రేపు ప్రపంచ ఆహార దినం. అందుకే ఒకరోజు ముందు రైతు భరోసా

కాకుటూరు, నెల్లూరు జిల్లా


'వైయస్సార్‌ రైతు భరోసా–పీఎం కిసాన్‌' పథకం ప్రారంభోత్సవంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రసంగంలో ముఖ్యాంశాలు:


– ఇవాళ దాదాపు 40 లక్షల రైతుల కుటుంబాలకు ఇవాళ సహాయం అందుతోంది
– మిగిలిన 14 లక్షల రైతుల కుటుంబాలకు కూడా 'వైయస్సార్‌ రైతు భరోసా–పీఎం కిసాన్‌' పథకంలో సహాయం అందుతుంది
–అర్హత ఉన్న ప్రతి రైతు ఖాతా అప్‌డేట్‌ చేస్తూ ప్రతి బుధవారం నాడు, రైతు భరోసా కింద సహాయం చేస్తాము
– నవంబరు 15 వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుంది.
– కాబట్టి ఎవరైనా మిగిలిపోతే గ్రామ సచివాలయాలు, ఎమ్మార్వో ఆఫీస్, కలెక్టరేట్‌ లేదా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు
– మరో రెండు రోజుల్లో సంబంధిత వెబ్‌సైట్‌ లాంచ్ చేయబోతున్నాము
– రేపు ప్రపంచ ఆహార దినం. అందుకే ఒకరోజు ముందు రైతు భరోసా పథకం ప్రారంభం.
– కాసేపట్లో రైతుల ఖాతాల్లో నగదు జమ అవుతుంది. 
– రైతు బిడ్డగా నెల్లూరు వచ్చాను. ప్రతి రైతు చరిత్ర మార్చే గొప్ప పథకానికి ఇవాళ నాంది పలుకుతున్నాము.
– 2014 తర్వాత రాష్ట్రంలోని రైతులు చాలా నష్టపోయారు. ఆ పరిస్థితి మనమంతా చూశాం
– 2017, జూలై 8న మహానేత వైయస్సార్‌ జయంతి రోజు మంగళగిరిలో పార్టీ ప్లీనరీ జరిగింది. ఆరోజు రైతులకు ఒక మాట చెప్పాను.
– 5 ఎకరాల లోపు ఉన్న రైతులు, చిన్న, సన్నకారు రైతులకు అధికారంలోకి వచ్చిన వెంటనే రూ.50 వేలు ఇచ్చే ఏర్పాటు చేస్తాము. ఏటా రూ.12,500 ఒకేసారి ఈ మొత్తం మే నెలలో ఇస్తాము. సాగు పెట్టుబడిగా ఆ సహాయం చేస్తాము. ఆ మొత్తం బ్యాంకులు రుణానికి జమ చేసుకోకుండా చర్యలు చేపడతాము. వైయస్సార్‌ భరోసా గా దాన్ని అమలు చేస్తాము' అని చెప్పాను.
– ఆ వాగ్ధానానికి మరింత మెరుగులు దిద్ది, రెండు పేజీల మేనిఫెస్టోలో తొలి వాగ్ధానంగా ప్రకటించాము. 
– మేనిఫెస్టోలో చెప్పిన దానికి మరింత మెరుగులు దిద్ది, సహాయం కూడా పెంచి ఈ పథకం అమలు చేస్తున్నాము.
– అదే విధంగా 8 నెలల ముందుగానే అమలు చేస్తున్నాము
– వచ్చే ఏడాది నుంచి ఖరీఫ్‌ పంట వేసే సమయంలో మే నెలలో రూ.7500, అక్టోబరులో రబీ అవసరాలు తీరేలా రూ.4 వేలు, ధాన్యం ఇంటికి చేరే వేళ సంక్రాంతి పండగ వేళ మరో రూ.2 వేలు ఇవ్వబోతున్నాము.
– గతంలో చెప్పినట్లు రూ.12,500 కంటే ఎక్కువ రూ.13,500 ఇవ్వబోతున్నాము. 
– ఆ సహాయం కూడా నాలుగేళ్లకు కాకుండా 5 ఏళ్లు ఇవ్వబోతున్నాము. ఆ విధంగా ప్రతి రైతు కుటుంబానికి రూ.67,500 ఇవ్వబోతున్నాము
– గత ప్రభుత్వం సాధికార సర్వే ద్వారా 43 లక్షల రైతులను గుర్తించగా, ఈ ప్రభుత్వం పక్కా సర్వేతో 51 లక్షల రైతు కుటుంబాలను గుర్తించింది.
– ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలలో భూమి లేని నిరుపేదలైన కౌలు రైతులు 3 లక్షల మందికి కూడా ఈ పథకంలో సహాయం చేస్తున్నాము
– ఆ విధంగా మొత్తం 54 లక్షల రైతుల కుటుంబాలకు మేలు చేయబోతున్నాము
