తెప్పోత్సవంలో భద్రతకే అధిక ప్రాధాన్యం ఇద్దాం

 


 


విజయవాడ :


తెప్పోత్సవంలో భద్రతకే అధిక ప్రాధాన్యం ఇద్దాం 
* రెండంచెల భద్రతతో సమస్వయ శాఖల సూచనలు అమలుచేద్దాం
* కలెక్టర్ ఇంతియాజ్, సీపీ ద్వారకా తిరుమలరావు 
 ఇంద్ర‌కీలాద్రి శ్రీదుర్గామల్లేశ్వరస్వామివార్ల దసరా ఉత్సవాల ముగింపు రోజు నిర్వహించే తెప్పోత్సవం కోసం నిర్దిష్టమైన ప్రణాళికలను పగడ్బందీగా అమలు చేయాలని కలెక్టర్ ఏయండి. ఇంతియాజ్, విజయవాడ నగర పోలీసు కమీషనర్ ద్వారకా తిరుమలరావు స్పష్టం చేశారు. ఆదివారం మోడల్ గెస్ట్‌హౌస్‌లో తెప్పోత్సవం ఏర్పాట్లపై రెవెన్యూ, పోలీస్, దేవాదాయ, ఇరిగేషన్, డిజాస్టర్ మేనేజ్‌మెంట్, దేవస్థానం, మున్సిపల్ తదితర శాఖల అధికార్లతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఏయండి ఇంతియాజ్ మాట్లాడుతూ తెప్పొత్సోవానికి ఏర్పాటు చేసిన పంటు, అనుబంధ పంట్లు విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. అదేసమయంలో బోటుపై ప్రయాణించే వారి వివరాలు, అనుబంధ పంట్లలో ప్రయాణం చేసే వారి వివరాల‌ను బోటు సామర్థ్యాన్ని దృష్టిలో ఉంచుకోవాలన్నారు. ఈ విషయంలో మరో మాటకు తావులేకుండా సమన్వయ శాఖలు చర్యలు తీసుకోవాలన్నారు. ఎంత కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తే అంత మంచిదన్న విషయాన్ని మరువరాదని కలెక్టర్ చెప్పారు. బోటు నిర్మాణం, సామర్థ్యం విషయాలపై నిపుణులతో తనిఖీ చేయించి తగిన నివేదికను రూపొందించాలన్నారు. అదేవిధంగా మెరైన్ విభాగాలలోని ప‌లు శాఖల అధికారులు, విపత్తుల నిర్వహణాధికారులతో క్షేత్రస్థాయిలో తనిఖీలను చేపట్టి సమర్ధంగా తెప్పోత్సవాన్ని నిర్వహిద్దామన్నారు. పాసుల విషయంలో బోటులో వచ్చేవారి విషయంలో మరింత జాగ్రత్తతో వ్యవహరించాలని నిర్దిష్టమైన సంఖ్య కంటే తక్కువగానే బోటులోకి అనుమతించాలన్నారు. ఎగువ ప్రాంతాల నుంచి రాబోయే రెండు రోజులలో విడుదల చేసే నీటి విషయమై సంబంధింత అధికారులకు లేఖలు రాస్తానని ఇరిగేషన్ శాఖ ఆధ్వర్యంలో తెప్పోత్సవం తిరిగే ప్రాంతంలో ఎంత మేరకు నీటి మట్టాలు ఉండాలో సూచనలు, నివేదికలను అందించాలన్నారు. 
                             నగర పోలీసు కమీషనర్ ద్వారకా తిరుమలరావు మాట్లాడుతూ ప్రముఖులు, పాత్రికేయులు, వేదపండితులు, ఇతర ప్రాధాన్యత శాఖల అధికారుల వివరాలతో తెప్పోత్సవ రథంపై ప్రయాణం చేసే వారి వివరాలు సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. శ్రీదుర్గామల్లేశ్వర స్వామివార్ల తెప్పొత్సవం మంగళవారం నిర్వహించటం జరగుతుందని ఇందుకోసం భద్రతకే అధిక ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుందన్నారు. ప్రకాశం బ్యారేజ్ తదితర ప్రాంతాలలో రద్దీని నివారించే విషయంలో రక్షణ ఏర్పాట్లలో చురుకైన ఏర్పాట్లు చేయాలన్నారు. అదేవిధంగా ఘాట్లలో నుండి తెప్పోత్సవాన్ని తిలకించేందుకు సామర్థ్యానికి అనుగుణంగా ఘాటు పాసులు జారీ చేయాలన్నారు. ఇండియన్ రిజిస్టర్ షిప్పింగ్ సంస్థ అధీకృత అధికారి, మెరైన్ పోర్టు ట్రస్ట్ సర్వేయర్లు, నిపుణుల సూచనలను ముందుగానే తీసుకోవాలని ఇందుకోసం ఆర్ అండ్ బి, ఇరిగేషన్, ఫిషరీస్, రిజర్వ్ కన్వెజరేటర్, ఎన్టీఆర్ఎఫ్ బృందాలు తదితర శాఖల సమన్వయంతో కట్టుదిట్టమైన ఏర్పాట్లను సిఫారసు చేసే దిశలో ప్రణాళికలను అమలు చేయాలని సీపీ ద్వారకా తిరుమలరావు తెలిపారు. తెప్పోత్సవం సమీక్షలో నగర మున్సిపల్ కమీషనర్ ప్రసన్న వెంకటేష్ మాట్లాడుతూ కాకినాడ, విశాఖపట్నం పోర్టు ట్రస్ట్ అధికారులతో మాట్లాడటం జరిగిందని వారు ఈ రంగంలో ఎంతో నిపుణుత కల్గి ఉన్నారన్నారు. వారి ఆధ్వర్యంలో పనిచేసే నిపుణుల సలహాలను పరిగణనలోకి తీసుకోవాలని కట్టుదిట్టమైన భద్రతను కల్పించగల్గుతామన్నారు. సమావేశంలో డీసీపీ విజయరావు, దేవస్థానం ఈవో ఎం.వి.సురేష్‌బాబు, ఏసీపీలు, విజయవాడ ఇన్‌ఛార్జ్ సబ్ కలెక్టర్ చక్రపాణి, జేసీ-2 మెహర్‌బాబా, తదితర అధికారులు పాల్గొన్నారు.