మహాత్మా గాంధీ ఆశయాలు ప్రతి ఒక్కరికీ  అనుసరణీయం

 


మహాత్మా గాంధీ ఆశయాలు ప్రతి ఒక్కరికీ  అనుసరణీయం.                   ---  ఎపి భవన్ ప్రత్యేక కమీషనర్ ఎన్ వి రమణారెడ్డి


 ** ఎపి భవన్లో ఘనంగా మహాత్మా గాంధీజీ జయంతి వేడుకలు.    


 న్యూ ఢిల్లీ, అక్టోబర్ 2, 2019:  గాంధీజీ ఆశయాలు ప్రతి ఒక్కరికీ అనుసరణీయమని ఆంధ్ర ప్రదేశ్భవన్ ప్రత్యేక కమీషనర్ ఎన్ వి రమణారెడ్డి ఉద్ఘాటించారు.  జాతిపిత మహాత్మా గాంధీ 150వ జయంతి వేడుకలను పురస్కరించుకుని ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ భవన్లు సంయుక్తంగా  డా. బి ఆర్ అంబెడ్కర్ ఆడిటోరియంలో బుధవారం ఏర్పాటు చేసిన కార్యక్రమములో ఎపి భవన్ ప్రత్యేక కమీషనర్ ఎన్ వి రమణారెడ్డి, ఓ ఎస్ డి, ఇంచార్జి రెసిడెంట్ కమీషనర్ శ్రీమతి భావన సక్సేనా, తెలంగాణ భవన్ రెసిడెంట్ కమీషనర్ వేదాంతం గిరి, ఎపి, తెలంగాణ భవన్ల అధికారులు సిబ్బందితో కలసి జ్యోతి ప్రకాశనం  గావించి మహాత్ముని చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి బాపూజీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.    ఈసందర్భంగా  ఎపి భవన్ ప్రత్యేక కమీషనర్ ఎన్ వి రమణారెడ్డి మాట్లాడుతూ గాంధీజీ కలలుకన్న గ్రామస్వరాజ్య వికాసానికి, గాంధీజీ ఆశయాల సాధనకు ప్రతిఒక్కరూ అకుంఠిత దీక్షతో కృషి చేయవలసిన ఆవశ్యకతను విశదీకరించారు.  అహింసాయుత మార్గంలో దేశస్వాతంత్య్ర సముపార్జనలో ఎనలేని కృషి చేసి ప్రాతః స్మరణీయునిగా ఘనతకెక్కిన మహనీయుని స్మరించుకోవడం మనందరి కర్తవ్యమని అన్నారు.  ఎపి భవన్ ఇంచార్జి రెసిడెంట్ కమీషనర్ శ్రీమతి భావన సక్సేనా మాట్లాడుతూ దేశ స్వాతంత్య్ర సాధన ఉద్యమంలో అందరిని ఏకతాటిపై నడిపి స్వాతంత్య్రాన్ని సిద్దింప చేసిన మహనీయుడు గాంధీజీ అని కొనియాడారు.   సమాజంలోని దురాచారాల నిర్మూలనకు, గ్రామస్వరాజ్య స్థాపనకు, పరిసరాల పరిశుభ్రతకు బాపూజీ చేసిన కృషి ఎనలేనిదని అన్నారు.  తెలంగాణ భవన్ రెసిడెంట్ కమీషనర్ వేదాంతంగిరి మాట్లాడుతూ "నా జీవితమే - నా సందేశం" అని సత్యం, అహింసయుత మార్గాలను ఆయుధాలుగా చేసుకుని స్వాతంత్రోద్యమంలో ప్రజలను ముందుకు నడిపి యావత్ భారతావనికి గాంధీజీ జీవితం దిక్సూచి అయినదని, అగ్రరాజ్యాలు సైతం గాంధీజీ సిద్ధాంతాలను, మార్గాన్ని అనుసరిస్తున్నాయని ప్రస్తుతించారు.
గాంధీజీతో సినీనేపద్య గాయకులు కీర్తిశేషులు ఘంటసాల వెంకటేశ్వర రావు ఇతివృత్తంగా బి. జగదీశ్ రూపొందించిన "గాంధీ మార్గంలో ఘంటసాల" సంక్షిప్త తెలుగు శబ్ద చిత్రాన్ని ప్రదర్శించారు.    ఈ కార్యక్రమములో ఎపిఐసి ప్రత్యేక అధికారి కంచర్ల జయరావు, లీగల్ సెల్ ప్రత్యేక అధికారిణి శ్రీమతి సరళాదేవి, అసిస్టెంట్ కమిషనర్లు, శ్రీమతి వెంకట రమణ, డా. కె. లింగరాజు, సాయిబాబు, ఎంవిఎస్ రామారావు, ఓఎస్డీ రవిశంకర్, డిఇఇ రవినాయక్, పిఏఓ కృష్ణారావు, తెలంగాణ భవన్ డిప్యూటీ కమీషనర్ జి. రామ్మోహన్, పరిపాలనాధికారిణి శ్రీమతి సంగీత, ఇరుభవన్ల ఉద్యోగులు, ఢిల్లీలోని తెలుగుసంఘాల ప్రతినిధులు, తదితరులు గాంధీజీ చిత్ర పటానికి పుష్పాంజలి ఘటించారు.


 ---