– ఇప్పటికే గత జూన్‌లో రూ.2 వేలు మీకు సహాయంగా అందింది.
– ఇప్పుడు బటన్‌ నొక్కగానే మీమీ ఖాతాల్లో రూ.9 వేలు జమ అవుతాయి
– ఆ తర్వాత సంక్రాంతి పండగ సమయంలో మరో రూ.2 వేలు అందిస్తాము
– చెప్పిన దాని కంటే ముందుగా, మాట ఇచ్చిన దాని కంటే ఎక్కువ ఇస్తూ మీ బిడ్డగా అడుగు ముందుకేస్తున్నాను
– అధికారం చేపట్టగానే ప్రతి హామీ అమలు చేస్తున్నాము. వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌ పగలే సరఫరా చేస్తున్నాము
– పంటల బీమా కోసం 55 లక్షల రైతుల తరపున 56 లక్షల హెక్టార్ల భూమికి సంబంధించి రూ.2164 కోట్లు ప్రీమియమ్‌గా చెల్లిస్తోంది.
– కౌలు రైతులకు కూడా భరోసా ఇచ్చే విధంగా అసెంబ్లీ తొలి సమావేశాల్లోనే చట్టం చేశాం.
– రూ.1.5 లక్షల లోపు రుణం తీసుకున్న రైతులకు సున్నా వడ్డీ రుణం అమలు చేస్తున్నాం
– ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తున్నాము
– 2019 ఖరీఫ్‌లో రికార్డు స్థాయిలో 6.6 లక్షల క్వింటాళ్ల విత్తనాలు సరఫరా చేశాము. 
– కరువులో రైతులను ఆదుకునేందుకు రూ.2 వేల కోట్లతో ప్రకృతి వైపరీత్యాల సహాయ నిధి ఏర్పాటు చేశాం
– ధాన్య సేకరణలో గత ప్రభుత్వం రూ.960 కోట్లు బకాయి పెడితే, ఆ మొత్తాన్ని తీర్చేశాం
– ఇన్‌పుట్‌ సబ్సిడీ కూడా దాదాపు రూ.2 వేల కోట్లు ఉండగా, అది కూడా చెల్లించాము.
– శనగ రైతులను ఆదుకునేందుకు క్వింటాలుకు రూ.1500 చొప్పున సహాయం చేశాం.
– పామాయిల్‌ రైతులకు రూ.87 కోట్లు ఇచ్చి అండగా నిల్చాం
– రైతులు బలవన్మరణానికి పాల్పడితే వారికి వెంటనే రూ.7 లక్షల సహాయం ఇస్తున్నాం. దాన్ని కలెక్టర్‌ స్వయంగా అందజేస్తున్నారు.
– రూ.770 కోట్లతో ఆక్వా రైతులకు రూ.1.50 కే యూనిట్‌ విద్యుత్‌ సరఫరా చేస్తున్నాము
– ఆవులు, గేదెలు, మేకలు గొర్రెలు చనిపోతే బీమా పరిహారం ఇస్తున్నాం
– వ్యవసాయ ట్రాక్టర్లకు రహదారి పన్ను రద్దు చేశాం
– గ్రామ సచివాలయం పక్కనే దుకాణం. అందులో నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు అందుబాటులో ఉంచుతాము.
– ఈ ఏడాదిలోనే ఇది జరగబోతుంది
– ప్రతి నియోజకవర్గంలో మ్యాపింగ్‌ చేసి, మండల కేంద్రాలలో కోల్డ్‌ స్టోరేజీలు నిర్మిస్తాము
– రెండు మూడు మండలాలను యూనిట్‌గా చేసుకుని ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు ఏర్పాటు చేస్తాము
– ప్రభుత్వం ప్రాజెక్టుల నిర్మాణాన్ని అవితీనిమయం చేసింది. అందుకే రివర్స్‌ టెండరింగ్‌ వి«ధానం తీసుకువచ్చాము
– ఎక్కడా అవినీతికి తావు లేకుండా పెండింగులో ఉన్న ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తాము
– జిల్లాలో మొత్తం 10 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలను ఇచ్చారు. మీకు ఏమిచ్చినా రుణం తీసుకోలేను
– కాబట్టి మీ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేను నీటి పారుదల మంత్రిగా చేశాము. జిల్లాలో పెండింగులో ఉన్న అన్ని ప్రాజెక్టులను పూర్తి చేస్తాము
– కండలేరు హైలెవెల్‌ కెనాల్, సర్వేపల్లి రిజర్వాయర్, పలు ఎత్తిపోతల పథకాలు.. ఇవన్నీ పూర్తి చేస్తాము