కలిగిరి లో కిరికిరి

*కలిగిరిలో సబ్సిడీ విత్తనాల పంపిణీలో అధికారుల కిరికిరి...!*. అర్హులకు అన్యాయం...అసంబద్ధులకు న్యాయం....
కలిగిరి: కలిగిరి మండలంలో ప్రస్తుత సీజన్ లో రైతులకు సబ్సిడీ విత్తనాలు పంపిణీ చేయడంలో వ్యవసాయ శాఖ అధికారులు పూర్తిగా విఫలం చెందారనే విమర్శలు వినిపిస్తున్నాయి. జిల్లాలో ఏ మండలంలో లేని విధంగా కలిగిరి మండలంలోని రైతులకు విత్తనాలు సరఫరా పలు విమర్శలకు తావిస్తున్నది. అధికారులు నియమ నిబంధనల ప్రకారం సబ్సిడీ విత్తనాలు అందజేశారా లేక దొడ్డి దారిలో ముడుపులు పుచ్చుకుని అక్రమాలకు తెర తీశారా అనే సందేహాలు వెలువడుతున్నాయి. మండలంలో కురిసిన వర్షాల శాతమును దృష్టిలో ఉంచుకుని పచ్చి శనగలు, పెసలు, బి.పి.టి, 1010, నెల్లూరు మసూరా రకాలకు చెందిన వరి విత్తనాల పంపిణీలో వ్యవసాయ శాఖాధికారులు యధేచ్చగా అక్రమాలకు పాల్బడ్డారనే విమర్శలు జోరుగా వినిపిస్తున్నాయి. ఒకవైపు ముఖ్యమంత్రి వై.యస్.జగన్ మోహన్ రెడ్డి మాత్రం రైతుల శ్రేయస్సు కోసం దివంగత మహానేత వై.యస్.రాజశేఖర్ రెడ్డి ఆశయాలకు అనుగుణంగా పని చేస్తున్నామని పదే పదే హామీలు గుప్పిస్తున్నా కలిగిరి మండలంలో మాత్రం రైతులకు వ్యవసాయ శాఖాధికారులు అన్యాయం చేస్తూ విత్తనాలను అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. రైతులకు సకాలంలో విత్తనాలను సరఫరా చేయాల్సిన సంబంధిత వ్యవసాయ శాఖ అధికారులు ఇటీవల కాలంలో బయో మెట్రిక్ పరికరాలు పనిచేయడం లేదు...తర్వాత చూద్దామని చెప్పడంలో ఆంతర్యమేమిటని పలువురు రైతులు ప్రశ్నిస్తున్నారు. ఈ విషయమై కలిగిరి మండల వ్యవసాయాధికారి సురేష్ కుమార్ ను వివరణ కోరేందుకు వెళ్ళగా మా ఏ.డి.ఏ రామిరెడ్డి గారు వస్తున్నారని సమాధానం దాటవేశారు. ఏ.డి.ఏ రామిరెడ్డి కలిగిరి వచ్చారు కానీ రైతుల సమస్యలను పట్టించుకున్న ధాఖలాలు లేవని వారంటున్నారు.