వెల్లడించారు. నిర్దిష్టమైన నిర్వహణా పద్ధతులు, కంట్రోల్‌ రూమ్ ల ఏర్పాటు చేయనున్నామన్నారు.  ఆరుగురు ఐఏఎస్ లతో కూడిన కమిటీ ఏర్పాటు చేశామని, ఈ కమిటీ నివేదిక వచ్చిన తరవాత విధివిధానాలు రూపొందిస్తామన్నారు. అనంతరం కమాండ్ కంట్రోల్ రూమ్ లు అనుమతులున్న బోట్లు తిప్పే అవకాశం కలుగుతుందన్నారు. పర్యాటకులు, ప్రయాణికులకు సరైన భద్రతా ప్రమాణాలు ఉన్నాయని సంతృప్తి చెందిన తర్వాతనే బోట్లకు అనుమతి ఇవ్వాలని అధికారులను సీఎం ఆదేశించారన్నారు. 


ఇడుపులపాయలో శిల్పారామం ఏర్పాటు...
శిల్పారామాల్లో ప్రస్తుత పరిస్థితిపైనా సీఎం సమీక్ష చేశారని మంత్రి వెల్లడించారు. ప్రస్తుతం ఉన్న శిల్పారామాల అభివృద్ధి, వాటిలో గ్రీనరీని పెంచడంపై అధికారులకు సీఎం పలు సూచనలు చేశారన్నారు. శిల్పారామాల నిర్వహణకు ఇబ్బందిలేకుండా విధానాన్ని తయారుచేయాలని సీఎం అధికారులను ఆదేశించారన్నారు. ప్రతి జిల్లాలోనూ కల్చరల్‌ అకాడమీ ఏర్పాటుకు సీఎం నిర్ణయం తీసుకున్నారన్నారు. అయిదెకరాల్లో ఈ అకాడమీలను నిర్మించాలని, రెండేళ్లలోగా వీటిని పూర్తిచేయడానికి అన్ని చర్యలూ తీసుకోవాలని సీఎం ఆదేశించారన్నారు. సంగీతం, నాట్యం సహా ఇతర కళల్లో శిక్షణ, బోధన, ప్రదర్శనలకు కల్చరల్‌ అకాడమీలు వేదిక కావాలన్నారు. కళలు, సంస్కృతిని నిలుపుకోవడానికి, వాటి ప్రాముఖ్యత పెంచడానికి ఈ అకాడమీలు ఉపయోగపతాయని సీఎం తెలిపారన్నారు. కడప జిల్లాలో ఇడుపులపాయలో 10 ఎకరాల్లో శిల్పారామం ఏర్పాటు చేయనున్నామన్నారు. 


జిల్లాకో క్రీడా సముదాయం ....
రాష్ట్రంలో క్రీడలు, సదుపాయాలపైనా ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌ సమీక్షించారని మంత్రి తెలిపారు. విశాఖపట్నం, విజయవాడ, తిరుపతిలో అంతర్జాతీయ ప్రమాణాలతో క్రీడా స్టేడియాల నిర్మాణానికి సీఎం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారన్నారు. ప్రతి జిల్లాలోనూ స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌ ఏర్పాటుకు ప్రణాళిక సిద్ధంచేయాలని సీఎం అధికారులను ఆదేశించారన్నారు. గ్రామీణ ప్రాంత క్రీడాకారులను ప్రోత్సాహించాలని సమావేశంలో నిర్ణయించామన్నారు. బంగారు పతకం సాధించిన వారికి రూ.5 లక్షలు,  వెండి పతకం విజేతలకు రూ.3 లక్షలు, కాంస్యం పతకం సాధిస్తే రూ.2 లక్షల చొప్పున్న ప్రోత్సాహకం అందించనున్నామన్నారు. జాతీయ స్థాయి క్రీడల్లో ప్రతిభ చూపిన వారికి అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధించేలా శిక్షణ అందివ్వాలని సీఎం జగన్ ఆదేశించారన్నారు.


టూరిజం కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను తొలగించం...
రాష్ట్రంలో యువతకు మిగిలిన ప్రాంతాల్లో ఉన్న సంస్కృతీ, సంప్రదాయాలపై అవగాహన కలిగించేలా చర్యలు తీసుకోబోతున్నామన్నారు. ఇతర రాష్ట్రాల సంస్కృతీ, సంప్రదాయాలపైనా రాష్ట్ర యువతకు అవగాహన కల్పిస్తామన్నారు. పర్యాటక శాఖలో పనిచేసే కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను తొలగించే ప్రసక్తే లేదని మంత్రి అవంతి శ్రీనివాసరావు స్పష్టం చేశారు. వాళ్లంతా చిత్తశుద్ధితో పనిచేసి, టూరిజం శాఖ పరిధిలో ఉన్న రిసార్టులను ప్రైవేటు హోటళ్లుకు ధీటుగా సేవలు అందించాలని ఆయన కోరారు. సమావేశంలో రాష్ట్ర అధికార భాషా అమలు సంఘం అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ పాల్గొన్నారు.