శ్రీసిటీలో ఆదాయపన్ను కొత్త నిబంధనలపై సదస్సు

అంతిమతీర్పు - నెల్లూరు జిల్లా - శ్రీసిటీ 16.10.2019
 


 

ఆదాయపు పన్నుకొత్త నిబంధనలపై శ్రీసిటీలో సదస్సు 

 

 

పన్నుల చట్టాలు (సవరణ) ఆర్డినెన్స్ 2019 ప్రకారం, ఆదాయపు పన్ను విభాగాలలో చేసిన ఇటీవలి మార్పులు, కొత్త నిబంధనలపై  ఉత్పాదక పరిశ్రమల సీనియర్ ఫైనాన్స్ ఎగ్జిక్యూటివ్ లకు అవగాహనా సదస్సు బుధవారం శ్రీసిటీలో నిర్వహించారు. శ్రీసిటీ సెజ్ డెవలప్మెంట్ కమిషనర్ కార్యాలయం మరియు శ్రీసిటీ సంయుక్త ఆధ్వర్యంలో స్థానిక బిజినెస్ సెంటర్ లో చేపట్టిన ఈ సదస్సులో నెల్లూరు సర్కిల్ -1 ఆదాయపు పన్ను డిప్యూటీ కమిషనర్ డాక్టర్ ఎస్.కె.సెంథిల్ కుమార్ ముఖ్యఅతిధిగా పాల్గొన్నారు. 

శ్రీసిటీ సెజ్ డెవలప్మెంట్ కమిషనర్ ఆర్.ముత్తురాజ్ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతినిధులను స్వాగతం పలికి, సదస్సు ఉద్దేశ్యాలను వివరించడంతో పాటు, ఈ చర్చలో చురుగ్గా పాల్గొనవలసిందిగా వారికి విజ్ఞప్తి చేశారు.     
 

శ్రీసిటీ వ్యవస్థాపక మేనేజింగ్ డైరెక్టర్ రవీంద్ర సన్నారెడ్డి మాట్లాడుతూ, ఈ కార్యక్రమం నిర్వహించడానికి ఆసక్తి చూపిన ముత్తురాజ్, డాక్టర్ సెంథిల్ కుమార్ లకు కృతజ్ఞతలు తెలిపారు. ఎగ్జిక్యూటివ్స్ సంబంధిత రంగాలలో వారి జ్ఞానాన్నిపెంపొందించుకోవడానికి ఇదో మంచి అవకాశమన్న ఆయన, 
 వివిధ విభాగాలలో  ఈ తరహా కార్యక్రమాలు శ్రీసిటీ తరచూ నిర్వహిస్తోందన్నారు. శ్రీసిటీలోని పరిశ్రమల ప్రతినిధులందురు తమ ఆలోచనలను నిపుణులతో పంచుకునేందుకు, కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఇది తప్పకుండా ఒక గొప్ప అవకాశమని ఆయన పేర్కొన్నారు. 

ప్రత్యేకించి ఉత్పాదక పరిశ్రమలకు సంబంధించి పన్నుల చట్టాలు (సవరణ) ఆర్డినెన్స్ 2019 లో ఇటీవలి మార్పులు, కొత్త నిబంధనలపై డాక్టర్ సెంథిల్ ప్రసంగించారు. కొత్త సెక్షన్లు 115BAA, 115BAB లలో నిర్దేశించిన షరతులు, మినహాయింపులు, తగ్గింపులు మరియు కార్పొరేట్ సామాజిక బాధ్యత నిధుల యొక్క మెరుగైన పరిధి మొదలైన వాటి గురించి ఆయన వివరించారు.

ఈ సమావేశంలో శ్రీసిటీలోని పలు పరిశ్రమలకు చెందిన ఫైనాన్స్ ఎగ్జిక్యూటివ్‌లు, ఉన్నతశ్రేణి అధికారులు పాల్గొని వారి పలు సందేహాలను నివృత్తి చేసుకున్నారు.